ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 50 లక్షల కార్ల అమ్మకం.. రికార్డ్ లెవెల్‌‌‌కు చేరుకుంటామని క్రిసిల్ అంచనా

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 50 లక్షల కార్ల అమ్మకం.. రికార్డ్ లెవెల్‌‌‌కు చేరుకుంటామని క్రిసిల్ అంచనా
  • రికార్డ్ లెవెల్‌‌‌కు చేరుకుంటామని క్రిసిల్ అంచనా
  • వృద్ధి రేటు మాత్రం 2–4 శాతంగానే ఎలక్ట్రిక్ బండ్ల సేల్స్ అంతంత మాత్రమే
  • యూఎస్ టారిఫ్ ప్రభావం ఇండియా ఆటో కంపెనీలపై తక్కువే

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 50 లక్షల ప్యాసింజర్ బండ్లు (కార్లు, వ్యాన్‌‌‌‌లు, ప్యాసింజర్ ఆటోలు వంటివి) అమ్ముడవుతాయని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేస్తోంది. ఇందులో లోకల్‌‌‌‌గా అమ్మినవి, ఎగుమతి చేసినవి కలిసి ఉంటాయి. వరుసగా నాల్గో ఆర్థిక సంవత్సరంలోనూ ప్యాసింజర్ బండ్ల సేల్స్ రికార్డ్ స్థాయికి చేరుకుంటాయని పేర్కొంది.  అయినప్పటికీ కరోనా మహమ్మారి తర్వాత అంటే 2022–23 ఆర్థిక సంవత్సరంలో సేల్స్ 25 శాతం వృద్ధి చెందాయి. ఆ లెవెల్‌‌‌‌లో గ్రోత్ నమోదు కావడం కష్టమే.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సేల్స్  ఏడాది లెక్కన కేవలం 2–-4 శాతమే పెరుగుతుందని క్రిసిల్ చెబుతోంది.

కొత్త లాంచ్‌‌‌లు, బ్యాటరీ ఖర్చులు తగ్గినప్పటికీ, ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీల) వ్యాప్తి మాత్రం పెద్దగా ఉండకపోవచ్చు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అమ్ముడయ్యే ప్యాసింజర్ వాహనాల్లో వీటి వాటా కేవలం 3-–3.5 శాతం ఉంటుందని అంచనా.  పెట్రోల్‌‌‌‌, డీజిల్ బండ్లతో పోలిస్తే  అధిక ధరలు ఉండడం,  ఛార్జింగ్ ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్ ఇంకా డెవలప్ కాకపోవడం వంటి కారణాలతో వినియోగదారులు దూరంగా ఉంటున్నారని  ఇన్‌‌‌‌సైట్స్- డ్రివెన్ అనలిటిక్స్ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. తక్కువ బేస్ కారణంగా కిందటేడాది ఈవీ సేల్స్ గ్రోత్ ఎక్కువగా నమోదైనా, ఆ తర్వాత నెమ్మదించిందని పేర్కొంది.   గత ఆర్థిక సంవత్సరంలో ప్యాసింజర్ వాహనాల అమ్మకాల్లో 85 శాతం ఇండియాలోనే జరగగా, మిగిలినవి  ఎగుమతి అయ్యాయి.  

టెస్లా వస్తే పోటీ తీవ్రం
టెస్లా సహా గ్లోబల్ ఈవీ కంపెనీలు ఇండియాలో తమ కార్లను అందుబాటులోకి తెస్తే లగ్జరీ కార్ల సెగ్మెంట్‌‌‌‌లో  పోటీ మరింత పెరుగుతుంది.  ప్రస్తుతం ఏడాదికి అమ్ముడవుతున్న ప్యాసింజర్ వెహికల్స్‌‌‌‌లో లగ్జరీ కార్ల వాటా 10 శాతం కంటే తక్కువ ఉంది. గ్లోబల్ కంపెనీలు వస్తే ఇండియన్ కంపెనీలు తమ టెక్నాలజీని అప్‌‌‌‌గ్రేడ్ చేయడానికి భారీగా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది.  కానీ, కార్ల దిగుమతులపై అధిక సుంకాలు వేస్తుండడంతో  గ్లోబల్‌‌‌‌ కంపెనీల దిగుమతులు పరిమితంగా ఉంటాయని క్రిసిల్ పేర్కొంది.

రానున్న నెలల్లో  వడ్డీ రేట్లు మరింత దిగొస్తాయని, ఈవీల వాడకం విస్తరిస్తుందని వెల్లడించింది.  అలాగే గ్లోబల్ ఉద్రిక్తతల కారణంగా చిప్‌‌‌‌లు,  బ్యాటరీ సెల్స్ సప్లయ్ పడిపోవచ్చని అభిప్రాయపడింది. “ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్యాసింజర్ బండ్ల సేల్స్‌‌‌‌  కేవలం 2–-4 శాతమే పెరగొచ్చు. కానీ యుటిలిటీ వాహనాలు (యూవీలు) కొత్త లాంచ్‌‌‌‌ల మద్దతుతో సుమారు 10 శాతం వృద్ధి చెందుతాయని అంచనా.

కొత్త లాంచ్‌‌‌‌లలో 68–-70 శాతం యూవీలే ఉంటాయి” అని క్రిసిల్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ అనుజ్ సేథి చెప్పారు. సాధారణ వర్షపాతం,   వడ్డీ రేట్ల కోత ఉంటే గ్రామాల్లో  ఎంట్రీ- లెవెల్ కార్లకు డిమాండ్‌‌‌‌ మెరుగుపడుతుందని అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు 5–7 శాతం పెరుగుతాయని,  గ్లోబల్ పరిస్థితుల కారణంగా ఇవి మూడింట ఒక వంతు తగ్గుతాయని వివరించారు. “ఈ ఏడాది జూన్  నుంచి వాహనాలపై  ట్రంప్ టారిఫ్‌‌‌‌ రేటు 25 శాతం అమల్లోకి వస్తుంది. దీని ప్రభావం మనపై పెద్దగా ఉండదు. ఇండియా ఎగుమతుల్లో కేవలం ఒక శాతం ప్యాసింజర్ బండ్లే అమెరికాకు వెళుతున్నాయి” అని క్రిసిల్ వివరించింది.  కంపెనీలు మెక్సికో, గల్ఫ్ దేశాలువంటి ప్రత్యామ్నాయ మార్కెట్ల వైపు చూడొచ్చని సలహా ఇచ్చింది.