రెండేండ్ల తర్వాత సింధుకు టైటిల్‌

రెండేండ్ల తర్వాత సింధుకు టైటిల్‌
  • మెన్స్‌‌ సింగిల్స్ విన్నర్ లక్ష్యసేన్‌‌..డబుల్స్​లో గాయత్రి జోడీ గెలుపు

లక్నో : ఇండియా స్టార్‌‌ షట్లర్‌‌ పీవీ సింధు రెండేండ్ల విరామం తర్వాత ఎట్టకేలకు టైటిల్ కరువు తీర్చుకుంది. దాదాపు 28 నెలలగా ట్రోఫీ కోసం వేచి చూస్తున్న సింధు..మూడోసారి సయ్యద్‌‌ మోదీ ఇంటర్నేషనల్‌‌ సూపర్‌‌–300 టోర్నీ టైటిల్‌‌ను సాధించింది. లక్ష్యసేన్‌ మెన్స్ సింగిల్స్ లో విజేతగా నిలవగా.. తెలుగమ్మాయి పుల్లెల గాయత్రి, ట్రీసా జాలీతో కలిసి విమెన్స్ డబుల్స్ టైటిల్ సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన విమెన్స్‌‌ సింగిల్స్‌‌ ఫైనల్లో టాప్‌‌సీడ్‌‌ సింధు 21–14, 21–16తో వు లువో యు (చైనా)పై గెలిచింది. 

2017, 2022లోనూ తెలుగమ్మాయి ఈ టైటిల్‌‌ను సాధించింది. జులై 2022లో చివరిసారి సింగపూర్‌‌ ఓపెన్‌‌లో విన్నర్‌‌గా నిలిచిన సింధు.. ఈ ఏడాది మలేసియా మాస్టర్స్‌‌–500లో ఫైనల్‌‌ చేరినా రన్నరప్‌‌తోనే సరిపెట్టుకుంది. 47 నిమిషాల మ్యాచ్‌‌లో ఇండియన్‌‌ షట్లర్‌‌ ర్యాలీలు, క్రాస్‌‌ కోర్టు విన్నర్లతో ఆకట్టుకుంది. తొలి గేమ్‌‌లో ఇద్దరు షట్లర్లు దూకుడుగా ఆడటంతో ఓ దశలో స్కోరు 5–5తో సమమైంది. 

ఇక్కడి నుంచి సింధు నెట్‌‌ వద్ద డ్రాప్స్‌‌ వేస్తూ ఒకటి, రెండు పాయింట్లతో ముందుకెళ్లింది. 11–10 వద్ద వరుసగా నాలుగు పాయింట్లతో 15–10తో ఆధిక్యాన్ని కొనసాగించింది. ఇక స్కోరును సమం చేసేందుకు చైనా ప్లేయర్‌‌ చేసిన ప్రయత్నాలను అద్భుతంగా అడ్డుకున్న సింధు స్పష్టమైన ఆధిక్యంతో గేమ్‌‌ను గెలిచింది. రెండో గేమ్‌‌లో పుంజుకున్న లువో యు సింధుకు గట్టి పోటీ ఇచ్చింది. 3–3, 7–7, 11–10తో ముందంజలోకి వచ్చింది. 

ఈ టైమ్‌‌లో సింధు బేస్‌‌లైన్‌‌ గేమ్‌‌తో ప్రత్యర్థిని నిలువరించింది. వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి 15–11తో లీడ్‌‌లోకి వెళ్లింది. మధ్యలో చైనా అమ్మాయి నాలుగు పాయింట్లు గెలిచినా, పట్టు వదలకుండా పోరాడిన సింధు నాలుగు, రెండు పాయింట్లతో గేమ్‌‌తో పాటు మ్యాచ్‌‌ను సొంతం చేసుకుంది. 

ఎదురులేని లక్ష్య..

మెన్స్‌‌ సింగిల్స్‌‌లో లక్ష్యసేన్‌‌కు ఎదురులేకుండా పోయింది. ఏకపక్షంగా సాగిన టైటిల్‌‌ ఫైట్‌‌లో లక్ష్య 21–6, 21–7తో జియా హెంగ్‌‌ జాసన్‌‌ టెహ్‌‌ (సింగపూర్‌‌)ను చిత్తు చేశాడు. బలమైన స్మాష్‌‌లు, ర్యాలీలతో కేవలం 31నిమిషాల్లోనే ప్రత్యర్థి ఆట కట్టించాడు. 8–0 లీడ్‌‌తో తొలి గేమ్‌‌ మొదలుపెట్టిన లక్ష్యసేన్‌‌కు జియా ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయాడు. . రెండో  గేమ్‌‌లో 1–1తో స్కోరు సమమైన తర్వాత ఇండియన్‌‌ ప్లేయర్‌‌ ఎక్కడా వెనుదిరిగి చూసుకోలేదు. వరుసగా పది పాయింట్లు నెగ్గి 11–1తో బ్రేక్‌‌కు వెళ్లాడు. అదే జోరుతో  వరుస పాయింట్లతో హోరెత్తించిన సేన్‌  ఈజీగా గేమ్‌‌, మ్యాచ్‌‌ను చేజిక్కించుకున్నాడు. 

విమెన్స్‌‌ డబుల్స్‌‌ ఫైనల్లో రెండోసీడ్‌‌ పుల్లెల గాయత్రి– ట్రీసా జాలీ–21–18, 21–11తో బావో లి జింగ్‌‌–లి క్వియాన్‌‌ (చైనా)పై నెగ్గి తొలిసారి టైటిల్‌‌ను సొంతం చేసుకున్నారు. 2022లో ఈ జోడీ రన్నరప్‌‌తో సరిపెట్టుకుంది. మెన్స్‌‌ డబుల్స్‌‌ ఫైనల్లో పృథ్వీ కృష్ణమూర్తి రాయ్‌‌–సాయి ప్రతీక్‌‌ 14–21, 21–19, 17–21తో హుయాంగ్‌‌ డి–లియు యంగ్‌‌ (చైనా) చేతిలో, మిక్స్‌‌డ్‌‌ ఫైనల్లో ఐదోసీడ్‌‌ ధ్రువ్‌‌ కపిల–తనీషా క్రాస్టో 21–18, 14–21, 8–21తో ఆరోసీడ్‌‌ డెచ్‌‌పోల్‌‌–సుపిసారా (థాయ్‌‌లాండ్‌‌) చేతిలో పోరాడి ఓడారు.