పోలీసుల సస్పెన్షన్‌తో సరిపెట్టిన ఆఫీసర్లు
ఎంక్వైరీ రిపోర్ట్‌లో ఏముంది?
మెదక్, వెలుగు : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఖాదిర్ ఖాన్ లాకప్‌డెత్ కేసు ముందుకు కదలడం లేదు. ఆరోపణలు ఎదుర్కొన్న పోలీసులను సస్పెండ్ చేయడంతో అధికారులు సరిపెట్టారు. పోలీసుల చిత్రహింసల వల్లనే తన భర్త చనిపోయాడని ఖాదిర్ భార్య సిద్ధేశ్వరి ఆరోపించడంతో ఈ కేసు చర్చనీయాంశమైంది. పార్టీలు, ప్రజాసంఘాలు ఆందోళనలకు దిగడంతో పోలీసు ఉన్నతాధికారులు స్పందించక తప్పలేదు. సిద్ధేశ్వరి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. డీజీపీ ఆదేశాలతో ఎంక్వైరీ చేసినా.. రిపోర్ట్ మాత్రం బయటకు రాలేదు. పోస్ట్‌మార్టం రిపోర్ట్ కూడా రాకపోవడంతో కేసులో పురోగతి లేకుండా పోయింది.
థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆరోపణ
చైన్ స్నాచింగ్ చేశాడనే అనుమానంతో మెదక్ టౌన్ పోలీసులు జనవరి 29న మెదక్ పట్టణానికి చెందిన ఖాదిర్‌ఖాన్(35)ను హైదరాబాద్‌లో పట్టుకుని ఐదు రోజుల పాటు ఇంటరాగేషన్ చేశారు. తర్వాత తహసీల్దార్ ముందు బైండోవర్ చేశారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఖాదిర్ ను సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ ఫిబ్రవరి 17న చనిపోయాడు. తన భర్త దొంగతనం చేయకున్నా పోలీసులు పట్టుకెళ్లి థర్డ్ డిగ్రీ ప్రయోగించారని, ఫలితంగా కిడ్నీలు దెబ్బతిని అస్వస్థతకు గురయ్యాడని అతని భార్య సిద్ధేశ్వరి ఆరోపించారు. పోలీసుల దెబ్బలవల్లనే తన భర్త చనిపోయాడని ఆమె కంప్లైంట్చేశారు. దీంతో కేసును అనుమానాస్పద మృతిగా మార్చారు. ఇంటరాగేషన్పేరిట ఖాదిర్‌ను తీవ్రంగా కొట్టిన ఎస్ఐ, కానిస్టేబుళ్ల మీద హత్య కేసు నమోదు చేసి, వారిని ఉద్యోగాల నుంచి తొలగించాలని మజ్లిస్ ఎమ్మెల్యే కౌసర్ మొయినొద్దీన్ డిమాండ్ చేశారు. రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళి, వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు కూడా డిమాండ్ చేశాయి.
సుమోటోగా తీసుకున్న హైకోర్టు
ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా ఖాదిర్‌ఖాన్ మృతి ఘటనను హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. సిద్ధేశ్వరి కూడా తన భర్త మృతిపై విచారణ జరిపి న్యాయం చేయాలని, రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇప్పించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండింటినీ కలిపి విచారిస్తామని చెప్పిన హైకోర్టు ప్రభుత్వానికి, డీజీపీకి, మెదక్ ఎస్పీ, డీఎస్పీలకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.
డీజీపీ ఆదేశాలతో ఎంక్వైరీ
పోలీసుల తీరుపై తీవ్ర ఆరోపణలు రావ డంతో ఫిబ్రవరి 18న స్పందించిన డీజీపీ అంజనీకుమార్ ఘటనపై విచారణకు ఆదేశించారు. ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లాకు చెందిన సీని యర్ఆఫీసర్తో ఎంక్వైరీ చేయించి రిపోర్ట్ఇవ్వాలని సూచించారు. ఈ మేరకు ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్‌ను విచారణాధికారిగా నియమించారు. మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అదే రోజు మెదక్ టౌన్ సీఐ మధు, ఎస్ఐ రాజశేఖర్, కానిస్టేబుళ్లు పవన్, ప్రశాంత్ ను ఐజీ ఆఫీస్ కు అటాచ్ చేశారు. ఎస్పీ పంపిన రిపోర్ట్మేరకు ఫిబ్రవరి 19న వారు నలుగురిని సస్పెండ్ చేస్తూ ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ మెదక్ కు వచ్చి ఖాదిర్ మృతి ఘటనపై ఎంక్వైరీ చేశారు. రిపోర్టులో ఏముందో మాత్రం బయటపెట్టలేదు.