పెద్దపల్లి, వెలుగు: దివంగత మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావుకు భారతరత్న ప్రకటించడంపై పెద్దపల్లి జిల్లా ప్రజలు సంబురాలు చేసుకుంటున్నారు. పీవీ హన్మకొండ జిల్లాకు చెందిన వారైనా పెద్దపల్లి జిల్లాతోనే ఆయనకు ఎక్కువ అనుబంధం ఉంది.1957 నుంచి 1973 వరకు పీవీ మంథని ఎమ్మెల్యే గా ఉన్నారు. ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కాలంలోనే 1971 నుంచి 73 వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. అప్పుడే జిల్లాలో రవాణా సౌకర్యాలను కల్పించారు. పెద్దపల్లి, భూపాలపల్లి మధ్య అడవిసోమన్ పల్లి వద్ద మానేరు వాగుపై బ్రిడ్జి నిర్మించారు. దీంతో కరీంనగర్ జిల్లా నుంచి వరంగల్, ఖమ్మం జిల్లాలకు ప్రయాణం సులువైంది.
అలాగే నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన పెద్దపల్లి జిల్లాకు చెందిన గట్టెపల్లి మురళితో పీవీకి అనుబంధం ఉండేది. మంథనికి చెందిన రంగి సీతారామయ్య, చంటన్న అప్పట్లో మహారాష్ట్రలోని నాగపూర్‌లో ఉండేవారు. పీవీ అక్కడ డిగ్రీ చేసే సమయంలో వారింట్లోనే భోజనం చేసేవారు. ఆయన ప్రధాని అయిన తర్వాత రంగి సీతారామయ్య తమ్ముడి కొడుకు రంగి కిశోర్‌ను ఢిల్లీకి పిలిపించుకొని మూడేళ్ల పాటు తన ప్రత్యేక వంటవాడిగా నియమించుకున్నారు. పీవీకి భారతరత్న ప్రకటించడంపై రంగి కిశోర్ సంతోషం వ్యక్తం చేశారు.