త్వరలో ‘టీఆర్ఎస్’ పార్టీ ‘బీఆర్ఎస్’ గా మారనుందని సీఎం కేసీఆర్ ఇటీవలే ప్రకటించారు. దసరా రోజున మధ్యాహ్నం 1.19 గంటలకు జాతీయ పార్టీ ప్రకటన చేస్తానని వెల్లడించారు. ఈ విషయం ఇప్పుడు ఇటు రాష్ట్రంలోనూ అటు దేశంలోనూ హాట్ టాపిక్ గా మారింది. అయితే అసలు ఇంతకీ జాతీయ పార్టీ స్థాపించడానికి పార్టీలకు కావాల్సిన అర్హతలు ఏమిటి? విధి విధానాలేమిటి? ఒక పార్టీని జాతీయ పార్టీగా ఎలా గుర్తిస్తారు ? అన్న విషయానికొస్తే...
మన దేశంలో బహుళ పార్టీల రాజకీయ వ్యవస్థ అమల్లో ఉంది. అంటే ఎన్ని పార్టీలైనా దేశంలో ఉండొచ్చు. అలాగే, ఈ పార్టీలను జాతీయ, ప్రాంతీయ పార్టీలు అనే రెండు రకాలుగా విభజించారు.
జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే...
- కేంద్ర ఎన్నికల సంఘం 1968 ప్రకారం చివరి సారిగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్ లేదా అసెంబ్లీ స్థానాల్లో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో అభ్యర్థులు పోటీ చేయాలి.
- ఎన్నికల్లో పోలై చెల్లిన ఓట్లలో ఆరు శాతం ఓట్లు సాధించాలి.
- ఏదైనా ఒక రాష్ట్రం లేదా రాష్ట్రాల నుంచి కనీసం నలుగురు అభ్యర్థులు ఎంపీలుగా ఎన్నికవ్వాలి.
- కనీసం నాలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందాలి.
- గత సాధారణ ఎన్నికల్లో లోక్‌సభలోని మొత్తం సీట్లలో కనీసం రెండు శాతం సీట్లను గెలుచుకొని ఉండాలి. గెలుపొందిన అభ్యర్థులు మూడు రాష్ట్రాల నుంచి ఎన్నికవ్వాలి.
దేశంలో ప్రస్తుతం 8 జాతీయ పార్టీలు
1. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
2. భారతీయ జనతా పార్టీ
3. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా - సీపీఐ
4. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) - సీపీఎం
5. ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ ( నాలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందింది కాబట్టి జాతీయ పార్టీగా అవతరించింది)
6. బహుజన్ సమాజ్ పార్టీ
7. నేషనలిస్ట్ కాంగ్రెస్
8. నేషనల్ పీపుల్స్ పార్టీ