పీవీలకు ఫుల్లు గిరాకీ

పీవీలకు ఫుల్లు గిరాకీ
  •     గత ఏడాది 42 లక్షల బండ్ల అమ్మకం 
  •     వార్షికంగా 8.4 శాతం పెరుగుదల
  •     ప్రకటించిన సియామ్ 

న్యూఢిల్లీ: మనదేశంలో ప్రయాణీకుల వాహనాల (పీవీల) హోల్‌‌‌‌సేల్స్ 2023–-24 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 42,18,746 యూనిట్లకు చేరాయి. యుటిలిటీ వెహికల్స్​కు బలమైన డిమాండ్ నేపథ్యంలో సంవత్సరానికి 8.4 శాతం వృద్ధి సాధ్యపడిందని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్​) ప్రకటించింది. సంస్థ  డేటా ప్రకారం, 2022–-23 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ప్రయాణీకుల వాహనాల షిప్​మెంట్లు (పంపకాలు) 38,90,114 యూనిట్లుగా ఉన్నాయి. టూవీలర్ల విక్రయాలు 2022-–23 ఆర్థిక సంవత్సరంలో 1,58,62,771 యూనిట్లతో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో 13.3 శాతం పెరిగి 1,79,74,365 యూనిట్లకు చేరుకున్నాయి. 

2022-–23 ఆర్థిక సంవత్సరంలో 2,12,04,846 యూనిట్ల నుంచి సమీక్షిస్తున్న కాలంలో కేటగిరీల వారీగా వాహనాల విక్రయాలు 12.5 శాతం పెరిగి 2,38,53,463 యూనిట్లకు చేరుకున్నాయి. అయితే, గత ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు 5.5 శాతం క్షీణించి 45,00,492 యూనిట్లకు పడిపోయాయి. 2024 ఆర్థిక సంవత్సరంలో 47,61,299 యూనిట్లుగా ఉన్నాయి.  గత ఆర్థిక సంవత్సరంలో దేశీయ పరిశ్రమ 12.5 శాతం వృద్ధితో భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ సంతృప్తికరమైన పనితీరును కనబరిచిందని సియామ్​ ప్రెసిడెంట్ వినోద్ అగర్వాల్​ చెప్పారు. 

ప్యాసింజర్ వెహికల్స్ (పీవీ) విభాగంలో దాదాపు 50 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. దేశీయంగా 42 లక్షల యూనిట్లు, ఎగుమతులు 7 లక్షల యూనిట్లు ఉన్నాయని ఆయన చెప్పారు. పీవీ విభాగంలో, ఎస్​యూవీలతో సహా యుటిలిటీ వాహనాలు 2024 ఆర్థిక సంవత్సరంలో 20,03,718 యూనిట్ల నుంచి 25,20,691 యూనిట్లకు పెరిగాయి. 2024 ఆర్థిక సంవత్సరంలో 25.8 శాతం వృద్ధి చెందాయి.

పెరుగుతున్న టూవీలర్ల అమ్మకాలు

టూవీలర్​విభాగం దేశీయ విక్రయాల్లో 13 శాతం వృద్ధితో దాదాపు 1.8 కోట్ల యూనిట్లకు రికవరీ బాటను కొనసాగించింది. అయితే 2019 ఆర్థిక సంవత్సరం గరిష్ట స్థాయి 2.1 కోట్ల యూనిట్ల కంటే తక్కువగా ఉంది. అయినప్పటికీ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కోలుకోలేదని ఆయన అన్నారు. త్రీ-వీలర్ సెగ్మెంట్‌‌‌‌లో 2019 ఆర్థిక సంవత్సరంలో ఏడు లక్షల యూనిట్ల గరిష్ట స్థాయికి దాదాపు దగ్గరగా ఉందని ఆయన అన్నారు. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం విక్రయాలపై భారతీయ ఆటో పరిశ్రమ ఆశాజనకంగా ఉందని అగర్వాల్ అన్నారు. అన్ని చోట్లా మంచి రుతుపవనాల వల్ల గ్రామీణ మార్కెట్ల నుంచి గిరాకీ ఎక్కువ రావొచ్చని భావిస్తున్నట్టు చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ సింగిల్ డిజిట్ వృద్ధిని చూడవచ్చని అగర్వాల్ చెప్పారు. రానున్న లోక్‌‌‌‌సభ ఎన్నికల కారణంగా మార్కెట్‌‌‌‌లో కొంత మందగమనం ఉండవచ్చని, అయితే అది మిగిలిన సంవత్సరంలో డిమాండ్‌‌‌‌  మెరుగవుతుందని అంచనా వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.