పీవీసర్వేజనాః సుఖినో భవంతు అని నమ్మే భారతదేశం... ప్రపంచ క్షేమాన్ని కాంక్షిస్తుంది. దేశ ప్రయోజనాల్ని పరిరక్షించడం, ఇతర దేశాలతో సత్సంబంధాలకు ప్రాధాన్యతనిస్తుంది. భారత్ కు స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత నాటి పాలకులు దేశ భవిష్యత్తుకు పునాదులు నిర్మించారు. సుదీర్ఘ ప్రయాణానికి బాటలు వేశారు. ఇందులో భాగంగా తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ప్రపంచానికి శాంతి సందేశం ఇచ్చారు. భారత్, చైనా దేశాల మధ్య 1954 మే 29న కుదిరిన పంచశీల ఒప్పందం.. ప్రపంచ దేశాలకు ఆదర్శ మంత్రంగా నిలిచింది. ఐదు సూత్రాలతో రూపొందించిన విదేశీ విధానం ద్వారా నెహ్రూ నూతన శకానికి నాంది పలికారు. పంచశీలలోని ఐదు సూత్రాలను 20వ శతాబ్దం అంతర్జాతీయ వ్యవహారాల్లో పంచశీల చారిత్రక ఘట్టమని చెప్పవచ్చు. ప్రపంచంలోని రెండు పెద్దదేశాలైన భారత్, చైనా వంటి ఆసియా దేశాలు కుదుర్చుకున్న పంచశీల ఒప్పందం.. యూరోపియన్ దేశాలకూ ఆదర్శంగా నిలిచింది. ఇండోనేషియా దేశం తమ రాజ్యాంగంలో పంచశీల సూత్రాల్ని ఆపాదించుకుంది. భారత్ ప్రతిపాదించిన పంచశీల సూత్రాలు వివిధ దేశాల మధ్య సుధీర్ఘ కాలంగా నలుగుతున్న సమస్యలు, వివాదాలకు పరిష్కార మార్గంగా నిలిచాయి. ఐక్యరాజ్య సమితి కూడా పంచశీల బోధనల్ని గౌరవించింది. యూఎన్ ఛార్టర్ను కూడా పంచశీల బోధనల స్ఫూర్తితోనే రూపొందించారు.
.. ఈ పంచశీల సూత్రాలు భారత్, చైనా మధ్య
సంబంధాల్లో నేటికీ మార్గదర్శకాలుగా నిలుస్తున్నాయి. పంచశీలలోని ఐదు సూత్రాలు.. చేతి ఐదు వేళ్లుగా, స్నేహం, సామరస్యానికి చిహ్నంగా భావించవచ్చు. పూర్వ ప్రధాని పీవీ నరసింహారావు పంచశీల సూత్రాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. జాతి నిర్మాతలు చూపిన బాటలో పయనించారు. పంచశీల సూత్రాల్ని పున:శ్చరణ చేసుకోవాల్సిన అవసరముందని చెప్పేవారు. పంచశీల ఒప్పందానికి 40ఏండ్లు పూర్తయిన సందర్భంగా ఢిల్లీలో 1994 జూన్ 27న ‘పంచశీల్ -గ్లోబల్ డిప్లమసీ’ అనే అంశంపై జరిగిన సదస్సులో పీవీ ప్రసంగిస్తూ... పంచశీల సూత్రాల స్ఫూర్తిని కొనసాగించాలని పిలుపునిచ్చారు. పంచశీల సూత్రాలు రూపొందించిన కాలం కంటే.. ఆ సూత్రాలు నేటి పరిస్థితుల్లో ఎంతగానో ఉపయోగడపతాయి. దేశాల మధ్య నెలకొన్న సరిహద్దు వివాదాలు, ఉద్రిక్తతల నేపథ్యంలో శాంతి నెలకొల్పేందుకు పంచశీల సూత్రాలు ఎంతగానో దోహదపడతాయని పీవీ అనేవారు. మానవాళి శాంతి, సంక్షేమం దృష్ట్యా పంచశీల సూత్రాలు చూపిన బాటలో పయనించాల్సిన అవశ్యకత ఏర్పడిందనేవారు. ప్రపంచంలో మారణహోమం సృష్టించగల న్యూక్లియర్ టెక్నాలజీ అభివృద్ధి చెందిన ప్రమాదకర పరిస్థితుల్లో నూతన సవాళ్లను ఎదుర్కొనేందుకు పరస్పర శాంతియుత జీవనం అవసరమని వివరించేవారు. ప్రతీ తరం ఆయా సందర్భాల్లో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి పంచశీల సూత్రాల్ని ప్రామాణికంగా తీసుకోవాలని పిలుపునిచ్చేవారు. పంచశీల ప్రధాన ఉద్దేశమూ అదేనని చెప్పేవారు. పంచశీల సూత్రాలు రూపొందించిన నాటి పరిస్థితుల్లోకి వెళ్లకుండా... ఆ సూత్రాలు నేటి సమస్యలకు ఎలా పరిష్కారం చూపగలవనే కోణంలో ఆలోచించాలని పీవీ సూచించేవారు.
పీవీ ప్రతిపాదించిన ఐదు సూత్రాలివి
ఆర్థిక అభివృద్ధి మునుపెన్నడూ లేని విధంగా శరవేగంగా జరుగుతున్న తరుణంలో పంచశీల సూత్రాల్ని మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరముందని పీవీ ఉద్ఘాటించేవారు. ఆయన మరో ఐదు సూత్రాల్ని ప్రతిపాదించారు.
మిడిల్ పాథ్:
కంప్యూటరైజేషన్, టెలీ కమ్యూనికేషన్, టెక్నాలజీ డెవలప్ మెంట్ ప్రాధాన్యత నెలకొన్న నేపథ్యంలో ఒక్కోసారి పరిస్థితి అగమ్యగోచరంగా ఉంటుంది. అలా అని వేగంగా పరిగెత్తే దేశాల్ని చూసి గుడ్డిగా పరిగెత్తకూడదు. అందుకే ‘మిడిల్ పాథ్’ సూత్రం చాలా ముఖ్యమని పీవీ చెప్పేవారు. ఇదే విషయాన్ని ఆయన దావోస్ లోని ప్రపంచ ఆర్థిక వేదికపైనా ప్రస్తావించారు. ఆర్థిక సంస్కరణల్లో తాము ‘మిడిల్ పాథ్’ తీసుకుంటున్నట్టు ఆయన అన్నారు. సంస్కరణలు మానవీయ కోణంలోనే ఉండాలని, ప్రజలకు నష్టం చేసే స్థాయిలో ఉండొద్దని చాటిచెప్పారు.
బ్యాక్ టు విలేజ్:
గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం సమగ్ర అభివృద్ధి సాధిస్తుంది. భారతదేశ గుండె చప్పుడు పల్లెల్లో ఉంది. అందుకే నవభారతానికి పీవీ రెండో సూత్రంగా గ్రామీణాభివృద్ధిని ప్రతిపాదించారు. దేశం ముందుకు వెళ్లాలంటే.. పల్లెలకు వెళ్లాలని పంచశీల 40వ వార్షికోత్సవ సదస్సులో పిలుపునిచ్చారు. ఇందుకోసం ‘బ్యాక్ టు విలేజ్’ సూత్రం ప్రతిపాదించారు. హరిత విప్లవం ద్వారా సంపద సృష్టించేవి గ్రామాలేనని చాటిచెప్పారు. పట్టణాల్లో నివసించే వాళ్లు గ్రామీణ ప్రజల్ని చిన్నతనంగా చూడొద్దని ఆయన అనేవారు.
మోడల్ విలేజ్:
పీవీకి గ్రామాలు, పల్లె ప్రజల శక్తి సామర్థ్యాలపై అపారమైన విశ్వాసం. ఆయన ప్రతిపాదించిన మూడో సూత్రం కూడా గ్రామాల గురించే కావడం ఇందుకు నిదర్శనం. దేశంలోని విభిన్న ప్రాంతాల్లో విభిన్న పరిస్థితులున్నాయని పీవీ అనేవారు. గ్రామాలు స్థానిక వనరుల్ని సద్వినియోగం చేసుకుంటూ ఆర్థికంగా బలోపేతం కావాలని, స్వయం సమృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ఆ శక్తి గ్రామాలకు ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. అదే లక్ష్యంతో మూడో సూత్రం.. ‘మోడల్ విలేజ్’ని ప్రతిపాదించారు. ఈనాడు మనం చెప్తున్న ఆదర్శ గ్రామాల కాన్పెప్ట్.. ఆనాడు పీవీ కలలుగని, బాటలు వేసినదే. సాకారమవుతుందని విశ్వసించినదే.
టెక్నాలజీ, ట్రెడిషన్ మధ్య సామరస్యం:
సంప్రదాయ పద్ధతులు అనుసరిస్తూనే సాంకేతికతను ఆపాదించుకోవాలి. అందుకే నాలుగో సూత్రంగా ‘టెక్నాలజీ, ట్రెడిషన్ మధ్య సామరస్యం’ అవసరమని పీవీ చెప్పారు. భారతదేశం యంత్రాల్ని ఎగుమతి చేసే స్థాయిలో ఉన్నా గ్రామీణ ప్రాంతాల్లోని చేతివృత్తుల వాళ్లు సంప్రదాయ పనిముట్లను వాడటంపై ఆయన ఆలోచింపచేసే మాటలు అన్నారు. టెక్నాలజీ, ట్రెడిషన్ మధ్య సామరస్యం అవసరమని చెప్పారు. కాస్మోపాలిటన్ సిటీలోని వాణిజ్య సంస్థల కంటే గ్రామీణ ప్రాంతాల్లో టెక్నాలజీ వినియోగిస్తే ఎక్కువ సంపద సృష్టించవచ్చని పీవీ అనేవారు.
న్యూ వరల్డ్ ఆర్డర్: ప్రచ్ఛన్న యుద్ధం పరిస్థితుల్లో పంచశీల
సూత్రాల్ని ఆనాటి దేశాధినేతలు ఆమోదించారని , కానీ నేడు ప్రపంచం ఏకధృవ, భిన్నధృవ రాజకీయాల మధ్య నడుస్తోందని పీవీ చెప్పారు. ఈ పరిస్థితుల్లో దేశంలో, దేశాల మధ్య టెక్నాలజీ, వనరుల మధ్య పరస్పర సహకారం అవసరమని అన్నారు. ఇదే లక్ష్యంతో ‘న్యూ వరల్డ్ ఆర్డర్’ అని ఐదో సూత్రం ప్రతిపాదించారు. భారత్, చైనా మధ్య కుదిరిన పంచశీల ఒప్పందంలోని జీవాన్ని ప్రపంచ దేశాలు పాటించాలని పీవీ ఆకాంక్షించారు. శాంతియుత యుగానికి నాంది పలకాలని పిలుపునిచ్చారు.
పంచశీల ప్రకారమే..
నెహ్రూ పట్ల అమితమైన అభిమానం కలిగిన పీవీ.. పంచశీల సూత్రాలు ప్రతిపాదించిన సందర్భంగా.. ‘‘మేం విభిన్న ఆలోచనా విధానాలు కలిగిన వారి నుంచి అనుబంధాన్ని, స్నేహాన్ని కోరుతున్నాం. కానీ మా మార్గాన్ని మేం అనుసరించేందుకు కట్టుబడి ఉంటాం. అదే పంచశీల సారాంశం. చైనా విషయంలోనే కాదు.. మా పొరుగు దేశాలన్నింటితోనూ పంచశీల సూత్రాల ప్రకారమే వ్యవహరిస్తాం. అంతేకాదు.. ప్రపంచంలోని ఏ దేశంతోనైనా ఇదే దృక్పథాన్ని అనుసరిస్తాం. ప్రతీ దేశం ఇతర దేశాలతో ఇదే విధంగా వ్యవహరిస్తే ఈనాడు మనం ఎదుర్కొంటున్న చాలా సమస్యలు పరిష్కారమవుతాయి” అని నెహ్రూ మాటల్ని ఉటంకించారు. నెహ్రూ చేసిన వివేకమైన వ్యాఖ్యలు నేటికీ వర్తిస్తాయని చెప్పేవారు. భారత్, చైనా మధ్య స్నేహం ఆవశ్యకతను వివరిస్తూ.. 1954 నవంబర్ 13న నెహ్రూ చేసిన వ్యాఖ్యల్ని పీవీ ప్రస్తావించారు. ‘‘అమెరికా, యూరోప్ దేశాల సమస్యలతో పోల్చితే.. చైనా ఎదుర్కొంటున్న సమస్యలు, భారత్ లోని సమస్యల్లో సారూప్యత ఉంది. భారత్, చైనా రెండు దేశాల్లోనూ ఎక్కువ మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. పారిశ్రామికంగా, సాంకేతికంగా రెండూ వెనుకబడిన దేశాలే. మెరుగైన జీవన ప్రమాణాలు, సంక్షేమం, పారిశ్రామికరణ సాధన, భూమి సమస్యల పరిష్కారం... రెండు దేశాల్లోనూ ఉన్నాయి” అంటూ ఆయన గుర్తుచేశారు.
పీవీ ప్రభాకర్ రావు,పీవీ నరసింహరావు తనయుడు