కిడ్నీ వ్యాధితో పత్రీజీ కన్నుమూత

 కిడ్నీ వ్యాధితో పత్రీజీ కన్నుమూత

ఆమనగల్లు, వెలుగు :  ధ్యాన గురువు, పిరమిడ్ స్పిరిచ్యువల్​ మూవ్ మెంట్​ ఆఫ్​ ఇండియా వ్యవస్థాపకుడు సుభాష్​ పత్రీజీ (75) కన్నుమూశారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ ​మండల కేంద్రం సమీపంలోని మహేశ్వర మహా పిరమిడ్​లో ఆదివారం సాయంత్రం చనిపోయారని పిరమిడ్​ నిర్వాహకులు తెలిపారు. ఆయన కొంత కాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. బెంగళూరులో చికిత్స తీసుకున్నారు. 1947లో బోధన్​లో జన్మించిన ఆయన.. శ్వాసపై ధ్యాసే ధ్యానం అని, శాకాహారంతో సంపూర్ణ ఆరోగ్యం సాధించవచ్చని ప్రచారం చేశారు.  ధ్యాన మార్గాన్ని ఎంచుకుని 40 ఏళ్లలో లక్షలాది మందిని ధ్యానం వైపు మళ్లించారు. 50 వేలకు పైగా ధ్యాన కేంద్రాలను స్థాపించారు. తాను ఆధ్యాత్మిక సేవ చేయడానికే వచ్చానని ఎందరో ధ్యానులు, మాస్టర్లను తయారు చేశానని గతంలో ఆయన పేర్కొన్నారు. తాను రెండు రోజుల్లో దేహాన్ని వీడివెళ్తానని, తన మరణాన్ని మూడు రోజులపాటు సంబురంగా నిర్వహించాలని పత్రీజీ ఇంతకు ముందు సందేశం ఇచ్చారని మహేశ్వర మహా పిరమిడ్ నిర్వాహకులు తెలిపారు. ఆయన సందేశం ప్రకారం పిరమిడ్​లో మూడు రోజులపాటు సంబు రాలు నిర్వహిస్తున్నామని వారు ఓ ప్రకటనలో తెలిపారు. పత్రీజీ మృతి వార్త తెలుసుకున్న ధ్యానులు, మాస్టర్లు మహా పిరమిడ్​కు తరలివెళ్తున్నారు.