
కోల్ బెల్ట్, వెలుగు: కవ్వాల్ టైగర్ రిజర్వ్, గోదావరి పరివాహక ప్రాంతంలో పక్షి వైవిద్యం, సంరక్షణపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు మార్చి 1,2 తేదీల్లో మంచిర్యాలలో కవ్వాల్ బర్డ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు మంచిర్యాల జిల్లా అటవీశాఖ అధికారి శివ్ ఆశిష్ సింగ్ బుధవారం తెలిపారు. తెలంగాణ అటవీశాఖ, డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఇండియా సంయుక్తంగా మంచిర్యాల కలెక్టరేట్‌వద్ద ఫెస్టివల్ కోసం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
ఫెస్టివల్ లో కవ్వాల్, గోదావరి పరివాహక పరిసర ప్రాంతాల్లో గుర్తించిన పక్షులను చూడటంతో పాటు వాటి జీవవైవిధ్య పరిరక్షణ ప్రత్యేకతలను తెలుసుకునే ఛాన్స్ లభిస్తుందన్నారు. ప్రముఖ పక్షిశాస్త్రవేత్తలు, నిపుణులు ద్వారా విద్యార్థులు, అటవీశాఖ సిబ్బందికి ప్రత్యేకంగా వర్క్‌షాప్‌లు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఫెస్టివల్‌ను సక్సెస్ చేయాలని కోరారు.