బీఆర్ఎస్​ ప్రచార ఫ్లెక్సీలు తొలగించట్లే: దుర్గాప్రసాద్

ఖమ్మం టౌన్, వెలుగు: ఖమ్మం సిటీలోని పలు డివిజన్లలో అధికార పార్టీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, హోర్డింగులను మున్సిపల్​అధికారులు తొలగించడం లేదని డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ మండిపడ్డారు. తాత్కాలికంగా ముసుగు తొడిగి చేతులు దులుపుకుంటున్నారని చెప్పారు. మంగళవారం జిల్లా పార్టీ ఆఫీసులో సిటీ అధ్యక్షుడు జావీద్​తో కలిసి దుర్గాప్రసాద్​మీడియాతో మాట్లాడారు. అధికారులు నిష్పక్షపాతంగా పనిచేయాలన్నారు. 

వాల్​పోస్టర్లు తొలగించాలని, పెయింటింగ్స్ ను తుడిచేయాలని కోరారు. జావీద్ పేరుతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలకు రూ.4 లక్షలు జరిమానా వేసిన అధికారులకు అధికార పార్టీ ఫ్లెక్సీలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. స్పందించకపోతే కాంగ్రెస్​ఆధ్వర్యంలో తొలగిస్తామని హెచ్చరించారు. సమావేశంలో మహిళా విభాగం లీడర్ దొబ్బల సౌజన్య, కార్పొరేటర్ లకావత్ సైదులు తదితరులు పాల్గొన్నారు.