బంపర్ ఆఫర్.. రూ.99కే స్నాక్స్.. అన్​లిమిటెడ్ పాప్​కార్న్​, కూల్ డ్రింక్

బంపర్ ఆఫర్.. రూ.99కే  స్నాక్స్.. అన్​లిమిటెడ్ పాప్​కార్న్​, కూల్ డ్రింక్

మల్టీఫ్లెక్స్ లో స్నాక్స్ , కూల్ డ్రింక్స్ తాగాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. టికెట్ల రేట్ల కంటే పాప్ కార్న్, ఇతర స్నాక్స్ , కూల్ డ్రింక్స్ రేట్లు డబుల్, ట్రిపుల్ ఉంటాయి. అందుకే ధనవంతులు మాత్రమే మల్టీఫ్లెక్స్ లలో పాప్ కార్న్, కూల్ డ్రింక్స్ తాగుతుంటారు. సామాన్యులు ఆ దోపిడిని చూడలేక అటు వైపు కన్నెత్తి  చూడని పరిస్థితి. అయితే తాజాగా పీవీఆర్ సినిమాస్ సామాన్యులకు గుడ్ న్యూస్ తెలిపింది. తమ థియేటర్లలో స్నాక్స్, కూల్ డ్రింక్స్ రేట్లను భారీగా తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. 

99కే అన్నీ...

పీవీఆర్ సినిమాస్ లో వారాంతంలో  రూ. 99కే స్నాక్స్​ కాంబో అందించనున్నట్లు వెల్లడించింది. వీకెండ్​లో అపరిమితమైన పాప్​కార్న్, కూల్ డ్రింక్స్ ను పొందే ఆఫర్​ను పీవీఆర్ ప్రకటించింది.  సోమవారం నుంచి గురువారం వరకు.. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు.. రూ. 99కే బర్గర్ లేదా సమోసా లేదా సాండ్​విచ్, 450ఎంఎల్ కూల్ డ్రింక్ ను విక్రయించనున్నట్లు పేర్కొంది. అలాగే శుక్రవారం నుంచి  ఆదివారం వరకు  రూ. 99 కే అపరిమితమైన పాప్​కార్న్​, కూల్ డ్రింక్స్  పొందొచ్చని పీవీఆర్ సినిమాస్ ప్రకటించింది.

ధరలు ఎందుకు తగ్గించిందంటే..?

ఉత్తర్​ప్రదేశ్ నొయిడా  పీవీఆర్​ సినిమాస్​లో త్రిదిప్ కే మండల్ అనే వ్యక్తి మూవీ చూసేందుకు వెళ్లాడు.  అక్కడ  రెగ్యులర్​ సైజ్​ చీజ్​ పాప్​కార్న్​, 600 మిల్లీ లీటర్ల ఓ కూల్​డ్రింక్​కు థియేటర్ నిర్వాహకులు భారీగా వసూలు చేశారు. దీంతో షాకైన త్రిదిప్..ఆ  బిల్లు  ఫొటోను ట్విట్టర్​లో పోస్ట్​ చేశాడు.  నొయిడా పీవీఆర్ సినిమాస్​లో  55 గ్రాముల చీజ్​ పాప్​కార్న్​ ధర రూ. 460,  600 మిల్లీలీటర్ల కూల్ డ్రింక్ ధర రూ.360గా ఉందని చెప్పాడు.  ఈ రెండింటికే  రూ.820 అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశాడు.  ఇది అమెజాన్ ప్రైమ్​ వార్షిక చందాకు దాదాపు సమానంగా పేర్కొన్నాడు. అందుకే ప్రజలు  సినిమాలకు వెళ్లడం లేదని..ప్రస్తుత కాలంలో  కుటుంబ సభ్యులతో కలిసి సినిమా చూడడం చాలా కష్టమని ట్విట్టర్ లో తెలిపాడు. 

పీవీఆర్ సినిమాస్ పై ఫైర్

త్రిదిప్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. మల్టీప్లెక్స్​లు స్నాక్స్, పెప్సీ​​కు భారీగా వసూలు చేయడంపై సోషల్ మీడియాలో  నెటిజన్లు మండిపడ్డారు. త్రిదిప్​ చేసిన పోస్ట్​ కొన్ని గంటల్లోనే ఏకంగా 3  మిలియన్ల వ్యూస్ దాటింది.  23 వేలకుపైగా  లైక్స్ వచ్చాయి.  5వేల మంది ఈ పోస్ట్​ను రీట్వీట్​ చేశారు.

స్పందించిన పీవీఆర్ సినిమాస్..

త్రిదిప్  పోస్ట్ వైరల్​ కావడంతో  పీవీఆర్ సినిమాస్ స్పందించింది. తాము అందరి అభిప్రాయాలను గౌరవిస్తామని... అందుకే భారత్​లో ఉన్న ప్రతి సినిమా అభిమాని కోసం తాము ఈ అప్డేట్​ ప్రకటిస్తున్నామంటూ ట్వీట్​ చేసింది.  అన్‌లిమిటెడ్ పాప్‌కార్న్‌, పెప్సీ ఫ్రీ రీఫిల్స్‌ను వీకెండ్ ఆఫ‌ర్‌గా అందిస్తున్నామ‌ని  పేర్కొంది.