గూఢచర్యం ఆరోపణలకు సంబంధించిన కేసులో ఖతర్ కోర్టు గురువారం (డిసెంబర్ 28న) కీలక తీర్పు వెలువరించింది. భారత్‌కు చెందిన ఎనిమిది మంది నౌకాదళ మాజీ అధికారులకు ఖతర్ కోర్టు గతంలో మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ కేసులో 8 మందికి మరణశిక్షను రద్దు చేస్తూ వారికి ఊరట కల్పించింది. వారికి శిక్షను తగ్గించి జైలు శిక్ష విధిస్తున్నట్లు తెలిపింది. ఖతర్ కోర్టు తీర్పును భారత విదేశాంగ శాఖ చెప్పింది.
అయితే.. ఎనిమిది మందికి ఎన్నేళ్ల శిక్ష విధించారన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. తీర్పునకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదని, దీనిపై ఖతర్ అధికారులతో చర్చిస్తున్నామని భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఈ కేసు విషయంలో న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పింది.
కేసు కథేంటి..?
భారత్‌కు చెందిన ఎనిమిది మంది నౌకాదళ మాజీ అధికారులు అల్ దహ్రా సంస్థలో పని చేసేవాళ్లు. ఖతర్ సాయుధ దళాలకు శిక్షణ, ఇతర సేవలు అందించే ఈ సంస్థను.. ఒమన్‌కు చెందిన ఓ మాజీ వైమానిక దళ అధికారి నిర్వహిస్తున్నారు. అయితే.. భారత్‌కు చెందిన ఈ ఎనిమిది మందిని ఖతర్ అధికారులు 2022 ఆగస్టులో నిర్బంధంలోకి తీసుకున్నారు. సబ్‌మెరైన్ కార్యక్రమాల్లో గూఢచర్యానికి పాల్పడ్డారనే ఆరోపణలతో ఎనిమిది మందిని నిర్బంధించారు.
ఆ తర్వాత ఈ కేసులో విచారణ జరిపిన అక్కడి న్యాయస్థానం.. 8 మందికి మరణ శిక్ష విధిస్తూ 2023, అక్టోబరులో తీర్పు వెలువరించింది. ఈ తీర్పుపై భారత విదేశాంగ శాఖ దోహాలో అప్పీలు దాఖలు చేసింది. ఈ అప్పీల్‌ను పరిగణనలోకి తీసుకుని వారి మరణశిక్షను రద్దుచేసి, జైలుశిక్ష విధించింది. మరణశిక్ష పడిన వారిలో కెప్టెన్లు సౌరభ్ వశిష్ఠ్, నవతేజ్ గిల్, కమాండర్లు బీరేంద్ర కుమార్ వర్మ, పూర్ణేందు తివారీ, సుగుణాకర్ పాకాల, సంజీవ్ గుప్తా, అమిత్ నాగ్‌పాల్, సెయిలర్ రాగేశ్ ఉన్నారు. వీరిలో సుగుణాకర్ పాకాల విశాఖ వాసి.