- జూన్ క్వార్టర్‌లో రూ. 27,039 కోట్లకు మహీంద్రా రెవెన్యూ
- రూ.33,875 కోట్లు సాధించిన మారుతి
- పెరిగిన ఇరు కంపెనీల సేల్స్
న్యూఢిల్లీ: మారుతి సుజుకీ, మహీంద్రా అండ్ మహీంద్రా జూన్ క్వార్టర్ (క్యూ1) ఫలితాలు పర్వాలేదనిపించాయి. ఎస్‌యూవీలకు డిమాండ్ పెరగడంతో వీటి సేల్స్ పెరిగాయి. మారుతి సుజుకీ క్యూ1 లో రూ. 3,650 కోట్ల నికర లాభాన్ని (స్టాండ్ ఎలోన్) సాధించింది. కిందటేడాది జూన్ క్వార్టర్‌తో పోలిస్తే 46.9 శాతం గ్రోత్ నమోదు చేసింది. రెవెన్యూ 9.82 శాతం పెరిగి రూ.33,875 కోట్లకు చేరుకుంది. కంపెనీకి క్యూ1 లో రూ. 3,467 కోట్ల ప్రాఫిట్, రూ.34,770 కోట్ల రెవెన్యూ వస్తాయని ఎనలిస్టులు అంచనా వేశారు.
రిజల్ట్స్ మెప్పించడంతో కంపెనీ షేరు బుధవారం సెషన్‌లో 4 శాతం ర్యాలీ చేసి రూ.13,390 దగ్గర ముగిసింది. ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు, కమోడిటీ ధరలు తగ్గడం, ఫారిన్ ఎక్స్చేంజ్ రేట్లు మెరుగ్గా ఉండడంతో ప్రాఫిట్ పెరిగిందని మారుతి సుజుకీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. ఈ ఏడాది జూన్ క్వార్టర్‌లో మొత్తం 5,21,868 బండ్లను అమ్మగలిగింది. కిందటేడాది జూన్ క్వార్టర్‌తో పోలిస్తే ఇది 4.8 శాతం ఎక్కువ. డొమెస్టిక్ మార్కెట్‌లో 4,51,308 బండ్లను అమ్మగా, 70,560 బండ్లను ఎగుమతి చేసింది. కంపెనీ డొమెస్టిక్ సేల్స్ ఏడాది ప్రాతిపదికన 3.8 శాతం గ్రోత్‌ను, ఎగుమతులు 11.6 శాతం గ్రోత్‌ను నమోదు చేశాయి. కానీ, ఈ ఏడాది మార్చి క్వార్టర్‌తో పోలిస్తే జూన్ క్వార్టర్‌లో కంపెనీ ప్రాఫిట్ 5.9 శాతం తగ్గగా, సేల్స్ 7.7 శాతం పడ్డాయి.
రాణించిన మహీంద్రా కార్ల బిజినెస్
మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం) నికర లాభం కిందటేడాది జూన్ క్వార్టర్‌తో పోలిస్తే 5 శాతం తగ్గి క్యూ1 లో రూ.2,613 కోట్లుగా నమోదయ్యింది. రెవెన్యూ మాత్రం 12 శాతం పెరిగి రూ.27,039 కోట్లకు చేరుకుంది. కంపెనీ ఇబిటా (ట్యాక్స్‌లు, పన్నులు, ఇతరత్రాకు ముందు ప్రాఫిట్) 22 శాతం పెరగగా, జూన్ క్వార్టర్‌లో రూ.4,023 కోట్లకు చేరుకుంది. ఎం అండ్ ఎం క్యూ1 లో మొత్తం 3.33 లక్షల బండ్లను అమ్మగలిగింది. కంపెనీ ఆటోమోటివ్ బిజినెస్ రెవెన్యూ కిందటేడాది జూన్ క్వార్టర్‌తో పోలిస్తే 13 శాతం పెరిగి క్యూ1 లో రూ.18,947 కోట్లకు చేరుకుంది. ఫార్మ్ ఎక్విప్‌మెంట్ బిజినెస్ రెవెన్యూ 9.8 శాతం పెరిగి రూ. 8,144 కోట్లకు ఎగిసింది. అన్ని బిజినెస్ సెగ్మెంట్లలో కంపెనీ మార్జిన్స్ మెరుగుపడ్డాయని మహీంద్రా గ్రూప్ సీఎఫ్‌ఓ అమర్‌జ్యోతి బారువా అన్నారు. ఈ ఏడాది మే లో పేర్కొన్న తమ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌ను మొదలుపెట్టామని తెలిపారు. రిజల్ట్స్ వెలువడిన తర్వాత ఎం అండ్ ఎం షేర్లు తమ ఓపెనింగ్ లాభాలను కోల్పోయాయి. చివరికి అరశాతం నష్టపోయి రూ.2,909 దగ్గర సెటిలయ్యాయి.