ఇక అక్కడ కూడా  క్యూఆర్‌ కోడ్‌తో పేమెంట్స్

ఇక అక్కడ కూడా  క్యూఆర్‌ కోడ్‌తో పేమెంట్స్

దేశ వ్యాప్తంగా గుండు సూది నుంచి ఏది కొనాలన్నా క్యాష్​ లెస్​ పేమెంట్​ కే  జనాలు ఇష్టపడుతున్నారు. స్కాన్​ చేయడం... లేదా ఫోన్ నెంబరు కొట్టడం పే మెంట్​ చేయడం సర్వ సాధారణమైంది.  టీ కొట్టు దగ్గర కూడా క్యూఆర్​ కోడ్​ వేలాడుతూ ఉంటుంది.  అయితే ఇప్పుడు రైల్వే ప్రయాణికులు స్మార్ట్​ చెల్లింపుల ద్వారా టికెట్​ కొనుగోలు చేసే విధానాన్ని రైల్వేశాఖ అందుబాటులోకి తెచ్చింది.  దీంతో రైల్వే ప్రయాణికులకు  చిల్లర కష్టాలకు కూడా చెక్ పడనుంది.

రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. ఇకపై క్యూఆర్‌ కోడ్‌తో చెల్లింపులు చేసే విధానాన్ని అన్ని రైల్వే స్టేషన్లలో అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే తెలిపింది. దీంతో రైల్వే టికెట్‌ కౌంటర్ల దగ్గర టికెట్ల కొనుగోలు సులభతరం కానుంది.

క్యూఆర్‌ కోడ్‌ ద్వారా డిజిటల్‌ చెల్లింపులు చేసే సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చినట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ప్రస్తుతం ఈ విధానం ప్రధాన రైల్వే స్టేషన్లలోనే ఉంటుందని.. అనంతరం అన్ని స్టేషన్లకు విస్తరించినట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. రైల్వే స్టేషన్లలోని జనరల్‌ బుకింగ్‌, రిజర్వేషన్‌ కౌంటర్ల దగ్గర క్యూఆర్‌ కోడ్‌ ఉపయోగించి డిజిటల్‌ చెల్లింపులు చేయొచ్చని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. అన్ని స్టేషన్లలోని టికెట్ కౌంటర్ల విండో దగ్గర ప్రత్యేక డివైజ్‌ను ఉంచుతున్నట్లు వెల్లడించింది. 

సికింద్రాబాద్‌ వంటి ప్రధాన రైల్వే స్టేషన్లకే పరిమితమైన క్యాష్‌లెస్‌ సదుపాయాన్ని .. అన్ని రైల్వే స్టేషన్లకు విస్తరిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఇప్పటికే అన్ని స్టేషన్లకు డివైజులను పంపించామని, దశలవారీగా మరికొన్ని రోజుల్లో అన్ని స్టేషన్లలో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయని తెలిపింది.