
పారిస్ : ఒలింపిక్స్‌లో మూడో మెడల్‌పై కన్నేసిన ఇండియా స్టార్ షట్లర్ పీవీ సింధు అనూహ్యంగా ప్రిక్వార్టర్ ఫైనల్లోనే వెనుదిరిగింది. ఈ ఓటమి తన కెరీర్‌లోనే అత్యంత కఠినమైనదని అంటున్న సింధు కొంత విరామం తీసుకొని కెరీర్‌ను జాగ్రత్తగా కొనసాగిస్తానని చెప్పింది. ఈ ఓటమి తర్వాత ఎక్స్‌లో తన ఫ్యూచర్ కెరీర్ గురించి సింధు ప్రకటన చేసింది. ‘నా భవిష్యత్తు విషయంలో నేను చాలా స్పష్టంగా ఉండాలని అనుకుంటున్నా.
చిన్న విరామం తీసుకొని ఆటను కొనసాగిస్తా. నా శరీరానికి, మరీ ముఖ్యంగా నా మనస్సుకు ఈ విరామం అవసరం. ఏదేమైనా మున్ముందు నా ప్రయాణాన్ని జాగ్రత్తగా విశ్లేషించి నేను ఎంతగానో ప్రేమించే ఈ ఆటలో మరింత ఆనందాన్ని పొందాలని ప్లాన్ చేస్తున్నా. ఈ ఓటమి నా కెరీర్‌లో చాలా కష్టమైనది. దాన్ని జీర్ణించుకోవడానికి సమయం పడుతుంది’ అని సింధు పేర్కొంది.