- కాళేశ్వరం కమిషన్‌కు చెప్పిన ప్రాజెక్ట్ ఏఈఈ, డీఈఈలు
- ఇంత నిర్లక్ష్యమెందుకని చైర్మన్ పీసీ ఘోష్ మండిపాటు
- అడిగిన ప్రశ్నలకే జవాబు చెప్పాలని వార్నింగ్
- సంతకాలు తీసుకొని ఫీల్డ్ వర్క్ రిజిస్టర్ల స్వాధీనం
- నేడు విచారణకు 15 మంది ఇంజినీర్లు
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి క్వాలిటీ కంట్రోల్ రిజిస్టర్లు మాయమయ్యాయి. బ్యారేజీ నిర్మాణంలో పాటించిన నాణ్యతా ప్రమాణాలను నిర్ధారించే రిజిస్టర్లు అందుబాటులో లేవని జ్యుడీషియల్ కమిషన్‌కు లోయర్ కేడర్ ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు. ఈ వ్యవహారంపై కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ అసహనం వ్యక్తంచేశారు. అత్యంత కీలకమైన ఫైళ్లను జాగ్రత్తగా పెట్టాల్సిన అవసరం లేదా? అని ఫైర్ అయ్యారు. అంత పెద్ద ప్రాజెక్ట్ నిర్మిస్తున్నప్పుడు ఇంత నిర్లక్ష్యం ప్రదర్శిస్తారా? అని మండిపడ్డారు. సోమవారం 18 మంది ఏఈఈ, డీఈఈలను ఓపెన్ కోర్ట్ ద్వారా కమిషన్ విచారించింది. ఇద్దరు ఇంజినీర్లు నిర్లక్ష్యపు సమాధానాలు ఇవ్వడంతో జస్టిస్ ఘోష్ మండిపడ్డారు. అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పాలని, ముందుగానే సిద్ధం చేసుకున్న జవాబులను కమిషన్ ముందు చెప్పొద్దని హెచ్చరించారు.
ఫీల్డ్ వద్ద జరిగిన పనులకు సంబంధించిన రిజిస్టర్లను ఇంజినీర్ల నుంచి సంతకాలు తీసుకొని కమిషన్ చైర్మన్ స్వాధీనం చేసుకున్నారు. వాటితోపాటు మేడిగడ్డ బ్లాక్ 7కు సంబంధించిన ఫీల్డ్ వర్క్ ప్లేస్‌మెంట్ రిజిస్టర్లనూ తీసుకున్నారు. ‘ప్రాజెక్ట్ పనులకు సంబంధించి ప్లేస్‌మెంట్ రికార్డులను రోజువారీ నమోదు చేశారా? పనులు జరిగిన తర్వాత రోజు చేశారా? అని జస్టిస్ ఘోష్ ప్రశ్నించారు. ఆయా రికార్డులపైనా ఇంజినీర్ల సంతకాలు తీసుకున్నారు. అయితే, 2020లోనే మేడిగడ్డ బ్యారేజీకి జరిగిన డ్యామేజీని గుర్తించామని, ఆ వెంటనే ఉన్నతాధికారులకు లేఖ రాశామని ఇంజినీర్లు కమిషన్‌కు చెప్పారు. అయితే, క్వాలిటీ కంట్రోల్ రిజిస్టర్లు లేవని ఇంజినీర్లు సమాధానమిచ్చారు. దీనిపై జస్టిస్ ఘోష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, మంగళవారం 15 మంది ఏఈఈ, డీఈఈలను కమిషన్ విచారించనున్నది.