న్యూఢిల్లీ, వెలుగు: దేశ నిర్మాణంలో మాజీ ప్రధాని పీవీ నరహింహారావు సేవలు మరవలేనివని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కొనియాడారు. సోమవారం పీవీ వర్ధంతి సందర్భంగా ఆయన ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. పీవీ ప్రధానిగా ప్రవేశపెట్టిన ఎన్నో సంస్కరణలు దేశ ప్రగతిని మార్చాయని స్మరించుకున్నారు. ఆయన సాహసోపేతమైన ఆర్థిక సరళీకరణ విధానం మధ్య తరగతి వృద్ధి, సంక్షేమానికి ఎంతగానో ఉపయోగపడిందని గుర్తుచేశారు. పీవీ పాలన ఆర్థిక రంగ పురోగతిలో మధ్య తరగతి రూపురేఖలను మార్చిందన్నారు. అణు రంగాన్ని కొత్త పుంతలు తొక్కించారని, వినూత్న విదేశీ విధాన కార్యక్రమాలకు నాయకత్వం వహించారని ఖర్గే పేర్కొన్నారు.