మద్నూర్, వెలుగు: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఆదేశించారు. మద్నూర్ మండలం ఎక్లార గ్రామంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను మంగళవారం ఎమ్మెల్యే లక్ష్మీ కాంతారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు.
మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్న భోజన వివరాలు, మెనూ గురించి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. పాఠశాలలో సమస్యలు, మౌలిక సదుపాయాల గురించి ప్రిన్సిపాల్, సిబ్బందితో చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి టీచర్స్కృషి చేయాలన్నారు. గతంలో ఇదే పాఠశాలలో ఇద్దరు విద్యార్థినిలు ఆత్మహత్య చేసుకున్న ఘటనపై ఆరా తీశారు.
ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మానసిక వైకల్యం, డిప్రెషన్ లో ఉన్న విద్యార్థులను గుర్తించి వారికి అనుభవమున్న సైకియాట్రిస్ట్ తో కౌన్సెలింగ్ ఇప్పించాలని ఆదేశించారు. ఆయన వెంట అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు ఉన్నారు.