తెలుగు క్రీడాకారిణి పీవీ సింధుపై భారీ అంచనాలు ఉన్నాయి. వరుసగా రెండు సార్లు ఇండియాకు మెడల్స్ అందించిన సింధు.. ఈ సారి హ్యాట్రిక్ పై దృష్టి పెట్టింది. జూలై 26 నుండి పారిస్ వేదికగా ఒలింపిక్స్ ప్రారంభం కానున్నాయి. ఈ ఒలింపిక్స్ లో సింధు మెడల్ సాధిస్తానని ధీమా వ్యక్తం చేసింది. ఆమె పారిస్‌లోని పోర్టే డి లా చాపెల్లె అరేనాలో ప్రాక్టీస్ ముగించుకొని తమ అవకాశాల గురించి చెప్పుకొచ్చింది.
‘‘నేను కచ్చితంగా పతకం సాధించాలనే లక్ష్యంతో ఉన్నాను. ఇప్పటివరకు ఎన్ని పతకాలు సాధించాను అనే విషయం ముఖ్యం కాదు. పతకం సాధించే క్రమంలో ఎలాంటి ఒత్తిడి తీసుకోవాలనుకోవట్లేదు. ఒలింపిక్స్ వెళ్లిన ప్రతిసారి నాకు ఒక కొత్త టోర్నీనే. పతకం సాధిస్తాననే ఆశాభావంతో ఉన్నాను". అని సింధు చెప్పింది. రియో 2016 ఒలింపిక్స్‌లో సింధు సంచలన ప్రదర్శన చేసి ఫైనల్స్‌కు చేరుకుంది.ఓడినా ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్‌లో రజతం సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా నిలిచింది. టోక్యో 2020లో సింధు మరో పతాకాన్ని తన ఖాతాలో వేసుకుంది. గోల్డ్ మెడల్ మిస్ అయినా కాంస్య పతకం గెలిచింది.
కాంస్య పతకంతో రెండు వేర్వేరు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన రెండో భారతీయ క్రీడాకారిణి (సుశీల్ కుమార్ తర్వాత – 2008, 2012)గా నిలిచింది. ఇప్పుడు ఆమె పారిస్‌లో 3వ ఒలింపిక్ పతకాన్ని గెలుచుకుంటే.. మూడు ఒలింపిక్స్‌లో పతకాలు గెలిచిన తొలి భారతీయురాలు అవుతుంది. గోల్డ్ మెడల్ గెలిచి చరిత్ర సృష్టించాలని సింధు కోరుకుంటుంది.