- ఎమ్మెల్యేలు, ఎంపీలూ హాజరు కావట్లే
- జిల్లా స్థాయి ఆఫీసర్లదీ అదేతీరు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ప్రజాసమస్యలను చర్చించి పరిష్కరించేందుకు వేదిక అయిన జిల్లాపరిషత్ మీటింగ్లకు మంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు డుమ్మా కొడుతున్నారు. ఈ సమావేశాల్లో గ్రామ, మండలస్థాయి సమస్యలను లోతుగా చర్చించేందుకు అవకాశం ఉంటుంది. ఇటు ప్రభుత్వ పెద్దలు.. అటు జిల్లా ఉన్నతాధికారులు ఉంటారు కాబట్టి అక్కడిక్కడే అధికారులకు దిశానిర్దేశం చేసి సమస్యలు పరిష్కరించే వీలుంటుంది. అయినా కీలకమైన ఈ సమావేశాలపట్ల లీడర్లు, ఆఫీసర్లు పట్టింపు లేనట్టు వ్యవహరిస్తున్నారని జడ్పీటీసీలు, మండల పరిషత్ ప్రెసిడెంట్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ లెక్కన మంగళవారం జరిగిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్మీటింగే ప్రస్తుత ఎమ్మెల్యేలకు చివరిది. ఈ మీటింగ్కు అందరూ వస్తారని ఆశించిన మండల ప్రజాప్రతినిధులకు ఈసారీ నిరాశే ఎదురైంది.
మంత్రి ఒక్కసారీ రాలే
ప్రతి మూడు నెలలకోసారి నిర్వహించే జడ్పీ మీటింగ్లకు ముఖ్యనేతలే ముఖం చాటేస్తున్నారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి ఒక్క మీటింగ్ కు కూడా అటెండ్ కాలేదు. ఖమ్మంలో ఏ చిన్న ప్రోగ్రాం అయినా మంత్రి పువ్వాడ అటెండ్ అవుతుంటారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లాగా ఏర్పడిన తర్వాత మొత్తం 18 మీటింగ్లు జరగ్గా ఆయన ఒక్కటంటే ఒక్క మీటింగ్కు కూడా రాలేదు. పల్లా కూడా ఒక్కసారీ సమావేశంలో పాల్గొనలేదు. పినపాక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు సగం మీటింగ్లకు డుమ్మా కొట్టారు.
ఆయన 9సార్లు మాత్రమే అటెండ్ అయ్యారు. మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ఒక్కసారి మాత్రమే వచ్చారు. ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ ఐదు సార్లు, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య , అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు మూడేసి సార్లు, వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ ఒక్కసారి, ఎమ్మెల్సీ అలుగుబల్లి నర్సిరెడ్డి నాలుగు సార్లు అటెండ్ అయ్యారు. తాతా మధు ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత ఆరు సార్లు మీటింగ్లు జరిగితే రెండు సార్లు మాత్రమే అటెండ్ అయ్యారు. మంగళవారం జరిగిన మీటింగ్కు మంత్రి, ఎమ్మెల్యేలు, ఎంపీలు దూరంగా ఉండగా ఒక్క తాతా మధు మాత్రమే వచ్చారు.
ఆఫీసర్లదీ అదే తీరు
జడ్పీ మీటింగ్ల పట్ల జిల్లా ఆఫీసర్లు కూడా నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల హెడ్లు రాకుండా తమ కింది అధికారులను పంపుతున్నారు. శాఖపరంగా పూర్తి అవగాహన లేక పోవడంవల్ల వారు మొక్కుబడిగా హాజరవుతున్నారు. జిల్లాలో ఏజెన్సీ ప్రాంతమే ఎక్కువ. అయినా ఐటీడీఏ పీఓ కూడా జడ్పీ మీటింగ్లను లైట్ తీసుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి.
మంగళవారం జరిగిన జనరల్ బాడీ మీటింగ్ఎజెండాలో ఐటీడీఏ, ఫారెస్ట్ అంశాలుండగా ఆయా డిపార్ట్మెంట్ల ఆఫీసర్ఒక్కరూ రాకపోవడం పట్ల ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీటింగ్కు మంత్రి ఇతర ముఖ్య నేతలు వస్తే ప్రధాన సమస్యలు కొంతవరకైనా పరిష్కారం అవుతాయని, వారు రాకపోవడంవల్ల జిల్లాకు అన్యాయం జరుగుతోందని జడ్పీటీసీలు, ఎంపీపీలు వాపోయారు.