- జీహెచ్ఎంసీలో ఆ కోడ్ ఆధారంగానే అన్ని సర్వీస్‌లు
- చెత్త సేకరణ సమస్యకూ చెక్‌పెట్టొచ్చు
- ప్రజల మేలుకోసమే జీఐఎస్సర్వే.. అందరూ సహకరించాలి
- ప్రాపర్టీ ట్యాక్స్‌పై ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుంది
- జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్‌లో కమిషనర్ ప్రెస్‌మీట్
హైదరాబాద్, వెలుగు: జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టం(జీఐఎస్) సర్వేతో ప్రజలకు మేలు జరుగుతుందని, ఈ సర్వే అనంతరం ప్రతి ఇంటికి యూనిక్ ఐడీ నంబర్‌తోపాటు క్యూఆర్ కోడ్ తరహాలో ఓ బోర్డును ఏర్పాటు చేస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి తెలిపారు. ఈ బోర్డు ఆధారంగా ప్రతి ఇంటికి సేవలు అందించడం మరింత సులభతరం అవుతుందని చెప్పారు. గురువారం జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆమ్రపాలి మాట్లాడారు.
గ్రేటర్ హైదరాబాద్ వాసులకు మెరుగైన సేవలు అందించడంతోపాటు పట్టణ ప్రణాళిక, వనరుల నిర్వహణను మెరుగుపరచడంపై దృష్టి సారించిన నేపథ్యంలో జీఐఎస్ సర్వే ఎంతో ఉపయోగపడుతుందన్నారు.
ఈ యూనిక్ నంబర్‌తో కూడిన బోర్డు ద్వారా క్యాబ్, ఆన్లైన్లో ఫుడ్, వస్తువులను బుక్ చేసినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇంటికే నేరుగా డెలివరీ అయ్యేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. అలాగే, ఇండ్లు, కాలనీల్లో ఉన్న సమస్యలను తమ దృష్టికి నేరుగా తీసుకొచ్చేందుకు కూడా ఈ బోర్డు ఉపయోగపడుతుందని తెలిపారు. యాప్ లో ఫిర్యాదు చేసేముందు యూనిక్ నంబర్ ఇస్తే తమకు కూడా ఈజీగా తెలుస్తుందని చెప్పారు. అలాగే, రోజూ చెత్త ఆటో వస్తుందో లేదో కూడా తెలుసుకునేందుకు వీలుంటుందని తెలిపారు. ఇప్పుడు ఒక్కోసారి తమ ఇంటికి కూడా చెత్త ఆటో రాక సఫర్ అవుతున్నామని, ఈ సర్వే తర్వాత అలాంటి ఇబ్బందులకు చెక్ పెట్టొచ్చని అన్నారు.
5 సర్కిల్స్‌లో జీఐఎస్ సర్వే ప్రారంభం
ఇప్పటికే 5 సర్కిళ్లలోని హైదర్ నగర్, మియాపూర్, చందానగర్, కేపీహెచ్ బీ కాలనీ, ఉప్పల్, హయత్ నగర్ లలో జీఐఎస్ సర్వేను ప్రారంభించామని, శాటిలైట్, గ్రౌండ్ ఫిజికల్ ద్వారా సర్వే నిర్వహిస్తామని ఆమ్రపాలి తెలిపారు. ఇప్పటివరకూ 130 చదరపు కిలోమీటర్లలో డ్రోన్ సర్వే పూర్తయిందని, త్వరలో 1,40,020 ప్లాట్స్ డిజిటలైజ్ చేస్తామని చెప్పారు. ప్రతి ఆస్తికి డిజిటల్ అడ్రస్ గుర్తింపు సంఖ్య ఇస్తామన్నారు.
డోర్ టు డోర్ సర్వేలో అవసరమైన సపోర్ట్ డాక్యుమెంట్లతోపాటు ప్రాపర్టీస్, యుటిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్కు సంబంధించిన సమాచారాన్ని మాత్రమే సేకరిస్తారని తెలిపారు. ప్రజలు ఎలాంటి అపోహలకు గురికావద్దని, సర్వే కు సహకరించాలని ఆమె కోరారు. ఈ సర్వే తో అన్ని కాలనీల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు వెసులుబాటు ఉంటుందన్నారు. గ్రౌండ్ లెవల్లో మొత్తం 600 టీమ్స్ ఏర్పాటు చేసి, రాబోయే 6 నెలల వ్యవధిలోనే సర్వే పూర్తి చేస్తామని తెలిపారు.
ఫిజికల్ సర్వే లో వ్యక్తిగత వివరాలను అడగడం లేదని, అలా ఎవరైనా అడిగితే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని రాయపూర్, లక్నో, ప్రయాగ్ రాజ్ లాంటి సిటీల్లో ఇటువంటి సర్వే ఇదివరకే చేశారని, చిన్న చిన్న పట్టణాల్లో కూడా సర్వే చేపట్టారని వివరించారు. జీహెచ్ఎంసీ లో కూడా ఫిజికల్ సర్వే కు సహకరించాలని నగర వాసులను కోరారు.
ప్రాపర్టీ ట్యాక్స్ పెంచే విషయం తమ పరిధిలో లేదని, దీనిపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఇప్పుడు అలాంటి ఆలోచన లేదని, ఎవరూ ఆందోళన చెందొద్దని తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్ కమిషనర్ స్నేహ శబరీశ్ పాల్గొన్నారు.
దేశానికి మోడల్‌గా హైదరాబాద్
హైదరాబాద్మహానగరాన్ని దేశానికి మోడల్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ఆమ్రపాలి తెలిపారు. అందులో భాగంగా అర్బన్ ప్లానింగ్, రిసోర్స్ మేనేజ్మెంట్మెరుగుపరచడానికి జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని ఆస్తులు, యుటిలిటీస్ మ్యాప్ చేయడానికి ఇంటిగ్రేటెడ్ జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టం సర్వే ను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందుకు కొత్త టెక్నాలజీని వినియోగిస్తున్నామని చెప్పారు.
జీఐఎస్ తో జీహెచ్ఎంసీ మొత్తాన్ని డ్రోన్ ద్వారా సర్వే చేసి, రికార్డు చేస్తున్నారని చెప్పారు. డ్రోన్లు బ్యాన్ ఉన్న బేగంపేట్ ఎయిర్ పోర్టు, డిఫెన్స్ లాంటి ప్రాంతాల్లో ఫిజకల్ సర్వే చేస్తామని తెలిపారు. దీంతో ప్రభుత్వ భూములు, చిన్న పెద్ద రోడ్లు, చెరువులు, సరస్సులతోపాటు నగరం మొత్తం మ్యాపింగ్ చేస్తున్నామని వివరించారు. దాదాపు 650 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో గల హైదరాబాద్ మహానగరంలో రెసిడెన్షియల్, కమర్షియల్ భవనాలతో కలిపి సుమారు 19 లక్షల 43 వేల నిర్మాణాలు ఉన్నట్టు తెలిపారు.
అందులో కమర్షియల్ గా 2.7 లక్షల భవనాలు ఉన్నాయని చెప్పారు. ప్రతి ఇంటి ముందు డిజిటల్ బోర్డు ను ఏర్పాటు చేయడంతో ప్రజలకు పలు రకాల ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. కాలనీలో ఎక్కడ సమస్యలున్నా.. జనన, మరణ ధ్రువీకరణ పత్రం, ఆస్తుల మ్యూటేషన్, ఇతర సేవలను నేరుగా ఇంటి వద్ద నుంచే పొందవచ్చని వివరించారు. విపత్తులు, ప్రమాద సంఘటనల్లో ప్రజలు త్వరితగతిన సేవలు పొందే అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాలు జరిగినప్పుడు ఆయా అధికారులు వేగవంతంగా స్పందించి, నేరుగా వెళ్లి సేవలు అందించేందుకు వీలుంటుందని తెలిపారు. అలాగే, ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కుంటలు తదితరాల కబ్జాలకు గురికాకుండా నిఘా ఉంటుందని ఆమె తెలిపారు. ప్రభుత్వ ఆస్తులకు సంబంధించిన వివరాలను హైడ్రాకు అందజేస్తామని పేర్కొన్నారు.