ఖమ్మం టౌన్,వెలుగు : రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మతతత్వ, అరాచక బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గా ప్రసాద్ ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవారం ఖమ్మంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో బీఆర్ఎస్ మాజీ నాయకులు దొండపాటి వెంకటేశ్వర్లకు దుర్గాప్రసాద్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా దుర్గాప్రసాద్ మాట్లాడతూ రాష్ట్రంలో తప్పుడు హామీలు ఇచ్చి పదేళ్లు అధికారనెక్కిన బీఆర్ఎస్ కు ప్రజలు బుద్ధి చెప్పారన్నారు.
ప్రజా సంక్షేమాన్ని కోరుకున్న నాయకులు నేడు కాంగ్రెస్ పార్టీలోకి క్యూ కడుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఘోర పరాజయం పొందిన బీఆర్ఎస్, తన ఉనికి చాటుకునేందుకు బీజేపీతో కలిసి చీకటి ఒప్పందం చేసుకొని పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించారు. మోదీ ప్రకటించిన బయ్యారం ఉక్కు కర్మాగారం, గిరిజన యూనివర్సిటీలు లాంటి హామీలు నెరవేరలేదని విమర్శించారు.
సంపదను బడా పారిశ్రామికవేత్తలకు దోచి పెడుతూ, దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నా భిన్నం చేశారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సి పొట్లా నాగేశ్వర్ రావు, పీసీసీ సభ్యులు రాయల నాగేశ్వరరావు, వడ్డే నారాయణరావు, జిల్లా మహిళా, కిసాన్, మైనారిటీ అధ్యక్షులు దొబ్బల సౌజన్య, మొక్కా శేఖర్ గౌడ్, సయ్యద్ ముజాహిద్ హుస్సేన్, జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు చోటా బాబా, కార్పొరేటర్లు చావా నారాయణరావు, కమర్తపు మురళి, జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కొంటెముక్కల నాగేశ్వరరావు, గడ్డం వెంకటయ్య, ఏలూరి రవికుమార్ పాల్గొన్నారు.