
కాజీపేట, వెలుగు : అర్హులైన పేదలందరికీ ఇండ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం ఖాజీపేట తహసీల్దార్ ఆఫీస్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాగుల రమేశ్మాట్లాడుతూ... కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చి 9 ఏండ్లు అవుతున్నా.. పేదలకు ఇండ్ల స్థలాలు, ఇండ్లు కట్టించడంలో విఫలమయ్యాయని విమర్శించారు.
పేదల ఇండ్ల కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 10లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ. 5లక్షలు తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇండ్ల స్థలాల కోసం జులై 3న కలెక్టరేట్ ను ముట్టడిస్తామని ప్రకటించారు. అనంతరం తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు నోముల కిషోర్, చేతివృత్తిదారుల సమన్వయ కమిటీ జిల్లా నాయకుడు తొట్టె మల్లేశం, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు ఓరుగంటి సాంబయ్య, గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ పాల్గొన్నారు.