స్వార్థ ప్రేమతో వచ్చే వాళ్ల కన్నీళ్లకు కరగొద్దు: పువ్వాడ అజయ్​కుమార్​

ఖమ్మం టౌన్, వెలుగు: ఖమ్మం భక్త రామదాసు కళాక్షేత్రంలో వివిధ డివిజన్లకు చెందిన 223 మంది లబ్ధిదారులకు మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​గురువారం గృహలక్ష్మి పథకం మంజూరు పత్రాలు అందజేశారు. 12 వ డివిజన్‌లో రూ.20 లక్షల ఎల్‌ఆర్‌ఎస్‌ నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్ల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం ముస్తఫానగర్​లో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బొమ్మ రాజేశ్వరరావు అధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి అజయ్​పాల్గొని మాట్లాడారు. 

ఎన్నికల టైంలో చాలా మంది ఓట్ల కోసం వస్తారని, స్వార్థ ప్రేమతో కన్నీళ్లు పెట్టుకుంటారని, వాటికి కరగాల్సిన పనిలేదని చెప్పారు. తన హయాంలో చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని కోరారు. కొవిడ్​టైంలో చేసిన సేవలను గుర్తుచేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్​ను ఆదరించాలని మంత్రి అజయ్​విజ్ఞప్తి చేశారు. అనంతరం రఘునాథపాలెం మండలం కోయచలక, రేగులచలక గ్రామాల్లో రూ.1.20 కోట్లతో చేపట్టిన సీసీ, డొంక రోడ్లు, హైమాస్ట్ లైట్ల ఏర్పాటు పనులను మంత్రి ప్రారంభించారు. అంతకు ముందు బీఆర్ఎస్ శ్రేణులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. ఎంపీపీ గౌరి, వైస్ ఎంపీపీ గుత్తా రవి, సర్పంచులు మాదంశెట్టి హరిప్రసాద్, రామారావు, ఆత్మ చైర్మన్ లక్ష్మణనాయక్ తదితరులు పాల్గొన్నారు.