ఢిల్లీలోని తెలంగాణ భవన్‌‌లో ఘనంగా పీవీ జయంతి

ఢిల్లీలోని తెలంగాణ భవన్‌‌లో ఘనంగా పీవీ జయంతి

న్యూఢిల్లీ, వెలుగు: మాజీ ప్రధాని పీవీ నర్సింహా రావు జయంతి వేడుకలను తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీలో ఘనంగా నిర్వహించింది. శుక్రవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌‌లో జరిగిన ఈ వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కాంగ్రెస్ ఎంపీలు మల్లు రవి, గడ్డం వంశీకృష్ణ, జైవీర్ రెడ్డి, చామల కిరణ్ రెడ్డి హాజరై నివాళులర్పించారు. అనంతరం ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ.. పీవీ స్ఫూర్తితో దేశాభివృద్ధిలో తాను కూడా భాగం అవుతానన్నారు. దేశ అభ్యున్నతికి పీవీ చేసిన సంస్కరణలు ఎంతగానో దోహదపడ్డాయని గుర్తుచేసుకున్నారు. పీవీ నరసింహారావు కేబినెట్‌‌లో తన తాత కాకా వెంకటస్వామి కేంద్ర మంత్రిగా పనిచేసి, దేశాభివృద్ధిలో భాగం అయ్యారన్నారు. 

ఆ రోజుల్లో పార్లమెంట్‌‌లో ప్రతిపక్షాలు మాట్లాడేందుకు అవకాశం ఇచ్చేవారని, కానీ ప్రస్తుత లోక్‌‌సభ సమావేశాల్లో స్పీకర్ ఓం బిర్లా నియంతగా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఆయన బీజేపీ స్పీకర్ అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్షాల గొంతు నొక్కేలా ఆయన చర్యలు ఉన్నాయని మండిపడ్డారు. నీట్ పేపర్ లికేజీపై చర్చ చేపట్టాలని, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్‌‌ చేశామన్నారు. 

నీట్ విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పార్లమెంట్‌‌లో కొట్లాడ్తామని చెప్పారు. ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ.. దేశం అత్యంత క్లిష్ట సమయంలో ఉన్న దశలో దేశానికి ఒక దిశను చూపించిన వ్యక్తి పీవీ నర్సింహా రావు అని కొనియాడారు. కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్‌‌తో కలిసి వ్యవస్థను గాడిలో పెట్టి, సంస్కరణలను అమలు చేసి ప్రపంచ దేశాల సరసన భారత్‌‌ను నిలిపారని గుర్తుచేశారు. ఆయనతో పనిచేసే అవకాశం తనకూ దక్కడం అదృష్టంగా భావిస్తున్నామని చెప్పారు. తెలుగు జాతిని దేశం మొత్తం గుర్తించేలా పీవీ ఆర్థిక సంస్కరణలను తెచ్చారని ఎంపీ చామల కిరణ్ రెడ్డి అన్నారు.