పీవీ నిశ్శబ్ద యోధుడు : తనుగుల జితేందర్ రావు

పీవీ నిశ్శబ్ద యోధుడు : తనుగుల జితేందర్ రావు

‘‘పుట్టుక నీది.. చావు నీది.. బతుకంతా దేశానిది’అన్న మాటలు భారత మాజీ ప్రధానమంత్రి పీవీకి  స్పష్టంగా నప్పుతాయి. అందరూ ప్రేమగా పిలుచుకునే పీవీ పూర్తి పేరు పాములపర్తి వెంకట నరసింహారావు. ఆయన గురించి ఇంకా చెప్పాలంటే బక్కపలచని రాజకీయ బలవంతుడు. నిరంతరం నిశ్శబ్దాన్ని శ్వాసించేవాడు. బహుభాషా పండితుడు, ఆర్థిక మేధావి. రాజకీయాల్లో ఎలాంటి గాడ్ ఫాదర్, గ్రాండ్ ఫాదర్ల మద్దతు లేకపోయినా గల్లీ నుంచి ఢిల్లీ పీఠానికి ఎదిగిన రాజకీయ ఎవరెస్టు శిఖరం. రామనంద శిష్యుడిగా గాంధీయన్ సిద్ధాంతాలతో పొలిటికల్ జీవితాన్ని ప్రారంభించిన ఆ మహనీయుడు, దేశంలోనే అత్యున్నత రాజకీయ ప్రధాని పదవిని అధిరోహించి పూర్తి కాలం సేవలు అందించి ప్రత్యేక ఘనత సాధించారు.

గాంధీ కుటుంబేతర ప్రధానిగా..

స్వతంత్ర భారత చరిత్రలో పీవీ లాంటి వ్యక్తి, వ్యక్తిత్వం ఉన్న మనిషి చాలా అరుదు. డిసెంబర్​23 ఆయన వర్ధంతి సందర్భంగా మరోమారు ఆయన సేవలను స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది. గాంధీ కుటుంబం తర్వాత ప్రధాని పోస్టులో పూర్తి కాలం పదవి నిర్వహించిన వ్యక్తి ఆయన మాత్రమే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌‌లో మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఆయన భూ సంస్కరణలు దాని పర్యవసానాల గురించీ ఆయన ఆత్మకథాత్మక రచన ‘ది ఇన్ సైడర్’(తెలుగులో ‘లోపలి మనిషి’)ద్వారా మనకు ఎన్నో విషయాలు తెలుస్తాయి. దేశ ప్రధానిగా, సంస్కరణలు తెచ్చి ఆర్థిక వ్యవస్థను నిలబెట్టిన వ్యక్తిగా పీవీకి ఎంతో గుర్తింపు, గౌరవం దక్కాల్సి ఉన్నా దక్కలేదు. గాంధీల కుటుంబానికి చెందిన వ్యక్తి కాకపోవడమే ఆయన చేసిన పాపమా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. కాంగ్రెస్ రాజకీయ శత్రువులైన బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు  పీవీపై గౌరవాన్ని ప్రదర్శించడం ప్రారంభిస్తుంటే, ఆ మహనీయుడు, ఆయన కుటుంబీకులకు సముచిత స్థానం కల్పించడంలో కాంగ్రెస్​ అధిష్టానం పూర్తిగా విఫలమైంది. పీవీ తన కుమారులను నేరుగా టికెట్లు ఇచ్చుకొని రాజకీయాల్లో  గెలిపించుకోలేదు. తన వద్ద రాజకీయాలు, ప్రజా సేవ చేసే పనితీరును నేర్చుకున్నాక, ప్రజల్లోకి వెళ్లి గెలవాలనే ఆయన కోరుకున్నారు. పీవీ రంగారావు, పీవీ రాజేశ్వర్ రావు రాజకీయాల్లోకి అలాగే వచ్చారు. 

దేశానికి ఎంతో దోహదం..

పీవీ ‘ది ఇన్ సైడర్’ ను ‘లోపలి మనిషి’ పేరుతో అనువదించిన తెలుగు రచయిత ఆయనను పలుసార్లు కలుసుకున్న సందర్బంలో ‘పీవీ మాటల భయంతో నా ఒళ్లు జలదరించింది’ అని వ్యాఖ్యలు చేయడం గమనార్హం. పీవీ మాట్లాడుతూ ‘ఎన్నో చేయాలని అనుకున్నాను. చేయలేకపోయాను’ అన్నారట. మళ్లీ ఒక్క క్షణం మౌనం తర్వాత.. ‘యూపీ, బీహార్‌‌లు ప్రగతి సాధించాలి. అవి ఇలాగే ఉన్నంతకాలం ఈ దేశం బాగుపడదు’ అంటూ భారంగా నిట్టూర్చారట. అంటే ఆ లోపలి మనిషి ఏండ్ల నిశ్శబ్దం నుంచి వచ్చిన మాటలు భారంగా అనిపించాయని రచయిత వ్యాఖ్యానించారు. అయిదేండ్లపాటు మైనారిటీ ప్రభుత్వాన్ని నడుపుకొచ్చిన ఒక మాజీ ప్రధాని ‘ఎన్నో చేయాలనుకున్నానని, చేయలేకపోయానని’ అన్నప్పుడు ఇంత పెద్ద దేశమూ, దాన్ని ఆవరించిన సమస్యలూ ఒక్కసారిగా కళ్ల ముందు మెదిలితే ఎవరికి మాత్రం భయం కలగదు? ఇప్పుడాలోచిస్తే ఆయన నిశ్శబ్దమే దేశానికి ఎంతోకొంత దోహదం చేసిందేమోననిపిస్తుంది. ఈ విషయాలన్నీ పీవీ జీవిత చరిత్రపై హాఫ్ లయన్ అనే పుస్తకంలో రచయిత వినయ్ సీతాపతి వివరించారు. ఆరుసార్లు ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి, ముఖ్యమంత్రి, ఐదుసార్లు ఎంపీ, కేంద్ర మంత్రి, ప్రధాని... వెరసి ఓ నిశబ్ద యోధుడిని లోపలి మనిషిని చేశాయి. అందుకే విజయాలను, అపయాలను, సంస్కరణలను, నేటి సమాజం గుర్తించలేని, చర్చించలేని, అంగీకరించలేని పాములపర్తి వెంకట నరసింహారావు అనే గొప్ప నాయకుడు చివరకు నిశ్శబ్ద యోధుడు, బయటపడని లోపలి మనిషిగా కొన్ని శక్తులు భారీ కుట్ర చేశాయని చెప్పవచ్చు.

కాంగ్రెస్​ ఉద్దేశపూర్వకంగానే విస్మరించిందా?

పీవీ పదవిలో ఉండగా చేసిన గొప్ప విషయాలను గుర్తుకు చేసుకోవాలి. ఆయన ఆలోచనా ఫలితమైన నవోదయ పాఠశాలల స్థాపన ఎవరూ వ్యతిరేకించని వాస్తవానికి నిదర్శనం. ఆయన ప్రధానమంత్రి అయ్యాక మొదటిసారి హైదరాబాద్ వచ్చినప్పుడు ‘ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డే’నని చెప్పుకున్నారు. సరళీకరణ విధానాల ప్రకటనతో  పీవీ గ్రాఫ్ జాతీయంగా, అంతర్జాతీయంగా ఎంతోగానో పెరిగిపోయింది. ఆర్థిక, సరళీకరణ విధానాల ద్వారా అతి తక్కువ కాలంలోనే దేశ ఆర్థిక వ్యవస్థను సంక్షోభం నుంచి గట్టెక్కించగలిగారు. ఈ రోజు దేశంలో ప్రైవేటు, పారిశ్రామిక రంగం పెరగడానికి ఆ మహనీయుడు వేసిన బాటలే కారణం. 1991లో కాంగ్రెస్‌‌ ‘మైనారిటీ’ సర్కారుకు పీవీ ప్రధాని అయినా, మెజారిటీ హిందూ మతానికి చెందిన ప్రజలు ఎక్కువ మంది పేదరికం నుంచి బయటకు రావడానికి తన ఆర్థిక సంస్కరణల ద్వారా ఎనలేని కృషి చేశారు. కానీ కాంగ్రెస్​పార్టీ ఆయనను ఉద్దేశపూర్వకంగా విస్మరించింది. బతికున్నప్పుడు, చనిపోయిన తర్వాత కూడా అవమానించింది. ఇంత జరిగినా పీవీ కాంగ్రెస్ పార్టీ, అధిష్టానం మీద ఒక్క  విమర్శ కూడా చేయకపోవడం ఆ మహనీయుడి గొప్పతనానికి నిలువెత్తు నిదర్శనం. విజయాలు వస్తే ఉప్పొంగ లేదు, అవమానాలు ఎదురైతే కుంగిపోని మహాయోగి ఆయన. 

- తనుగుల జితేందర్ రావు
సీనియర్ జర్నలిస్ట్