- స్కాన్ చేసి బిల్లులు చెల్లించేలా ఏర్పాట్లు
- వచ్చే నెల నుంచి సదరన్ డిస్కంలో అమలు
హైదరాబాద్, వెలుగు : కరెంటు బిల్లులపైనే క్యూఆర్ కోడ్ ముద్రించి దానిని స్కాన్ చేసి బిల్లులు చెల్లించేలా డిస్కంలు వెసులుబాటు కల్పించనున్నాయి. ఆర్బీఐ నిబంధనల నేపథ్యంలో జులై 1 నుంచి థర్డ్ పార్టీ పేమెంట్ యాప్స్ నుంచి విద్యుత్ బిల్లుల చెల్లింపులను నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వినియోగదారులు క్యూఆర్ కోడ్ ద్వారా బిల్లులు చెల్లించేలా వచ్చే నెల నుంచి అవకాశం కల్పిస్తామని సదరన్ డిస్కం వెల్లడించింది.
కరెంట్ మీటర్ రీడింగ్ తీసినప్పుడు బిల్లు కింద క్యూఆర్ కోడ్‌ను ముద్రిస్తారు. ఈ కోడ్ ను స్కాన్ చేసి గూగుల్ పే, ఫోన్ పే వంటి పేమెంట్ యాప్‌తో బిల్లును చెల్లించేలా విద్యుత్ పంపిణీ సంస్థ కొత్త నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా ఇండ్లలో మీటర్ల రీడింగ్ తీయగానే క్యూఆర్ కోడ్‌తో బిల్లు వస్తుంది. వినియోగదారులు తమ సెల్‌ఫోన్ తో క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి డెబిట్, క్రెడిట్ కార్డులు, యూపీఐ, నెట్ బ్యాంకింగ్ వంటి విధానాల్లో బిల్లు చెల్లించవచ్చు.
పైలట్ ప్రాజెక్టుగా డిస్కం పరిధిలో కొన్ని కస్టమర్ కేర్ సెంటర్లలో ఈ విధానాన్ని ఇప్పటికే అమలు చేశారు. అక్కడ వచ్చిన ఫలితాల ఆధారంగా అన్ని జిల్లాల్లోనూ త్వరలోనే ఈ విధానాన్ని అమల్లోకి తీసుకువస్తామని అధికారులు తెలిపారు.