సయ్యద్ మోదీ టోర్నీలో దుమ్మురేపిన భారత్.. టైటిల్ నిరీక్షణకు తెరదించిన సింధు, లక్ష్య సేన్

సయ్యద్ మోదీ టోర్నీలో దుమ్మురేపిన భారత్.. టైటిల్ నిరీక్షణకు తెరదించిన సింధు, లక్ష్య సేన్

లక్నో: రెండేళ్ల టైటిల్ నిరీక్షణకు భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఎట్టకేలకు తెరదించింది. సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ 2024 టోర్నీ టైటిల్ విజేతగా సింధు నిలిచింది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో వేదికగా ఆదివారం (డిసెంబర్ 1) జరిగిన ఉమెన్స్ సింగిల్స్ ఫైనల్ మ్యాచులో చైనాకు చెందిన లుయో యు వును 21-14, 21-16 తేడాతో వరుస సెట్లలో ఓడించి సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ 2024 టైటిల్‌ను సింధు కైవసం చేసుకుంది. 

గత కొంత కాలంగా ఫామ్ లేమితో సతమతమవుతోన్న సింధు సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ టోర్నీ ఆరంభం నుండి కసితో ఆడి ఫైనల్‎కు చేరుకుంది. ఫైనల్ పోరులోనూ అదే దూకుడు కనబర్చింది. గేమ్ స్టార్టింగ్ నుండే ప్రత్యర్థిపై అధిపత్యం చెలాయిస్తూ కోర్టులో సింధు ఆత్మవిశ్వాసంతో కనిపించింది. తన మెరుపు లాంటి షాట్లతో ప్రత్యర్థి యు వూకి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా తొలి సెట్‎ను 21-14 తేడాతో గెలుచుకుంది. 

ALSO READ | ‘హైబ్రిడ్‌‌‌‌‌‌‌‌’కు ఓకే.. కానీ..ఇండియాలో జరిగే టోర్నీలకూ అనుసరించాలన్న పీసీబీ

అయితే రెండో  గేమ్‎లో ప్రత్యర్థి నుండి సింధుకి ప్రతి దాడి ఎదురైంది. తొలి గేమ్‎ కోల్పోయిన యు వూకి రెండో సెట్‎లో కాస్త పుంజుకుంది. 10-10తో యు వూ సింధుకి పోటీ ఇవ్వగా.. ఆ తర్వాత బలంగా పుంజుకున్న భారత షట్లర్ ప్రత్యర్ధిపై విరుచుకుపడి 21-16  తేడాతో  రెండో  సెట్‎ను దక్కించుకుంది. ఈ విజయంతో రెండేళ్ల తర్వాత సింధు తొలి బీడబ్ల్యూఎఫ్ టైటిల్‌ను గెలిచింది. జూలై 2022లో సింగపూర్ ఓపెన్ టైటిల్ గెలిచిన తర్వాత సింధుకి ఇదే తొలి బీడబ్ల్యూఎఫ్ టైటిల్.

మరోవైపు.. సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ 2024 మెన్స్ సింగిల్స్ టైటిల్ విజేతగా భారత స్టార్ షట్లర్ లక్ష్య సేన్ నిలిచాడు. లక్నోలో ఆదివారం (డిసెంబర్ 1) జరిగిన మెన్స్ సింగిల్స్ ఫైనల్ మ్యాచులో సింగపూర్‌కు చెందిన జియా హెంగ్ జాసన్ తేహ్‌పై విజయం సాధించాడు. 21-6 21-7 తేడాతో వరుస సెట్లలో ప్రత్యర్థిని ఓడించి లక్ష్య సేన్ సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ 2024 మెన్స్ సింగిల్స్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. ఈ ఏడాది లక్ష్య సేన్‎కు ఇదే తొలి బీడబ్ల్యూఎఫ్ టైటిల్ కాగా ఎట్టకేలకు ఇయర్ ఎండింగ్‎లో టైటిల్ నిరీక్షణకు తెరదించాడు.