కవ్వాల్ టైగర్ జోన్ పులులకు అనువైన ప్రాంతం

జన్నారం, వెలుగు: కవ్వాల్ టైగర్ జోన్​లో పెద్దపులికి కావాల్సిన అన్ని వనరులన్నాయని మహారాష్ట్రలోని యోత్ మాల్​కు చెందిన వైల్డ్ లైఫ్​ వార్డెన్ రంజాన్ విరాణి అన్నారు. ఆదివారం జన్నారం మండల కేంద్రంలోని ఫారెస్ట్ కమ్యూనిటీ హాల్​లో నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాలకు చెందిన ఫారెస్ట్ ఆఫీసర్లు, బేస్ క్యాంప్ సిబ్బందికి నిర్వహించిన శిక్షణా కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. కవ్వాల్ టైగర్ జోన్​లో పర్యాటక రంగంపై దృష్టి సారించాలని, పర్యాటక రంగం అభివృద్ధి చెందితే పులులు తప్పకుండా కవ్వాల్ అడవుల్లోకి వస్తాయని చెప్పారు.

అడవులు అభివృద్ధి చెందాలంటే ఫారెస్ట్ గైడ్స్​ను ప్రభుత్వం నియమించాలని కోరారు. అడవుల్లో నివసిస్తున్న ప్రజలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండటమే గాకుండా వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తే అటవీ సిబ్బందికి అన్ని విధాలుగా సహకరిస్తారని, దీని వల్ల అడవులు అభివృద్ధి చెందడమే గాకుండా వన్యప్రాణులకు ఎలాంటి హాని జరగదని చెప్పారు. ఈ కార్యక్రమంలో జన్నారం రేంజ్ ఆఫీసర్ హఫీసొద్దిన్, జిల్లాలోని వివిధ రేంజ్​లకు చెందిన రేంజ్ ఆఫీసర్లు, ఎఫ్ఎస్ వోలు, బేస్ క్యాంపు సిబ్బంది పాల్గొన్నారు.