కరీంనగర్, వెలుగు : తన జీవితంలో క్రియాశీలక రాజకీయాల్లో ఎంతో బిజీగా గడిపిన దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు సాహిత్యంలోనూ తనదైన ముద్ర వేశారు. తెలంగాణ తొలి తరం కథల్లో ఆయన 1949లో రాసిన ‘గొల్ల రామవ్వ’ కథ చాలా ప్రముఖమైనది. ఈ కథ నిజాం కాలం నాటి సాయుధ పోరాటాన్ని, సమకాలీన ప్రజల చైతన్యాన్ని కళ్లకు కడుతుంది. తాను తుపాకీ పట్టి సాయుధపోరాటంలో పాల్గొన్న విశేషాలను తన ఆత్మకథగా రాసుకున్న ‘ఇన్ సైడర్’లో పీవీ పేర్కొన్నారు. మంగయ్య అదృష్టం అనే మరో కథను కూడా పీవీ రాశారు. వాటితోపాటు తాను నడిపిన ‘కాకతీయ’ పత్రికలో అనేక కథలు రాసినట్లు ప్రచారం జరిగినా.. ప్రస్తుతానికి అవేవీ అందుబాటులో లేవు.
విశ్వనాథ సత్యనారాయణ తెలుగులో రాసిన ‘వేయి పడగలు’ నవలని ‘సహస్ర ఫణ్’ పేరుతో పీవీ హిందీలోకి అనువదించారు. ఈ పుస్తకానికి పీవీకి ఉత్తమ అనువాద గ్రంథంగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. తన ఆత్మకథ నవల ‘ఇన్ సైడర్’ లో 1960, 70వ దశకాల్లో సామాజిక మార్పు కోసం కేంద్ర ప్రభుత్వం అవలంబించిన పాలసీలను ఆయన విశ్లేషించారు. అయోధ్యలో బాబ్రీ మసీదు విధ్వంసం నాటి పరిణామాలు, కరసేవపై ‘అయోధ్య -1992’ అనే పుస్తకం రాశారు పీవీ. ‘పన్ లక్షత్ కోన్ ఘతో’ అనే మరాఠీ పుస్తకాన్ని పీవీ ‘అబల జీవితం’ పేరుతో తెలుగులోకి అనువదించారు. ప్రముఖ రచయిత్రి జయప్రభ కవిత్వాన్ని పీవీ ఆంగ్లంలోకి అనువదించారు.
ఆధునికతను అందిపుచ్చుకోవడంలో దిట్ట..
ప్రపంచవ్యాప్తంగా ఏ టెక్నాలజీ వచ్చినా దానిని అందిపుచ్చుకోవడంలో పీవీ ఎప్పుడూ ముందుండేవారు. 75 ఏళ్ల వయసులో కంప్యూటర్ నేర్చుకున్నారు. ఈ మెయిల్స్ పంపడం లాంటివి చేసేవారు. తెలుగు టైపింగ్ కూడా నేర్చుకుని తన రచనలను స్వయంగా కంపోజ్ చేసుకునేవారు.