భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొండచిలువ హల్ చల్ చేసింది. అశ్వారావుపేట మండలం వినాయకపురంలోని ఓ చికెన్ షాపులో కొండచిలువ దూరింది. మూలన నక్కి... రెండు కోళ్లను అమాంతం మింగింది. దీన్ని గమనించిన షాపు యజమాని భయాందళనకు గురయ్యాడు.
వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించాడు. చికెన్ షాపు దగ్గరకు చేరుకున్న ఫారెస్ట్ అధికారులు..కొండచిలువను పట్టుకున్నారు. కొండ చిలువ తిన్న రెండు కోళ్లను కక్కించారు. ఆ తర్వాత కొండచిలును అడవిలో వదిలేశారు.
అటు కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆర్గొండ గ్రామంలోని 33/11 కేవీ సబ్ స్టేషన్ లో మరో కొండ చిలువ హల్ చల్ చేసింది. సబ్ స్టేషన్ లోని ఆపరేటర్ రూమ్ లోకి కొండచిలువ చొరబడింది. దీంతో అందులో పని చేస్తున్న ఆపరేటర్ కొండచిలువను చూసి భయాందోళనకు గురయ్యాడు. స్థానికుల సహాయంతో ఆపరేటర్ కొండచిలువను చంపేశాడు. సబ్ స్టేషన్ భవనం శిథిలావస్థలో ఉండటంతో తరచూ పాములు, కొండచిలువలు వస్తున్నాయని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సబ్ స్టేషన్ లో పని చేయాలంటే భయంగా ఉందని ఉద్యోగులు చెబుతున్నారు.