వావ్.. మట్టితో గూళ్లు కట్టుకున్న పిట్టలు

వావ్.. మట్టితో గూళ్లు కట్టుకున్న పిట్టలు

వెలుగు, కరీంనగర్: సాధారణంగా పక్షి గూడంటే పుల్లలు, కొబ్బరి పీచు, గరిక తదితరాలతో కట్టుకున్నవే మనకు గుర్తుకొస్తాయి. కానీ మనుషులు ఇండ్లు కట్టుకున్నట్లు మట్టితో గూడు కట్టుకునే పిట్టలు లోయర్ మానేరు డ్యామ్‌‌లో పర్యాటకులను ఆశ్చర్యపరుస్తున్నాయి. కాకతీయ మెయిన్‌‌ కెనాల్‌‌హెడ్ రెగ్యులేటరీ గేట్ల కోసం నిర్మించిన బిల్డింగ్ లాంటి నిర్మాణం చుట్టూ పిట్టలు మట్టితో ఆవాసాలు ఏర్పరచుకున్నాయి. ఇంగ్లీష్‌‌ కేవ్ స్వాలోగా పిలిచే ఈ పక్షులు ఊర పిచ్చుకలను పోలి ఉన్నాయి. 

అమెరికాలో మాత్రమే కనిపించే ఈ పక్షులు ఇండియాలో మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఒకటి, రెండు చోట్ల మాత్రమే ఉన్నాయని, తెలంగాణలోనూ ఉండడం విశేషమని, కాకతీయ యూనివర్సిటీ జువాలజీ ప్రొఫెసర్‌‌ ఇస్తారి తెలిపారు. బురద మట్టి, పీచు పదార్థాలతో ఇవి గుహలు, నీటి వనరుల పక్కనే ఉన్న బిల్డింగ్స్, బ్రిడ్జిలకు మట్టితో గూళ్లు కడుతుంటాయని వెల్లడించారు. అరుదైన ఈ పక్షిజాతి ఆవాసాలు దెబ్బతినకుండా పరిరక్షించాల్సిన అవసరం ఉందన్నారు.