
సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చిన్నకోడూరు మండలం అనంతసాగర్ రాజీవ్ రహదారిపై అతివేగంగా దూసుకొచ్చిన క్వాలిస్ కారు.. లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
మృతులు , క్షతగాత్రులు సిద్దిపేటలోని ఇందూరు ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులుగా గుర్తించారు. పాలిటెక్నిక్ ఎగ్జామ్ రాయడానికి క్వాలిస్ వాహనంలో 11మంది విద్యార్థులు కరీంనగర్ వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. పరీక్ష రాసి తిరిగి వస్తుండగా.. చిన్నకోడూరు (మం) అనంతసాగర్ గ్రామ శివారులో ఆగి ఉన్న ఇసుక లారీని విద్యార్థులు ప్రయాణిస్తున్న క్వాలిస్ కారు..ఢీకొన్నట్లు చెప్పారు.
ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సిద్దిపేట ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.