మిల్లెట్ మ్యాన్ గా పేరు సంపాదించుకున్న పీవీ సతీష్ కన్నుమూశారు. గతకొంతకాలంగా మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న ఆయన.. ఆపోలో ఆసుపత్రిలో చికత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. పీవీ సతీష్ అంత్యక్రియలు మార్చి 20 ఉదయం 10.30 గంటలకు సంగారెడ్డిలో జరుగుతాయని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. పీవీ సతీష్ అసలు పేరు పెరియపట్న వెంకటసుబ్బయ్య సతీష్. జూన్ 18, 1945లో మైసూరులో జన్మించిన ఆయన ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లోని దూరదర్శన్‌లో డైరెక్టర్‌గా పని చేశారు.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ కేంద్రంగా దక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీని స్థాపించారు. చిరుధాన్యాల సాగు, వినియోగం పెంపు, సేంద్రీయ వ్యవసాయంపై సతీష్ నాలుగు దశాబ్థలుగా కృషి చేశారు. జహీరాబాద్ ప్రాంతంలో దళిత మహిళా సాధికారతకు పీవీ సతీశ్ కుమార్ విశేషంగా కృషి చేశారు. ఆయన పట్ల వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి సంతాపం తెలిపారు. మినుము సాగును ప్రోత్సహించడం ద్వారా సతీష్ వారసత్వాన్ని కొనసాగించాలని రైతులకు పిలుపునిచ్చారు .