ఫస్ట్ టైమ్: ఎప్​సెట్ హాల్ టికెట్లపై క్యూఆర్ కోడ్

ఫస్ట్ టైమ్: ఎప్​సెట్ హాల్ టికెట్లపై క్యూఆర్ కోడ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎప్ సెట్ పరీక్షలు ఈనెల 29 నుంచి ప్రారంభం కానున్నాయి. మే 4వ తేదీ వరకు జరిగే పరీక్షలకు 3.05 లక్షలకు పైగా విద్యార్థులు హాజరుకానున్నారు. అయితే, తొలిసారిగా ఈఏపీ సెట్ హాల్ టికెట్లపై క్యూఆర్ కోడ్‎ను ముద్రించారు. దీనిద్వారా పరీక్షా  కేంద్రాలను ఈజీగా తెలుసుకునే అవకాశం ఉంది. ఈసారి కూడా ఎగ్జామ్‎కు నిమిషం నిబంధన అమలు చేయనున్నారు.

ఎప్ సెట్ ఎగ్జామ్ ఏర్పాట్లపై శుక్రవారం జేఎన్టీయూహెచ్‎లో హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ బాలకిష్టారెడ్డి, వర్సిటీ వీసీ కిషన్ కుమార్  రెడ్డి, ఎప్ సెట్ కన్వీనర్ దీన్ కుమార్,  కోకన్వీనర్ విజయ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎప్ సెట్‎కు మొత్తం 3,05,774 మంది దరఖాస్తు చేసుకున్నారని, వారిలో ఇంజినీరింగ్ స్ర్టీమ్ కోసం 2,19,420 మంది, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కోసం 86,101 మంది, రెండింటికీ 253 మంది అప్లై చేశారని చెప్పారు. 

ఈ నెల  29,30 తేదీల్లో జరిగే అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కోసం 112 పరీక్షా కేంద్రాలు, మే 2 నుంచి 4 వరకు జరిగే ఇంజినీరింగ్ స్ర్టీమ్ కోసం 124 సెంటర్లు  ఏర్పాటు చేశామన్నారు.  కాగా, శనివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి అగ్రికల్చర్, ఫార్మసీ అభ్యర్థులకు, 22 నుంచి ఇంజినీరింగ్ అభ్యర్థులకు వెబ్ సైట్ లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయి. రోజూ రెండు సెషన్లలో ఎగ్జామ్స్ ఉంటాయని, ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ కంటిన్యూ అవుతాయని అధికారులు పేర్కొన్నారు.

తగ్గిన అప్లికేషన్లు.. 

గతేడాదితో పోలీస్తే ఈసారి  ఎప్ సెట్ అప్లికేషన్లు తగ్గాయి. 2024లో  3,54,803 దరఖాస్తులు రాగా, ఈసారి 3,05,774 వచ్చాయి. ఉమ్మడి ఏపీ విభజన కోటా ఈ ఏడాదితో ముగియడంతో ఏపీ విద్యార్థులకు ప్రత్యేక కోటా లేదు. ఈ క్రమంలోనే దరఖాస్తులు సుమారు 50 వేల వరకు తగ్గాయని అధికారులు చెప్తున్నారు. అయితే, ఎప్ సెట్ దరఖాస్తుల్లో తెలంగాణ రాష్ర్టానికి చెందిన విద్యార్థులు 2,80,343 మంది ఉండగా, ఇతర రాష్ర్టాలకు చెందినవారు 25, 431 మంది ఉన్నారు. ఎప్ సెట్ అడ్మిషన్ల ప్రక్రియలో తొలిసారిగా ఎస్సీ వర్గీకరణ అమలు చేయనున్నట్టు అధికారులు పేర్కొన్నారు.