వంగర, లక్నేపల్లిని కలుపుతూ సర్క్యూట్
మాజీ ప్రధాని పుట్టి, పెరిగిన ఊళ్ల డెవలప్ మెంట్ కు ప్రపోజల్స్
ఏడు ఎకరాల్లో స్మృతి వనం
వరంగల్/భీమదేవరపల్లి, వెలుగు: మాజీ ప్రధాని, దివంగత పీవీ నర్సింహారావుపుట్టిపెరిగిన లక్నేపల్లి, వంగర గ్రామాలను కలుపుతూ పీవీ టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేసే దిశగా చర్యలు మొదలయ్యాయి. పీవీ శత జయంతి ఉత్సవాల సందర్భంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లు ఈ దిశగా ప్రపోజల్స్ రెడీ చేస్తున్నారు. బుధవారం టూరిజం మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్, ఇతర ఆఫీసర్లు వంగరలోని పీవీ ఇంటిని పరిశీలించగా, ముందురోజు టూరిజం ఎండీ మనోహర్‌రావు, ఉత్సవ కమిటీ సభ్యులు లక్నేపల్లి గ్రామంలో పర్యటించారు. చుట్టుపక్కల పర్యాటక స్థలాలను కలుపుతూ టూరిజం సర్క్యూట్ గా డెవలప్ చేస్తే ఈ ప్రాంతంతోపాటు తమ గ్రామాల రూపురేఖలు మారుతాయని ఇక్కడి ప్రజలు ఆశిస్తున్నారు.
టూరిజం సర్క్యూట్ఇలా..
ప్రస్తుత వరంగల్ రూరల్ జిల్లా లక్నేపల్లిలో పుట్టిన పీవీ నర్సింహారావు అర్బన్ జిల్లాలోని వంగరలో పెరిగారు. దీంతో ఈ రెండు ప్రాంతాలను టూరిజం సర్క్యూట్లో చేర్చాలనే డిమాండ్ చాలాకాలం నుంచి ఉంది. మొదటి నుంచి వంగర కేంద్రంగా టూరిజం సర్క్యూట్ఏర్పాటు చేస్తారని ఇక్కడి ప్రజలు భావించారు. దీంతో పాటు లక్నేపల్లిని టూరిజం సర్క్యూట్ లో చేర్చాలని ఐదు రోజుల కింద నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సీఎం కేసీఆర్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఆ వెంటనే ఆఫీసర్లు కూడా ఈ రెండు గ్రామాలను సందర్శించారు. ఇప్పటికే వంగరలో పీవీ ఫొటోలు, పుస్తకాలు, వినియోగించిన వస్తువులు, పొందిన అవార్డులతో ఆయన కుమారుడు ప్రభాకర్‌రావు, కూతురు వాణి ఆధ్వర్యంలో మ్యూజియం ఏర్పాటు చేశారు. వంగరకు సమీపంలోనే ఏడు కోనేర్లతో కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయం, అచ్చం వేయి స్తంభాల గుడిని పోలి ఉండే ముత్తారం త్రికుటాలయం, ముల్కనూర్ డెయిరీ, ఇనుపరాతి గుట్టలు, అక్కడే మునుల జాలు, ఆ తరువాత రత్నగిరి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్, వంగరకు ఆరు కిలోమీటర్ల దూరంలో సైదాపూర్ మండలం రాయికల్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి. వీటన్నింటినీ కలిపి సర్క్యూట్‌గా ప్రకటించి డెవలప్ చేస్తే టూరిస్టుల సంఖ్య పెరుగుతుంది.హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ నుంచి వచ్చే పర్యాటకులకు చారిత్రక ప్రదేశాలైన వేయిస్తంభాల గుడి, భద్రకాళి ఆలయం, ఖిలా వరంగల్ ను సైతం సందర్శించుకునే అవకాశం కలుగుతుంది.
లక్నేపల్లినీ చేరిస్తే ..
పీవీ నర్సింహారావు పుట్టిన లక్నేపల్లిలో ఇప్పటికే ఆయన స్మారక మందిరం ఉంది. దీంతోపాటు ఇప్పుడు టూరిజం సర్క్యూట్లో చేరిస్తే వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు వరంగల్‌లోని చారిత్రక ప్రదేశాలతో పాటు పాకాల సరస్సు, భీమునిపాదం వాటర్ ఫాల్స్, ప్రతి శుక్రవారం ట్రైబల్ ఫెస్టివల్‌లా జరిగే గుంజేడు జాతర చూడవచ్చు. వీటితో పాటు నర్సంపేట మీదుగా లక్నవరం, రామప్పలాంటి ప్రదేశాలు చుట్టివచ్చే అవకాశం ఉంటుంది.
ప్రపోజల్స్ కాదు, పనులు స్పీడప్ చేయాలి
పీవీ మరణం తరువాత వంగర గ్రామాన్ని ఎవరూ పట్టించుకున్న దాఖలాలు లేవు. కారణం ఏదైనా దాదాపు 16 సంవత్సరాల తరువాత డెవలప్ చేసేందుకు టీఆర్ఎస్గవర్నమెంట్ప్రణాళికలు రచిస్తోంది. పీవీ శత జయంతి ఉత్సవాల సందర్భంగా సీఎం ఇచ్చిన హామీ మేరకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ వంగరలో పర్యటించి ఆఫీసర్లతో కలిసి వివిధ ప్రపోజల్స్ రూపొందించారు. అందులో ముఖ్యంగా గ్రామానికి డబుల్ రోడ్డు, అట్రాక్షన్‌గా ఉండే గ్రాండ్ ఎంట్రన్స్, ఊరిలోని శివాలయం డెవలప్మెంట్, చెరువును మినీ టాంక్ బండ్‌గా మార్చి సస్పెన్షన్ బ్రిడ్జి ఏర్పాటు, ఏడు ఎకరాల్లో పీవీ స్మృతి వనం ఏర్పాటు లాంటి ప్రపోజల్స్ రెడీ చేశారు. ఇప్పటికే వంగరలో పీవీ విగ్రహం ఆయన కుటుంబ సభ్యులు ఏర్పాటు చేయగా.. విగ్రహం వెనుకాల ఉన్న స్థలంలో స్మృతివనం నిర్మించాలని భావిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా తెలంగాణ జాతిపితగా చెప్పుకునే జయశంకర్ స్మృతివనం పనులు అప్పట్లో నత్తనడకన సాగాయి. 2017లో స్టార్ట్ చేసిన పనులు 2020 వరకు కొనసాగాయి. ఇప్పుడు పీవీ పేరున ఏడు ఎకరాల్లో మోడల్ పార్క్ ప్లాన్ చేస్తుండటంతో పనుల్లో జాప్యం చేయకుండా వెంటనే ప్రారంభించి, జయంతి ఉత్సవాలు ముగిసేలోపు పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.