భారత ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజం వేసి కుంటుపడుతున్న ఎకానమీని తిరిగి పట్టాలెక్కించిన నిరంతర సంస్కరణ శీలి, బహుముఖ ప్రజ్ఞావంతుడు మన తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావు. నమ్మిన వాదానికి కట్టుబడి తన వ్యక్తిత్వాన్ని, విజ్ఞానాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నమ్ముకొని ఎదిగిన ధీశాలి ఆయన. నిన్నటి గతమే నేటి చరిత్ర అతని చరిత్రే మన భారతావని ఆర్థిక ప్రగతి అనేలా విప్లవాత్మక ఆర్థిక సంస్కరణల ఆద్యుడు, దక్షిణాది తొలి ప్రధాని, బహుభాషా కోవిదుడు తెలంగాణ ముద్దుబిడ్డ మన పాములపర్తి వెంకట నరసింహారావు. పదవుల కోసం పాకులాడకుండా పదవులే తన పాదాక్రాంతం అయ్యేటట్టు సమున్నత వ్యక్తిత్వంతో జీవించిన గొప్ప రాజనీతిజ్ఞుడు పీవీ.1957 లో శాసనసభ్యుడిగా రాజకీయ జీవితం ప్రారంభించిన ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ ముఖ్యమంత్రిగా, విదేశీ వ్యవహారాలు, హోం, రక్షణ, మానవ వనరుల అభివృద్ధి శాఖలకు కేంద్ర మంత్రిగా పలు కీలక పదవులు నిర్వహించి చివరకు ప్రధానమంత్రిగా రాజకీయ జీవితం ముగించి అపర చాణక్యుడిగా మన్ననలు పొందారు.
నిరంతర అధ్యయనశీలి..
ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు వేగుచుక్కగా మహోత్తర శక్తిగా భారతావని ఎదగడానికి నిరంతర సంస్కరణలతో జీవం పోసిన పీవీ నరసింహారావు వరంగల్ జిల్లాలోని నర్సంపేట మండలంలో లక్నేపల్లిలో రత్నాబాయి, సీతారామారావు దంపతులకు1921 జూన్ 28న జన్మించారు. తర్వాత కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన రంగారావు రుక్మిణమ్మ దంపతులు దత్తత తీసుకోవడంతో తన ఇంటి పేరును పాములపర్తిగా మార్చుకున్నారు.1952లో శాసనసభ ఎన్నికల్లో ఓటమితో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన పీవీ1957లో మంథని నియోజకవర్గం నుంచి శాసన సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 1971 సెప్టెంబర్ నుంచి1973 జనవరి వరకు పరిపాలించారు. ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో భూసంస్కరణలకు శ్రీకారం చుట్టారు. పట్టణ భూ గరిష్ట పరిమితి చట్టం తెచ్చారు. శాసనసభ ఎన్నికల్లో వెనుకబడిన వర్గాలకు70 శాతం రిజర్వేషన్ కల్పించారు. పీవీ మంచి నాయకుడే కాకుండా గొప్ప విద్యార్థి కూడా. ఏదైనా అనుకుంటే సాధించేవరకు వదలరు. అందుకే ఆయన 17 భాషలు నేర్చుకున్నారు.14 భాషల్లో సాహిత్యసేవలందించారు. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన పీవీతో మాట్లాడుతూ.. ‘రాబోయేదంతా కంప్యూటర్ యుగమండీ.. కచ్చితంగా గ్లోబును కంప్యూటర్ డామినేట్ చేస్తుంది. కానీ ఈ ముసలివాళ్లతోనే చిక్కు. వీళ్లు మార్పును స్వాగతించరు.. మారరు’ అని అన్నారట. దీంతో పీవీకి కోపం వచ్చి వెంటనే కంప్యూటర్ నేర్చుకుని జీవితం చివరి దశ వరకు కంప్యూటర్ మీద పని చేశారు. అలాంటి నిరంతర అధ్యయనశీలి సామాజిక దృక్పథాన్ని అలవర్చుకున్న మహోన్నత వ్యక్తి పీవీ.
ఆహార ధాన్యాల ఉత్పత్తి దేశంగా..
ఆర్థిక వృద్ధి, ఎగుమతులు, అంతర్జాతీయ సంక్షోభాలకు ఎదురొడ్డి నిలవడం విదేశీ మారక ద్రవ్య నిల్వలు, సమాచార సాంకేతిక పురోగతి, స్టాక్ మార్కెట్లు, టెలీకమ్యూనికేషన్లు వంటి పలు రంగాల్లో ఆకాశమే హద్దుగా భారత చెలరేగింది. ఒకనాడు ఆహారపదార్థాలు దిగుమతిదారుగా అట్టడుగున ఉన్న భారత్ ఇవాళ అంతర్జాతీయ సమాజానికి పెద్ద ఎత్తున ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేసే దేశంగా ఆవిర్భవించింది. అలాగే విద్యాశాఖను మానవవనరుల అభివృద్ధి శాఖగా మార్చడం, జైళ్ల శాఖలో సంస్కరణలు తేవడం, నవోదయ పాఠశాలల ఏర్పాటు, గురుకుల విద్యకు నాంది వంటి పలు సంస్కరణలను ఆయన తీసుకువచ్చారు. అయితే ఆర్థిక సంస్కరణలపైన పేదరికం, నిరుద్యోగం, అసమానతల నిర్మూలన సిసలైన ఫలశ్రుతి. ఆ ప్రాతిపదికన భావి సవాళ్లను ధీటుగా ఎదుర్కొని భారతావని అభివృద్ధికి నిరంతరం పాటుపడ్డారు పీవీ.
ఆర్థిక స్థిరత్వం కల్పించి..
పీవీ నరసింహారావు 1991 జూన్ నెలలో ప్రధానమంత్రి పీఠాన్ని అధిరోహించినప్పటికి భారత దేశంలో ఆర్థిక పరిస్థితులు దుర్భర పరిస్థితుల్లో ఉన్నాయి. హరిత విప్లవం పుణ్యమాని కొద్దిపాటి ఆహార స్వావలంబన సాధ్య పడినా, ఇతర రంగాలన్నీ హీనస్థితిలో ఉండటంతో దేశ స్థూల జాతీయోత్పత్తి మూడు శాతంగా కొనసాగుతున్నది. మరోవైపు ఇంటిని చక్కదిద్దుకునే దారి తెలియక 20 కోట్ల డాలర్ల రుణం కోసం 20 టన్నుల బంగారాన్ని యూనియన్ బ్యాంక్ ఆఫ్ స్విట్జర్లాండ్ కు తాకట్టు పెట్టిన పరిస్థితుల్లో మన దేశం ఉంది. వడలిపోయిన ఆర్థిక వ్యవస్థ, సడలిపోయిన విశ్వసనీయత కారణంగా అప్పు కోసం చేయి చాచిన ప్రతి చోట భారత్ అవమానాలను ఎదుర్కొంటున్న స్థితిలో ఉంది. నిద్రాణ వ్యవస్థలకు చురుకుదనం పుట్టించి అవమానాల పాలైనా అంతర్జాతీయ వేదికల మీద భారతావనికి కొత్త భవిత లిఖించాడు పీవీ. ఆయన ఆర్థిక లక్ష్యసాధనకు బాసటగా నిలుస్తూ నాటి విత్త మంత్రి మన్మోహన్ సింగ్ ఈ దేశానికి నూతన ప్రపంచ ఆర్థిక నాగరికతను పరిచయం చేస్తూ తొలి బడ్జెట్ ను సమర్పించారు. పీవీ నరసింహారావు దార్శనికత్వంలో విచ్చుకున్న నూతన ఆర్థిక సంస్కరణల యుగంలో భారత్ ఏటా సగటున 6.5 శాతం జీడీపీ వృద్ధిరేటు సాధించింది.
- అంకం నరేష్