పేద పిల్లలందరికీ నాణ్యమైన విద్య.. అందుకే నియోజకవర్గానికో ఇంటిగ్రేటెడ్ స్కూల్

పేద పిల్లలందరికీ నాణ్యమైన విద్య.. అందుకే నియోజకవర్గానికో ఇంటిగ్రేటెడ్ స్కూల్
  • అందుకే నియోజకవర్గానికో ఇంటిగ్రేటెడ్ స్కూల్: సీఎం రేవంత్ రెడ్డి  

గత బీఆర్ఎస్ ప్రభుత్వంరెసిడెన్షియల్ స్కూళ్లను పట్టించుకోలే 
నిరుద్యోగులు ఉద్యోగాలు అడిగితేబర్రెలు, గొర్రెలు కాసుకోవాలన్నరు
జిల్లాకో పార్టీ ఆఫీస్ కట్టుకుని..గురుకులాలకు మాత్రం బిల్డింగ్స్ కట్టలేదని ఫైర్  
షాద్​నగర్ నియోజకవర్గంలోని కొందుర్గులోఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన

మహబూబ్​నగర్/ షాద్​నగర్, వెలుగు: రాష్ట్రంలోని పేద పిల్లలందరికీ నాణ్యమైన విద్యను అందించడమే తమ లక్ష్యమని, అందుకే ప్రతి నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్​ఏర్పాటు చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ‘‘మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని నిర్ణయం తీసుకున్నం. దీనిపై మేధావులతో చర్చించినం. వారి సలహాలు, సూచనలు తీసుకున్నం. రాష్ట్రాన్ని విద్య, వైద్యంలో ముందుంచేందుకు కృషి చేస్తున్నం’’ అని చెప్పారు. శుక్రవారం షాద్​నగర్ నియోజకవర్గంలోని కొందుర్గులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రెసిడెన్షియల్ స్కూళ్లను, గురుకులాలను పట్టించుకోలేదని మండిపడ్డారు.


‘‘సీఎంగా కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. అప్పటికే రాష్ట్రంలో ఉన్న 1,023 రెసిడెన్షియల్ స్కూళ్లను ఆయన పట్టించుకోలేదు. పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రత్యేక గురుకులాలు ప్రారంభించినట్టు ప్రకటించుకున్నారు. కానీ, ఆ గురుకులాలకు కొత్త బిల్డింగులు కట్టలేదు. కనీస సౌలతులు కల్పించలేదు. పిల్లలకు సక్కగా భోజనం పెట్టలేదు. నలుగురు ఉండాల్సిన రూమ్​లో 30 మందిని ఉంచారు. కేసీఆర్​పదేండ్లలో రూ.7 లక్షల కోట్లు అప్పు తెచ్చారు. కానీ పేదల కోసం రూ.10 వేల కోట్లు కూడా ఖర్చు పెట్టే ఆలోచన చేయలేదు. ఈ పదేండ్లలో రూ.15 వేల కోట్లు ఇచ్చినా.. రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నీ అద్భుతంగా తయారయ్యేవి. అక్కడ సౌలతులు కల్పించి ఉంటే.. తెలంగాణ విద్యార్థులు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు అయ్యేవారు. కానీ కేసీఆర్ అలాంటి ఆలోచన చేయలేదు. 33 జిల్లాల్లో ఎకరాల కొద్దీ సర్కార్ భూములను దిగమింగి పార్టీ ఆఫీసులను మాత్రం కట్టుకున్నారు. కేసీఆర్ కు పార్టీ ఆఫీసులు కట్టుకోవడానికి భూములు, పైసలు ఉంటయ్ గానీ.. పేద పిల్లలకు బడులు కట్టించేందుకు, వాటిని నిర్వహించేందుకు మాత్రం పైసలు దొరకలేదా?” అని సీఎం ప్రశ్నించారు. 

ఆర్ఎస్ ప్రవీణ్.. నువ్వూ కేసీఆర్ లెక్కనేనా? 

నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని కేసీఆర్ ఎన్నడూ ఆలోచన చేయలేదని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ‘‘తెలంగాణ యువతకు చదువు ఎందుకు? బర్రెలు, గొర్రెలు కాసుకుంటూ, చేపలు పట్టుకుంటూ బతకాలని కేసీఆర్ చాలాసార్లు అన్నారు. పేదల పిల్లలు చదువుకోవద్దన్నదే కేసీఆర్ విధానం. ఆయన కొడుకు మాత్రం మంత్రి కావాలె.. బిడ్డ ఎంపీ, సడ్డకుని కొడుకు రాజ్యసభ సభ్యుడు, అల్లుడు మంత్రి అయ్యి వేల కోట్లు దోచుకోవాలె. కేసీఆర్.. నీ కొడుకు, నీ మనమడిని బర్రెలు, గొర్రెలు, పందులు కాయడానికి పంపిస్తవా? పంపవు. కానీ మా పేదల పిల్లలు మాత్రం బర్రెలు, గొర్రెలు కాసుకుంటూ బతకాల్నా? నీ పిల్లలు మాత్రం రాజ్యాలు ఏలాల్నా?” అని ఫైర్ అయ్యారు. తమ ప్రభుత్వం మంచి పనులు చేస్తుంటే కొందరు బీఆర్ఎస్ లీడర్లు తప్పుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. మీరు బీఎస్పీలో ఉంటరా? బీఆర్ఎస్​లో ఉంటరా? మీ ఇష్టం. గత ప్రభుత్వ హయాంలో గురుకులాల సెక్రటరీగా పని చేసిన మీకు.. మేం గొప్పగా ఏర్పాటు చేస్తున్న రెసిడెన్షియల్ స్కూళ్లపై అభ్యంతరం ఎందుకు? బీఆర్ఎస్​లో చేరగానే పేదలకు చదువు అందవద్దని కేసీఆర్​లాగే మీరూ భావిస్తున్నారా? తెలంగాణ బిడ్డలను ఏ దొరలైతే విద్య, వైద్యానికి దూరం చేసిన్రో.. ఏ దొరలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అన్యాయం చేసిన్రో.. వారి పక్కనే నువ్వు చేరినవ్. ఎస్సీ, ఎస్టీ, బీసీలు బర్రెలు, గొర్రెలు కాసుకుంటూ.. చేపలు పట్టుకుంటూ.. చెప్పులు కుట్టుకుంటూ..పందులు పెంచుకుంటూ బతకాల్నా? కేసీఆర్ ఏది చెప్పిండో.. నువ్వు కూడా ఇప్పుడు తెలంగాణ బిడ్డలకు అదే నేర్పించాలని అనుకుంటున్నావా?” అని నిలదీశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం టీచర్ల జీవితాలతో చెలగాటమాడిందని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. పదేండ్లలో బదిలీలు, ప్రమోషన్లపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఫైర్ అయ్యారు. ఈ కార్యక్రమంలో షాద్​నగర్, పరిగి, చేవెళ్ల ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకర్, రామ్మోహన్​రెడ్డి, యాదయ్య, మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, రంగారెడ్డి కలెక్టర్ శశాంక​ తదితరులు పాల్గొన్నారు. 

సీఎం సార్.. మీ ఆలోచన బాగుంది 

‘పిల్లలంతా కులాలను బట్టి వేర్వేరుగా కాకుండా ఒకే దగ్గర చదువుకోవాలనే మీ ఆలోచన బాగుంది సార్’ అని కొందుర్గ్ ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న మణికంఠ అన్నాడు. సీఎం సభలో మణికంఠ మాట్లాడాడు. ‘‘భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వేర్వేరు గురుకులాలు ఉండడం కంటే.. అందరూ ఒకే దగ్గర చదువుకోవడం మంచిది. ఇలాంటి ఆలోచన చేసిన సీఎం 
సార్​కు థ్యాంక్స్’’ అని మణికంఠ చెప్పాడు. 

ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు.. ఇలా పిల్లలందరూ సపరేట్​గా పెరగడం వల్ల వాళ్ల మైండ్​లో విషం నింపినోళ్లం అవుతాం.ఈ వ్యవస్థ మమ్మల్ని దూరంగా పెడుతున్నదనే భావన వారిలో కలుగుతుంది. అందుకే విద్యార్థులందరినీ ఒక్క దగ్గర చేర్చితే, వారిలో సోదరభావం పెరుగుతుంది. ఇంటిగ్రేటెడ్​ స్కూల్స్​ లక్ష్యం ఇదే. మేం అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యాశాఖపై ఫోకస్ పెట్టినం. ఇటీవల 34 వేల మంది టీచర్లను ట్రాన్స్​ఫర్​ చేసినం. 21 వేల మంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చినం. ఎలాంటి వివాదాలకు తావులేకుండా విజయవంతంగా పూర్తి చేసినం.

- సీఎం రేవంత్​ రెడ్డి