
పారిస్: బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో బరిలో నిలిచిన ఇండియా ముగ్గురు షట్లర్లు పీవీ సింధు, లక్ష్యసేన్, హెచ్‌ఎస్ ప్రణయ్ తమ గ్రూప్ దశ చివరి మ్యాచ్‌ల్లో అద్భుత విజయాలతో ప్రి క్వార్టర్ ఫైనల్ చేరుకున్నారు. హ్యాట్రిక్ ఒలింపిక్ మెడల్‌పై గురి పెట్టిన సింధు బుధవారం జరిగిన విమెన్స్ గ్రూప్–ఎమ్ మ్యాచ్‌లో 21–5, 21–10తో క్రిస్టిన్ కుబా (యిస్తోనియా)ను వరుస గేమ్స్‌లో చిత్తు చేసింది. 33 నిమిషాల్లోనే ప్రత్యర్థి ఆటకట్టించిన సింధు గ్రూప్ టాపర్‌గా ముందంజ వేసింది. ప్రిక్వార్టర్స్‌లో తను హి బింగ్జియావోతో పోటీ పడే అవకాశం ఉంది. మరోవైపు నాకౌట్ చేరాలంటే కచ్చితంగా నెగ్గాల్సిన మ్యాచ్‌లో లక్ష్యసేన్ 21–18, 21–12తో ఆల్ ఇంగ్లంగ్ చాంపియన్, మూడో ర్యాంకర్ జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా)పై సంచలన విజయం సాధించాడు. మరో మ్యాచ్‌లో హెచ్ఎస్ ప్రణయ్ 16–21, 21–11, 21–12తో వియత్నాం షట్లర్ డక్ ఫాట్ లీపై గెలిచాడు.
సేన్‌సేషన్ ఆట
మెన్స్ సింగిల్స్‌లో కఠినమైన డ్రాలో నిలిచిన లక్ష్యసేన్ తొలి మ్యాచ్‌లో గెలిచినా ప్రత్యర్థి గాయంతో తప్పుకోవడంతో ఆర్గనైజర్లు అతని ఖాతా నుంచి ఆ విజయాన్ని మినహాయించారు. దాంతో నాకౌట్ చేరాలంటే క్రిస్టీపై విజయం అనివార్యం అయింది. అనుభవం, ఆట, ర్యాంక్, ఫామ్ ఇలా అన్నింటిలో తనకంటే ముందంజలో ఉన్న జొనాథన్ క్రిస్టీని ఓడించాలంటే అద్భుతం చేయాల్సిన పరిస్థితుల్లో సేన్.. నిజంగానే సెన్సేషనల్ పెర్ఫామెన్స్ చేశాడు. ఓపిగ్గా, ప్రశాంతంగా ఆడుతూ ఫలితం రాబట్టాడు. తొలి గేమ్‌ను క్రిస్టీ 5–0తో మొదలు పెట్టి 8–2తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అయినా ఆందోళన చెందని సేన్ వెంటనే పుంజుకున్నాడు. షటిల్‌ను ఫ్లాట్‌గా కొడుతూ ప్రత్యర్థి తప్పులు చేసేదాకా వేచి చూశాడు. దాంతో 7–8తో క్రిస్టీకి చేరువై బలమైన ఫోర్‌హ్యాండ్ స్మాష్‌తో ఒక పాయింట్ ముందంజలోకి వచ్చాడు. షటిల్‌ను ఫ్లాట్‌గా ఉంచుతూ వేగంగా ర్యాలీలు ఆడాడు. అటువైపు క్రిస్టీ కూడా దీటుగానే బదులివ్వడంతో గేమ్ 16–16, 18–18తో ముందుకెళ్లింది. ఈ దశలో ఓ ఫ్లాట్ పుష్ షాట్‌తో పాయింట్ రాబట్టిన అతను మరో ర్యాలీ మధ్యలో వెనకాల నుంచి కొట్టిన రిటర్న్‌తో ఆశ్చర్యపరిచిన సేన్ గేమ్ పాయింట్‌కు వచ్చి ఈజీగా గేమ్ గెలిచాడు.
కోర్టు మారిన తర్వాత సేన్ షటిల్‌ను తప్పుగా అంచనా వేసి పాయింట్లు కోల్పోయాడు. కానీ, వెంటనే జోరు పెంచి బలమైన స్మాష్‌లు కొడుతూ 10–5తో ముందంజ వేశాడు.
అటువైపు క్రిస్టీ తప్పిదాలను కొనసాగించడంతో లక్ష్య 18–12తో విజయానికి చేరువయ్యాడు. నెట్ వద్ద కీలక పాయింట్ అందుకోవడంతో పాటు ఓ లాంగ్ ర్యాలీని గెలిచిన సేన్ మ్యాచ్ పాయింట్‌కి వచ్చాడు. క్రిస్టీ మరోసారి షటిల్‌ను నెట్‌కు కొట్టడంతో ఇండియా కుర్రాడు గేమ్‌తో పాటు మ్యాచ్ గెలిచాడు. ప్రి క్వార్టర్స్‌లో తోటి ఆటగాడు ప్రణయ్‌తో లక్ష్యసేన్ పోటీ పడనున్నాడు.
రజినీకాంత్ స్టయిల్ రిటర్న్
ఈ మ్యాచ్‌లో లక్ష్యసేన్ కండ్లు చెదిరే షాట్లతో అలరించాడు. ముఖ్యంగా తొలి గేమ్‌లో 19–18 వద్ద ఉన్నప్పుడు ఆడిన ర్యాలీలో అతను కొట్టిన షాట్ అందరినీ ఆశ్చర్యపరిచింది. వేగంగా సాగుతున్న ర్యాలీలో లక్ష్య ఫోర్ హ్యాండ్‌పై షాట్ కొట్టిన క్రిస్టీ వెంటనే బ్యాక్ హ్యాండ్‌పైకి షాట్ కొట్టాడు. అంతే వేగంగా స్పందించిన సేన్ ఫోర్ హ్యాండ్ పొజిషన్లోనే ఉండి తన వెనకాల నుంచి షటిల్‌ను రిటర్న్ చేసి ఔరా అనిపించాడు. ఈ రిటర్న్‌ను ఏమాత్రం ఊహించని క్రిస్టీ వెంటనే వైడ్ షాట్ ఆడటంతో సేన్ గేమ్ పాయింట్‌పైకి వచ్చాడు. సేన్ కొట్టిన షాట్‌కు అంతా ఫిదా అవ్వగా.. రజినీకాంత్ స్టయిల్లో రిటర్న్ చేశాడని కామెంటేటర్లు పేర్కొన్నారు.