మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు క్వాలిటీ ఫుడ్ పెట్టాలని కలెక్టర్ ఎస్.వెంకట్ రావు ఆఫీసర్లను ఆదేశించారు. స్వచ్ఛ గురుకుల వారోత్సవాల్లో భాగంగా బుధవారం జిల్లా కేంద్రం సమీపంలోని రామిరెడ్డిగూడ సోషల్ వెల్ఫేర్ స్కూల్, కాలేజీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంటగది, డైనింగ్ హాల్, క్లాస్ రూమ్స్‌ను పరిశీలించడంతో పాటు స్టూడెంట్స్, టీచర్లతో విడివిడిగా మాట్లాడారు. విద్య, భోజనం గురించి స్టూడెంట్లను ఆరా తీసి.. అనంతరం వారితోనే కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఆవరణలో ఉన్న పిచ్చిమొక్కలను తొలగించాలని, పండ్లు, పూల మొక్కలను నాటాలని సూచించారు. వంటగదితో పాటు టాయిలెట్, మరుగుదొడ్లు క్లీన్‌గా ఉంచుకోవాలన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తేవాలని కలెక్టర్ కోరగా.. పక్కనే వాటర్ ప్లాంట్ నుంచి వస్తున్న వృథా నీటితో ఇబ్బందిగా ఉందని స్డూడెంట్లు చెప్పారు. వెంటనే సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కలెక్టర్ వెంట డీఆర్డీవో యాదయ్య, ఆర్‌సీవో ఫ్లోరెన్సి రాణి, ప్రిన్సిపాల్ శ్రీవాణి, రూరల్ తహసీల్దార్ పాండునాయక్ ఉన్నారు.
పంచాయత్ అవార్డులకు అప్లై చేసుకోండి
వనపర్తి, వెలుగు: జిల్లాలోని గ్రామపంచాయతీలు నేషనల్ పంచాయత్ అవార్డులకు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా సూచించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మెరుగైన జీవనోపాధి, ఆరోగ్యకరమైన, బాలల స్నేహపూర్వక, నీటి సమృద్ధి, పచ్చదనం- పరిశుభ్రత, స్వయం సమృద్ధి -మౌలిక సదుపాయాలు, సామాజిక భద్రత, మంచి పరిపాలన, మహిళా స్నేహపూర్వక పంచాయతీలుగా 9 కేటగిరీలలో పోటీలు ఉంటాయని చెప్పారు. జిల్లాలోని 255 గ్రామ పంచాయతీలు, 14 మండలాలు పోటీ పడాలని కోరారు. ముందుగా గ్రామ, మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో పోటీలు ఉంటాయని, ఈ నెల 10 నుంచి ఆన్ లైన్ ద్వారా పోటీలో పాల్గొనాలని సూచించారు. అడిషనల్ కలెక్టర్లు ఆశిష్ సంగ్వాన్, వేణుగోపాల్, జడ్పీ సీఈవో వెంకట్ రెడ్డి, డీఆర్‌డీవో నరసింహులు పాల్గొన్నారు.
ఇథనాల్ కంపెనీ పనులు ఆపాలి
మరికల్, వెలుగు: మరికల్ మండలం చిత్తనూర్ వద్ద కొనసాగుతున్న ఇథనాల్ కంపెనీ పనులను వెంటనే ఆపాలని కుల అసమానతా నిర్మూలన పోరాట సమితి ఆల్ఇండియా కన్వీనర్లక్ష్మయ్య డిమాండ్‌చేశారు. బుధవారం మండల కేంద్రంలోని అంబేడ్కర్విగ్రహం ముందు గ్రామస్తులతో కలిసి ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంపెనీకి ఎలాంటి అనుమతులు లేకుండానే పనులు చేపట్టారని ఆరోపించారు. చుట్టు పక్కల 21 గ్రామాలు పొల్యూట్ అవుతాయని తెలిసినా ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల పాత్ర ఉండడంతోనే ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. వెంటనే పనులు ఆపకపోతే గ్రామ ప్రజలతో కలిసి ఉద్యమం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కేఎఎన్‌పీఎస్ నాయకులు రాజు, సరోజ, గోవిందు, గ్రామస్తులు మురళి, రవీందర్‌రెడ్డి, లక్ష్మణ్, కృష్ణయ్య, నరేశ్, బన్ని యాదవ్ పాల్గొన్నారు.
హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పిస్తం
కల్వకుర్తి, వెలుగు: గురుకుల హాస్టళ్లలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని, అవసరమైన ప్రణాళికలు రెడీ చేసి ఇవ్వాలని కలెక్టర్ ఉదయ్ కుమార్ విద్యా శాఖ ఏఈ కోటేశ్వర్ రావును ఆదేశించారు. బుధవారం వెల్దండలోని సోషల్ వెల్ఫేర్ స్కూల్, కాలేజీని సందర్శించారు. క్లాస్ రూమ్స్‌తో పాటు కిచెన్ షెడ్, స్టోర్ రూమ్‌లను పరిశీలించారు. డార్మెంట్రీ లేకపోవడంతో తరగతి గదిలోనే రాత్రి పూట నిద్రిస్తున్నామని విద్యార్థులు కలెక్టర్‌కు వివరించారు. రెండు గదులకు కిటికీలు, దర్వాజ లేకపోవడాన్ని గమనించిన ఆయన వెంటనే వాటిని బిగించాలని ఆదేశించారు. కిచెన్ షెడ్ లేకపోవడం, డైనింగ్ హాల్ కోసం వెంటనే రిపోర్ట్ ఇవ్వాలని సూచించారు. కాలేజీ భవనంలో ల్యాబ్ లేకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని చెప్పారు. అనంతరం పక్కనే ఉన్న ప్రభుత్వ కాలేజీతో పాటు జేపీ నగర్, వంగూర్ సోషల్ వెల్ఫేర్ స్కూళ్లు, కల్వకుర్తిలోని ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్‌ను పరిశీలించారు. కలెక్టర్ వెంట కల్వకుర్తి ఆర్‌సీవో వనజ, కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం, ఆర్డీవో రాజేశ్ కుమార్, తహసీల్దార్లు రాంరెడ్డి, చంద్రశేఖర్, వెల్దండ ఎంపీడీవో మోహన్ లాల్, డీఎల్పీవో పండరీనాథ్, ప్రిన్స్‌పాల్స్ ఉన్నారు.
పౌష్టికాహారం అందించాలి
గద్వాల, వెలుగు: అంగన్ వాడీల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులు, కిశోర బాలికలకు పౌష్టికాహారం అందించాలని కలెక్టర్ వల్లూరి క్రాంతి ఆదేశించారు. గురువారం మల్దకల్ మండలంలోని అమరవాయి, పాల్వాయి అంగన్ వాడీ కేంద్రాల్లో నిర్వహించిన పోషక అభియాన్ ప్రోగ్రామ్‌లో పాల్గొని పౌష్టికాహారంపై ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతి ఇంటికి తిరిగి పౌష్టికార లోపం ఉన్న పిల్లలను గుర్తించాలని సూచించారు. వారి పేరెంట్స్‌కు అవగాహణ కల్పించి.. ఆరోగ్యంగా మార్చేందుకు చర్యలు తీసుకోవాలి కోరారు. అనంతరం గ్రామంలోని హైస్కూల్, సీపీఎస్ స్కూల్‌ను తనిఖీ చేశారు. కిచెన్ షెడ్‌ను పరిశీలించి పిల్లలకు క్వాలిటీ ఫుడ్ పెట్టాలని సూచించారు. అనంతరం గద్వాల టౌన్‌లోలోని దౌదర్పల్లి లో ఉన్న ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్‌ను సందర్శించారు. డైనింగ్ హాల్ లేకపోవడం గమనించిన ఆమె.. వెంటనే ప్రణాళిక రెడీ చేయాలని ఆఫీసర్లను ఆదేశించారు. ఆమె వెంట పీఆర్ ఈఈ సమత, సీడీపీవో కమలాదేవి ఉన్నారు.
పింఛన్ల పంపిణీలో ఆధిపత్య పోరు
- టీఆర్‌ఎస్ నేతలు ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్‌కు వెళ్లిన ఎమ్మెల్యే
- నిలదీసిన సర్పంచ్.. అరెస్ట్ చేసిన పోలీసులు
కొత్తకోట, వెలుగు: పింఛన్ పంపిణీ ఆధిపత్య పోరుకు తెరతీసింది. కొత్తకోట మండలం నిర్విన్ గ్రామంలో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి బుధవారం ఆసరా పింఛన్లు పంపిణీ చేసే ప్రోగ్రామ్ ఖరారైంది. దీంతో కాంగ్రెస్ చెందిన గ్రామ సర్పంచ్ విశ్వనాథం గ్రామపంచాయతీ దగ్గర టెంటు వేయగా... టీఆర్ఎస్ నేతలు దగ్గరలో మరో టెంటు వేశారు. ఎమ్మెల్యే నేరుగా టీఆర్‌ఎస్ నేతలు వేసిన టెంటు దగ్గరికి వెళ్లి.. గ్రామ సర్పంచ్‌ను ఆహ్వానించాలని అక్కడ ఉన్న అధికారులను ఆదేశించారు. దీంతో అక్కడికి వెళ్లిన సర్పంచ్ విశ్వనాథం పింఛన్ల పంపిణీ గ్రామపంచాయతీ ఆవరణలోని జరగాలి గాని, టీఆర్ఎస్ నేతలు వేసిన టెంట్‌లో ఎలా ఇస్తారని ఎమ్మెల్యేను ప్రశ్నించారు. ఎక్కడైనా సర్పంచ్ అధ్యక్షతనే ప్రోగ్రామ్ ఉంటుందని ఎమ్మెల్యే సమాధానం ఇచ్చారు. ఇంతలోనే సర్పంచ్ చేతిలో ఉన్న మైకును టీఆర్‌ఎస్ నేతలు గుంజుకోవడంతో కాంగ్రెస్ నేతలు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది.. ఈ గొడవను వీడియో తీస్తున్న ఓ విలేకరిని కూడా తోసివేసి.. ఫోన్ గుంజుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు సర్పంచ్ విశ్వనాథంను అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. అనంతరం పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీలకతీతంగా గ్రామాలు అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఎమ్మెల్యే వెళ్తుండగా తన భర్తను విడుదల చేయాలని సర్పంచ్ భార్య ఎమ్మెల్యే కారు ముందు బైఠాయించింది. నచ్చజెప్పినా ఆమె వినకపోవడంతో పోలీసులు పక్కకు తీసుకెళ్లారు.
సమస్యలెవరికి చెప్పాలె?
పెబ్బేరు, వెలుగు : సమావేశానికి అధికారులు రాకుంటే సమస్యలు ఎవరికి చెప్పుకోవాలని సర్పంచులు, ఎంపీటీసీలు ప్రశ్నించారు. బుధవారం పెబ్బేరు ఎంపీడీవో ఆఫీస్‌లో ఎంపీపీ శైలజ అధ్యక్షతన జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించగా.. జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. వివిధ శాఖల అధికారులు కింది స్థాయి సిబ్బందిని పంపించడంపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతీ మీటింగ్‌కు ఇలానే చేస్తున్నారని మొక్కుబడిగా నివేదికలను చదివి వెళ్లిపోతున్నారని మండిపడ్డారు. అనంతరం జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ అధికారులు తీరు మార్చుకోకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వం మహిళా సంఘాల కోసం చిన్న పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తుంటే అవగాహన కల్పించాల్సిన ఆఫీసర్లు ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. ఆసరా పింఛన్ల అప్లికేషన్లు సరిగ్గా పరిశీలించకపోవడంతో అనర్హులకు పింఛన్లు మంజూరయ్యారని మండిపడ్డారు.
ముదిరాజ్ గ్రామ కమిటీ ఎన్నిక
గండీడ్, వెలుగు: మహమ్మదాబాద్ మండల గాదిర్యాల్‌లో బుధవారం ముదిరాజ్ గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. సంఘం సీనియర్ నేతల ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎన్నికలో కమిటీ అధ్యక్షుడిగా గుడ్డెమెల్ల హనుమంతు, ఉపాధ్యక్షుడిగా వెంకటయ్య, ప్రధానకార్యదర్శిగా దేవనోల్ల కృష్ణయ్య ఏకగ్రీవం అయ్యారు. మండల కమిటీ అధ్యక్షుడు జెట్టి నర్సింలు , ప్రధాన కార్యదర్శి నీరటి లక్ష్మణ్, ఉపాధ్యక్షులు కొత్త గోపాల్, కొమిరె దస్తయ్య, ఊరేటి అశోక్, గ్రామ పెద్దలు పుట్టి శంకరయ్య , కేటి వెంకటయ్య, గాజుల అంజిలయ్య, మల్కయ్య , అంజి, కేశవులు, శ్రీను, బుగ్గయ్య పాల్గొన్నారు.
ఫుడ్‌ను నిర్లక్ష్యం చేస్తే చర్యలు
నారాయణపేట, వెలుగు: హాస్టల్ విద్యార్థుల ఫుడ్ విషయంలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని అడిషనల్ కలెక్టర్ కె.చంద్రారెడ్డి హెచ్చరించారు. బుధవారం కలెక్టరేట్ మీటింగ్ హాల్‌లో కేజేబీవీ, బీసీ, ఎస్టీ హాస్టల్ వార్డెన్స్, ప్రిన్సిపాల్స్‌తో పాటు జిల్లా ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు. కూరగాయలు నాణ్యతగా ఉండేటట్లు చూడాలని, నాణ్యత లేకపోతే ఏజన్సీపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హాస్టళ్లకు మిషన్ భగీరథ నీటిని అందించాలని, తాగేందుకు గోరువెచ్చని నీళ్లను ఇవ్వాలని సూచించారు. మరుగుదొడ్లు, టాయిలెట్లను ఎప్పటికప్పుడు కడిగించాలన్నారు.
భార్యపై అనుమానంతో భర్త ఆత్మహత్య
అమ్రాబాద్, వెలుగు: భార్యపై అనుమానంతో భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్తులు, పోలీసులు వివరాల ప్రకారం.. పదర మండలం చెన్నంపల్లికి చెందిన నేనావత్ శంకర్(30) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కొన్నాళ్ల కింద తన భార్య మరో వ్యక్తితో చనువుగా మాట్లాడడం చూసిన ఆయన అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయమై పంచాయతీ పెట్టినా మారకపోవడంతో మనస్తాపంతో బుధవారం తన పొలంలో పురుగుల మందు తాగాడు. గమనించిన పక్క పొలం వాళ్లు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వాళ్లు వెంటనే పదర ఆసుపత్రికి, అక్కడి నుంచి అచ్చంపేటకు తీసుకెళ్లారు. అప్పటికే మృతి చెందాడని డాక్టర్లు చెప్పారు. మృతుడికి భార్యతో పాటు ఏడేళ్ల కొడుకు ఉన్నాడు.
అదనపు కట్నం వేధింపుల కేసులో ఒకరికి జైలు
మహబూబ్ నగర్ టౌన్, వెలుగు: వరకట్నం వేధింపుల కేసులో ఒకరికి ఏడాది జైలు శిక్ష పడింది. వివరాల్లో వెళ్తే.. బాదేపల్లి గ్రామానికి చెందిన నాగలక్ష్మి తన భర్త నరేశ్ కుమార్ అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని ఏడాది కింద మహబూబ్‌నగర్‌లోని మహిళా పీఎస్‌ను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని కోర్డులో హాజరు పరిచారు. మహిళా పీఎస్ ఇన్‌స్పెక్టర్ బి.హన్మప్ప ఈ కేసును విచారణ చేయగా.. పీపీ జయరాం నాయక్ కేసును వాదించారు. కోర్టు ఇచ్చిన వాయిదాల్లో సాక్ష్యాధారాలను జడ్జికి సమర్పించారు. పరిశీలించిన జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ శ్రీదేవి బుధవారం నిందితుడికి ఏడాది జైలు, రూ.10 వేలు ఫైన్ వేస్తూ తీర్పు ఇచ్చారు.
ప్రాణం తీసిన ఇయర్ ఫోన్స్
జడ్చర్ల టౌన్, వెలుగు: ఇయర్ ఫోన్స్ ఓ యువకుడి ప్రాణం తీశాయి. స్థానికుల వివరాల ప్రకారం.. జడ్చర్ల పట్టణంలోని బక్కరావు కాంపౌండ్‌కు చెందిన వడ్డె వినయ్‌కుమార్(19) రోజూ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న జిమ్‌కు వెళ్తుంటాడు. బుధవారం ఉదయం కూడా జిమ్‌కు వెళ్లిన ఆయన తిరిగి వచ్చేటప్పుడు చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నాడు. హైదరాబాద్ నుంచి మహబూబ్‌నగర్ వైపు వస్తున్న గూడ్స్ రైలును గమనించని ఆయన అలాగే పట్టాలు దాటాడు. క్షణాల్లో రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రైలు వస్తుందని తాము అరిచినా చెవిలో ఇయర్ ఫోన్స్ఉండడంతో వినపడలేదని స్టేషన్‌మాస్టర్, స్థానికులు వాపోయారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని రైల్వే హెడ్ కానిస్టేబుల్ టీకృష్ణ తెలిపారు.
చిన్నారిపై ఊరపంది దాడి
అయిజ, వెలుగు: అయిజ పట్టణంలోని16వ వార్డుకు చెందిన చిన్నారిపై ఊరపంది దాడి చేసింది. కాలనీ వాసుల వివరాల ప్రకారం..
దళితవాడకు చెందిన సరిత , ఇమ్మానియేలు కూతురు నిత్య(2) బుధవారం ఇంటి ముందు ఆడుకుంటుంది. అటుగా వచ్చిన పంది నిత్య చేతిలో ఉన్న బిస్కెట్ ప్యాకెట్‌ను లాక్కునే ప్రయత్నం చేసింది. చిన్నారి ప్రతి ఘటించడంతో దాడి చేసి మెడ, తల భాగంలో గాయపరిచింది. అంతటితో ఆగక నిత్యను నోట కరచుకొని ముళ్ల పొదల్లోకి లాక్కెళ్లింది. గమనించిన కుటుంబ సభ్యులు పందిని కర్రతో కొట్టడంతో చిన్నారిని వదిలిపెట్టంది. వెంటనే నిత్యను ఆసుపత్రికి తరలించి ట్రీట్ మెంట్ చేయించారు.
పంచాయతీ సెక్రటరీ సస్పెన్షన్
మరికల్, వెలుగు : మరికల్ మండలం పస్పుల గ్రామ పంచాయతీ కార్యదర్శి సాయి ప్రకాశ్‌ను కలెక్టర్ హరిచందన సస్పెండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పింఛన్‌కార్డుల పంపిణీలో లబ్ధిదారులను వరుసలో నిలబెట్టకుండా నిర్లక్ష్యం వహించినందుకు సస్పెండ్ చేసినట్లు ఎంపీడీవో యశోదమ్మ తెలిపారు.