‘మన పిల్లలకు ఇవ్వగలిగే విలువైన ఆస్తి మంచి చదువు మాత్రమే’ నేటి ప్రపంచంలో ప్రతి పేరెంట్ చేసే ఆలోచన ఇది. ఆ తల్లిదండ్రుల సోషల్ స్టేటస్, ఆర్థిక స్తోమతకు సంబంధం లేకుండా చెప్పే మాట ఇది. ఈ ఆలోచనలకు ప్రాణం పోసేలా కొత్త జాతీయ విద్యా విధానాన్ని కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. ప్రాంతం, సామాజిక స్థితి గతులు, పుట్టిన కుటుంబం, బ్యాక్ గ్రౌండ్, జెండర్, వైకల్యాలు.. ఇలా ఏ ఒక్క బేధం లేకుండా ఈ దేశంలో పుట్టిన ప్రతి పిల్లాడికీ సమానంగా చదువుకునే అవకాశం, నైపుణ్యాలను పెంచుకునే వీలు కల్పించాలన్న లక్ష్యంతో దీనిని తయారు చేసింది. దాదాపు మూడున్నర దశాబ్దాల క్రితం నాటి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఉన్న లోపాలను సవరిస్తూ భవిష్యత్తు ప్రపంచంతో పోటీ పడేలా విద్యను అందించేలా రూపకల్పన జరిగింది.
ఎప్పుడో 1986లో రూపొందించిన జాతీయ విద్యా విధానంతో దేశాన్ని ప్రపంచ శక్తిగా మార్చడం సాధ్యమయ్యే పని కాదు. బస్తాల కొద్దీ పుస్తకాలను వీపున మోస్తూ కుస్తీ పడితే ఫలితం ఏమీ ఉండదు. దానిలోని గుజ్జును సరైన రీతిలో బుర్రలోకి ఎక్కించే ప్రయత్నం జరగాలి. ఇందు కోసం పుస్తకాల రూపకల్పన మొదలు, టీచింగ్ విధానం వరకు అన్నీ మారాలి. ఆ మార్పులకు శ్రీకారంచుడుతూ కేంద్ర కేబినెట్ జూలై 29న కొత్త నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని ఆమోదించింది. ఇస్రో మాజీ చైర్మన్ కేఎస్ కస్తూరి రంగన్, కేబినెట్ మాజీ సెక్రటరీ సుబ్రమణియన్ వంటి మేధావులతో పాటు దేశ వ్యాప్తంగా లక్షల మంది సలహాలు, సూచనలతో రూపొందించిన విద్యా విధానమిది.
ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ చట్టబద్ధం
పాత విద్యా విధానంలో లోపాలను సవరిస్తూ తీసుకొచ్చిన కొత్త పాలసీ లక్ష్యాల్లో ప్రధానమైనది స్టూడెంట్స్ లెర్నింగ్ కెపాసిటీని పెంచడం. ప్రతి ఒక్కరికీ చదువుకునేందుకు సమానమైన అవకాశాలను కల్పించడంతోపాటు 2025 నాటి ప్రతి పిల్లాడికీ నాణ్యమైన ప్రైమరీ ఎడ్యుకేషన్, 2030 నాటికి 3 నుంచి 18 ఏళ్ల మధ్య వయసున్న అందరికీ ఉచిత నిర్బంధ విద్య అందించడం, 12వ తరగతి వరకు డ్రాప్ ఔట్స్ లేకుండా సంపూర్ణ అక్షరాస్యత సాధించడం, 2035 నాటికి హయ్యర్ ఎడ్యుకేషన్ లో గ్రాస్ అడ్మిషన్ రేషియో 50 శాతానికి పెంచడంతోపాటు స్కిల్ డెవలప్ మెంట్లో మార్పులు వంటివి కొత్త విద్యా విధానం లక్ష్యాలు. ఇందుకోసం ప్రైమరీ లెవెల్ నుంచే పునాది వేయాలి. పిల్లలకు మూడేళ్ల వయసు నుంచే ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అందించేలా చట్టబద్ధం చేస్తున్నారు. పాత విధానంలో ఉన్న 10+2 ప్లేస్ లో 5+3+3+4 విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నారు. పిల్లలు మొదటి ఐదేళ్లు ప్రీ ప్రైమరీ, ఒకటీ రెండు తరగతులు చదువుతారు. దీనిని ఫౌండేషన్ లెవెల్ ఎడ్యుకేషన్ గా కొత్త పాలసీలో పెట్టారు. ఆ తర్వాత ఐదేళ్లు ప్రిపరేటరీ లెవెల్ లో మూడో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఉంటాయి. ఇక మిడిల్ స్కూల్ లో ఆరు, ఏడు, ఎనిమిది క్లాసులు, చివరి నాలుగు సంవత్సరాలు (15–18 ఏళ్ల వయసు) 9 నుంచి 12వ తరగతి వరకు సెకండరీ ఎడ్యుకేషన్ గా విభజించారు. ఈ విధానంలో ప్రతి విద్యార్థికీ మంచి లెర్నింగ్ స్కిల్స్, నైపుణ్యాలను పెంచేందుకు అవసరమైన రీతిలో కరికులం డిజైన్ కు కసరత్తు జరుగుతోంది.
భారతీయ భాషలకు ప్రయారిటీ
పోటీ ప్రపంచంలో నెగ్గుకు రావాలంటే మన లోకల్ లాంగ్వేజ్ తో పాటు ఇతర భాషలు కూడా నేర్చుకోవాలి. దీనికి కొత్త విధానం పెద్ద పీట వేస్తోంది. అయితే మొదట పిల్లల్లో ఆలోచనా శక్తి, అనలిటికల్ నాలెడ్జ్ పెరగాలంటే మాతృభాషలో విద్యా బోధన జరగాలన్నది నిపుణుల అభిప్రాయం. ఇందుకోసం కనీసం 5వ తరగతి వరకు ప్రతి స్కూల్ లోనూ తప్పనిసరిగా మాతృ భాషలోనే టీచింగ్ జరగాలన్నది ఈ పాలసీ నిబంధన. వీలైతే 8వ తరగతి, ఆ తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు కూడా కంటిన్యూ చేయొచ్చు. అలాగే లోకల్ లాంగ్వేజ్ తో పాటు జాతీయ భాష, సంస్కృతం వంటివి అన్ని క్లాసుల్లోనూ నేర్చుకునే అవకాశం కల్పిస్తున్నారు. అయితే ఏ భాషనూ తప్పనిసరిగా నేర్చుకోవాలన్న నిబంధన ఉండదు. వీటిని ఒక ఆప్షన్ గా మాత్రమే ఇస్తారు. ఆరో తరగతి నుంచి ఆసక్తి ఉంటే ఫారెన్ లాంగ్వేజెస్ నేర్చునేందుకు కూడా వీలు కల్పిస్తారు.
లోకల్ లాంగ్వేజ్ లో ఉన్నత విద్య
సుస్థిరమైన జీవనోపాధి కల్పించడం ద్వారా హయ్యర్ ఎడ్యుకేషన్ దేశ ఆర్థిక అభివృద్ధిలో కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఉన్నత విద్య మంచిగా ఉంటే మేధో పరమైన ఉత్సుకత, శాస్త్రీయ దృక్పథం, సృజనాత్మకత కలిగిన మానవ వనరులు దేశ అభివృద్ధికి అంకితమవుతారు. ఇందు కోసం ప్రస్తుతమున్న ఉన్నత విద్యారంగాన్ని సమూలంగా సంస్కరించాలని, 800 విశ్వవిద్యాలయాలు, 40 వేల కాలేజీలను 2040 నాటికి విభిన్న తరహాల్లో వృత్తి విద్యను అందించేలా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. కనీసం జిల్లాకు ఒకటైనా ప్రముఖ వర్సిటీ ఉండేలా మార్పులు చేస్తారు. అలాగే మాతృ భాష లేదా లోకల్ లాంగ్వేజ్ లో ఉన్నత విద్య అందించే విషయంపైనా కొత్త పాలసీ దృష్టి పెట్టింది. కులం, మతం, ప్రాంతం, సామాజిక, ఆర్థిక స్థితి గతులతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఉన్నత విద్య వరకూ చదువుకునేలా మార్పులు రావాలని, దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు ఉండాలన్నది ఈ విధానం లక్ష్యం. ఇందు కోసం సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందేలా కొత్త పాలసీ దృష్టి పెట్టింది.
కిలోల కొద్దీ పుస్తకాలకు చెక్
ఫస్ట్ క్లాస్ చదివే పిల్లాడు స్కూల్ కు వెళ్తున్నప్పుడు ఎవరైనా చూస్తే అయ్యో పాపం అనిపించక మానదు. కేజీల కొద్దీ బరువైన పుస్తకాల బ్యాగ్ ను మోసీ మోసి ఆ పిల్లల నడుములు వంగిపోతాయేమోననిపిస్తుంది. ఈ పరిస్థితి మార్చడంపై కొత్త ఎడ్యుకేషన్ పాలసీ దృష్టి పెట్టింది. బండెడు పుస్తకాలను ముందేసుకుని కుస్తీ పట్టే కన్నా డిస్కషన్, అనాలిసిస్, డిస్కవరీ మెథడ్ లో చదువు చెప్పడం ద్వారా కాన్సెప్ట్ ఈజీగా నేర్చుకోవడంతో పాటు దాని ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ కూడా అర్థమవుతుంది. ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంచుకునేందుకు వీలయ్యేలా కరికులం యాక్టివిటీ ఉండబోతోంది. కొత్త విద్యా విధానం ప్రకారం ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ లెవెల్ నుంచే అకడమిక్ స్ట్రక్చర్ లో మార్పులు రానున్నాయి. అలాగే పిల్లలకు ఎగ్జామ్స్ భయం కూడా పోగొట్టేలా కొత్త విధానం ఉంటుంది. 3, 5, 8 తరగతుల్లో ప్రతి లెవెల్ దాటేటప్పుడు పరీక్షలు నిర్వహిస్తారు. అయితే ఇవేవీ బోర్డ్ ఎగ్జామ్స్ కావు. అలాగే ప్రస్తుతం ఉన్న టెన్త్ బోర్డ్ ఎగ్జామ్ ను కూడా రద్దు చేసి, కేవలం 12వ తరగతిలోనే బోర్డ్ ఎగ్జామ్ ఉంటుంది.
టీచర్లకూ మెరిట్ బేసిస్లో ప్రమోషన్లు
రాబోయే తరాల భవిష్యత్ నిర్దేశించడంలో టీచర్ల పాత్ర కీలకం. ఈ టీచర్ల ఎంపికలో లోపాలు ఉంటే మొత్తం వ్యవస్థపై దెబ్బపడుతుంది. అందుకే టీచర్ల రిక్రూట్ మెంట్ మొదలు వారి కెరీర్లో పైకి వెళ్లే విషయంలోనూ మెరిట్ బేస్డ్ గానే శాలరీల పెంపు, ప్రమోషన్లు వంటివి ఉండాలని కొత్త విధానంలో పెట్టారు. ఏటా వాళ్ల ప్రొఫెషనల్ డెవలప్ మెంట్ కోసం కనీసం 50 గంటల వర్క్ షాప్ లాంటి వాటి ద్వారా ట్రైనింగ్ ఇస్తారు. టీచింగ్ కెరీర్ లో పెర్ఫార్మెన్స్ ఆధారంగా ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వాలని కేంద్రం డిసైడ్ అయింది. ఇక టీచర్ల కొరత ఎక్కువగా ఉండే ఆర్ట్, డాన్స్, సంగీతం, క్రాఫ్ట్ వంటి విభాగాల్లో ఆ సమస్యను తీర్చడం కోసం స్కూల్ కాంప్లెక్సెస్ విధానానికి శ్రీకారం చుడుతోంది. దీని ద్వారా ఒక ఏరియాలో ఉండే 10–15 స్కూళ్లకు కలిపి ఈ టీచర్లు బోధించేలా వీలు కల్పిస్తారు.
డాక్టర్
ఎస్. ప్రతాప్ రెడ్డి,
ఫౌండర్ చైర్మన్, ధ్రువ కాలేజ్ ఆఫ్ మేనేజ్ మెంట్