వడ్ల కొనుగోళ్లు స్పీడప్​ చేయాలి... అధికారులకు మంత్రి జగదీశ్ రెడ్డి ఆదేశం

 

  •     అధికారులకు మంత్రి జగదీశ్ రెడ్డి ఆదేశం 
  •     తడిసిన ధాన్యం దించుకోవడంలో మిల్లర్ల అభ్యంతరాలు తగదు
  •     ముందస్తు పంట సాగుపై రైతులకు అవగాహన కల్పించాలి

సూర్యాపేట, వెలుగు  వడ్ల కొనుగోళ్లు స్పీడప్​ చేయాలని సంబంధిత అధికారులను మంత్రి జగదీశ్ రెడ్డి ఆదేశించారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యం దించుకోవడంలో రైతులను మిల్లర్లు ఇబ్బంది పెట్టడం తగదన్నారు. ధాన్యం తూకం వేసిన వెంటనే మిల్లులకు తరలించాలని చెప్పారు. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ధాన్యం  కొనుగోళ్ల కు సంబంధించి కలెక్టరేట్​లో గురువారం కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ  రాజేంద్ర ప్రసాద్, అడిషనల్ కలెక్టర్లు పాటిల్ హేమంత్ కేశవ్, మోహన్ రావు, సివిల్ సప్లై అధికారులు, మిల్లర్లు, ట్రాన్స్​పోర్టర్స్ తో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 296 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించగా, అందులో 20 కేంద్రాలలో కొనుగోళ్లు పూర్తి కావడంతో మూసి వేసినట్లు అధికారులు చెప్పారు. 

మిగతా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగంగా సాగుతున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 2లక్షల మెట్రిక్  టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు చెప్పారు. అందులో 1,84లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు తరలించామన్నారు. 15,414 మెట్రిక్ టన్నుల ధాన్యం తరలింపునకు సిద్ధంగా ఉందని తెలిపారు. మొత్తం రైతుల నుంచి సేకరించే ధాన్యాన్ని రూ.412 .21 కోట్లు అవుతుండగా, రూ. 185.44 కోట్ల ను ఇప్పటికే  14 వేల 297 మంది రైతుల ఖాతాల్లో జమ చేశామని వివరించారు. ఇంకా 14 వేల  817 మంది రైతుల ఖాతాల్లో రూ. 226.77 కోట్లు  జమ చేయాల్సి ఉందని చెప్పారు.  మిగతా 14 వేల  మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. సీజన్ అడ్వాన్స్ తో రైతులు ప్రకృతి వైపరీత్యాల కు చెక్ పెట్టొచ్చని చెప్పారు. ఈ మేరకు రైతులకు ముందస్తు పంట సాగుపై వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పించాలి ఆదేశించారు.

సూర్యాపేట అభివృద్ధికి రూ.6348 కోట్లు ఖర్చు 

సూర్యాపేట నియోజకవర్గ అభివృద్ధికి సీఎం కేసీఆర్ సహకారంతో ఇప్పటి వరకు రూ. 6, 348 కోట్లు ఖర్చు చేశామని మంత్రి జగదీశ్​ రెడ్డి వెల్లడించారు. గురువారం సూర్యాపేట నియోజకవర్గంలోని కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు ఆయన చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అభివృద్ధిని చూసి ఓర్వలేక విపక్షాలు పలుచోట్ల ప్రాజెక్టుల నుంచి రోడ్ల విస్తరణ వరకు పనులను అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినందుకే అటు రేవంత్..  ఇటు బండి వారివారి పార్టీలకు అధ్యక్షులుగా నియమితులైన విషయాన్ని విస్మరించరాదన్నారు.