ఒకే కాన్పులో నలుగురు.. ఇద్దరు మగ పిల్లలు, ఇద్దరు ఆడ పిల్లలు.. హైదరాబాద్లో ఘటన

ఒకే కాన్పులో నలుగురు.. ఇద్దరు మగ పిల్లలు, ఇద్దరు ఆడ పిల్లలు.. హైదరాబాద్లో ఘటన

హైదరాబాద్: ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు తల్లి జన్మనిచ్చిన అరుదైన ఘటన హైదరాబాద్ నగరంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తల్లీ, నలుగురు పిల్లలు క్షేమంగా ఉన్నారు. హైదరాబాద్ లోని హస్తినాపూర్ ప్రాంతానికి చెందిన అమృత అనే 24 ఏళ్ల గర్భిణికి ఏడున్నర నెలలకే పురిటి నొప్పులు రావడంతో  ఫిబ్రవరి 22న హైదరాబాద్లోని నీలోఫర్ హాస్పిటల్లో కుటుంబ సభ్యులు చేర్పించారు. వైద్యులు వెంటనే ఆపరేషన్ చేశారు. ఒకే కాన్పులో నలుగురికి తల్లి జన్మనిచ్చింది.

నలుగురు పిల్లల్లో ఇద్దరు మగ పిల్లలు, ఇద్దరు ఆడపిల్లలకు అమృత జన్మనిచ్చింది. పిల్లల బరువు ఒక్కొక్కరిది..1.6కేజీలు, 1.5 కేజీలు, 1.4 కేజీలు, 1.2 కేజీలుగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అందరూ ఆరోగ్యంగా ఉండటంతో వైద్యులు శనివారం డిశ్చార్జ్ చేశారు. ఈ అరుదైన కాన్పుకు సంబంధించిన వివరాలను నీలోఫర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్ రవికుమార్ మీడియాకు వెల్లడించారు.

ALSO READ | శ్రీమంతులు తినే సన్నబియ్యం ఇకపై పేదలు తింటారు: సీఎం రేవంత్ రెడ్డి

తక్కువ బరువుతో నెలలు నిండకుండానే జన్మించడంతో శ్వాస సంబంధిత ఇబ్బందులు తలెత్తగా వెంటిలేటర్ సాయంతో చికిత్స అందించారు. మొదట్లో నలుగురికి తల్లి పాలివ్వడం ఇబ్బందిగా ఉండడంతో హ్యూమన్ మిల్క్ బ్యాంకు నుంచి తీసుకొచ్చి పిల్లలకు తాగించారు. 35 రోజుల చికిత్స తర్వాత తల్లి పిల్లలను శనివారం డిశ్చార్జ్ చేసినట్టు నీలోఫర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ రవికుమార్, ఎన్ఎన్ హెచ్ఓడీ డాక్టర్ స్వప్న తెలిపారు.