- దుమ్ముగూడెంలోని పాతపైపుల వినియోగం
- సిమెంట్ పూత, దిమ్మెలు లేకుండానే నిర్మాణం
- 12 కిలోమీటర్లకు గాను 4 కిలోమీటర్లే పనులు
- రూ.40 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం
- మళ్లీ లీకేజీలు,పగుళ్లు తప్పవంటున్న రైతులు
మంచిర్యాల, వెలుగు ; మంచిర్యాల జిల్లాలోని గూడెం లిఫ్ట్ఇరిగేషన్ పైపులైన్పనుల్లో నాణ్యత లోపించింది. 12 కిలోమీటర్ల మేర కొత్త ఎంఎస్ (మైల్డ్ స్టీల్) పైపులు వేయాల్సి ఉండగా, దుమ్ముగూడెం ప్రాజెక్టులో వాడిన పాత పైపులను వినియోగిస్తున్నారు. అది కూడా నాలుగు కిలోమీటర్లు మాత్రమే వేస్తున్నారు. ఇదివరకే వాడిన పైపులను భూమిలోంచి తవ్వితీయడం వల్ల వాటి పైన ఉండే సిమెంట్లైనింగ్ మొత్తం ఊడిపోయింది. మళ్లీ వాటికి సిమెంట్ పూత వేయడం లేదు. పైపుల అడుగుభాగంలో కాంక్రీట్ మిక్చర్వేయడం లేదు. జాయింట్ల దగ్గర దిమ్మెలు నిర్మించడం లేదు. దీంతో ఈ పైపులు కూడా కొద్దిరోజుల్లోనే పాడయ్యే అవకాశాలు ఉన్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పైపులైన్చెడిపోతే రూ.40 కోట్ల నిధులు మట్టిపాలవుతాయని వాపోతున్నారు.
ఎంఎస్ పైపులకు బదులు జీఆర్పీ పైపులు....
కడెం ప్రాజెక్టు చివరి ఆయకట్టును స్థిరీకరించడం కోసం దండేపల్లి మండలం గూడెం వద్ద రూ.125 కోట్లతో గూడెం లిఫ్ట్ఇరిగేషన్ స్కీంను నిర్మించారు. ఉమ్మడి రాష్ర్టంలో 2009లో పనులు ప్రారంభించి 2015లో పూర్తి చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌నుంచి 3 టీఎంసీల నీటిని తోడి దండేపల్లి, లక్సెట్టిపేట, హాజీపూర్ మండలాల్లోని 30 వేల ఎకరాలకు సాగునీరు అందించాలన్నది లక్ష్యం. పంప్‌హౌస్‌నుంచి తానిమడుగు వరకు 12 కిలోమీటర్లు పైపులైన్వేసి నీళ్లను కడెం ప్రాజెక్టు మెయిన్కెనాల్లోకి లిఫ్ట్ అక్కడినుంచి డిస్ర్టిబ్యూటరీ కెనాల్స్ ద్వారా పొలాలకు అందించేలా నిర్మించారు. అయితే లిఫ్ట్ఇరిగేషన్లో కీలకమైన పైపులైన్నిర్మాణంలో కాంట్రాక్టు సంస్థ రూల్స్పాటించలేదు. డీపీఆర్‌లో పేర్కొన్న మైల్డ్‌స్టీల్ (ఎంఎస్) పైపులకు బదులు గ్లాస్రెయిన్ఫోర్స్డ్(జీఆర్పీ) పైపులు వేశారు. జీఆర్పీ పైపులు 50 సంవత్సాల లైఫ్ ఇస్తాయని, ఎంఎస్పైపుల కన్నా తక్కువ ఖర్చవుతుందని చెప్పడంతో అధికారులు సైతం దానికి వంత పాడారు. దీంతో ఆనాడే రూ.30 కోట్లకు పైగా గోల్మాల్జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి.
పుట్ట పుట్ట పగులుతున్న పైపులు.....
జీఆర్పీ పైపులైన్పనులు నాసిరకంగా చేయడం వల్ల లిఫ్ట్‌ను ప్రారంభించిన ఏడాది నుంచే పగులుతున్నాయి. జాయింట్ల దగ్గర దిమ్మెలు కట్టకపోవడం, అడుగుభాగంలో సిమెంట్ లైనింగ్వేయకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తింది. రెండు మోటార్లు ఆన్‌చేస్తే పైపులు ప్రెజర్ తట్టుకోలేక పగిలిపోతున్నాయి. గత ఎనిమిదేండ్లలో దాదాపు 85 సార్లు పైపులు, కేవలం ఈ యాసంగి సీజన్లోనే 20 సార్లు పగిలాయి. ఎప్పటికప్పుడు పైపులను టెంపరరీగా రిపేర్ చేసి నడిపించడం వల్ల రైతులకు సాగునీరు అందక పంటలు ఎండుపోతున్నాయి. ఇప్పటివరకు ఏ ఒక్క సీజన్లోనూ 30 వేల ఎకరాలకు పూర్తిస్థాయిలో నీరందిన దాఖలాలు లేవు. పైపులైన్ నిర్మాణంలోనే అసలు లోపం ఉండడంతో ఇంజనీరింగ్అధికారులు సైతం చేతులెత్తేశారు. కొత్త ఎంఎస్పైపులైన్ వేస్తే తప్ప సాగునీరు అందించడం సాధ్యం కాదని తేల్చిచెప్పారు.
కంటితుడుపు చర్యలే....
వాస్తవానికి గూడెం పంప్‌హౌస్ దగ్గరి నుంచి కడెం ప్రాజెక్టు మెయిన్ కెనాల్వరకు 12 కిలోమీటర్లు కొత్త ఎంఎస్పైపులైన్వేస్తేనే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. దీనికి రూ.120 కోట్లకు పైగా ఖర్చవుతుందని ఇంజనీరింగ్అధికారులు అంచనా వేశారు. ప్రభుత్వం అంత బడ్జెట్కేటాయించే అవకాశం లేకపోవడంతో కంటితుడుపు చర్యగా నాలుగు కిలోమీటర్లు పాత ఎంఎస్ పైపులు వేస్తున్నారు. దుమ్ముగూడెం ప్రాజెక్టులోని ఇందిరాసాగర్ పైపులైన్పనులు మధ్యలో ఆగిపోవడంతో నిరుపయోగంగా మారిన పైపులను భూమిలోంచి తీసి ఇక్కడ వాడుతున్నారు. భూగర్భంలోంచి పైపులను తవ్వి తీయడం వల్ల వాటిపైన ఉండే సిమెంట్‌పూత (గనెటింగ్) పూర్తిగా ఊడిపోయింది. ఈ పైపులకు మళ్లీ సిమెంట్‌పూత పెట్టకుండానే వినియోగిస్తున్నారు. ఐరన్పైపులు పైపులు కొద్దిరోజులకే తుప్పు పట్టి లీకేజీలు ఏర్పడడంతో పాటు జాయింట్ల దగ్గర పగిలిపోయి మళ్లీ పాత కథే పునరావృతం అవుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కడెం ఎత్తు పెంచడమే పరిష్కారం....
కడెం ప్రాజెక్టు చివరి ఆయకట్టును స్థిరీకరించడానికి నిర్మించిన గూడెం లిఫ్ట్‌తో రైతులకు ఎలాంటి ప్రయోజనం లేదు. ప్రజాప్రతినిధులు అనాలోచిత నిర్ణయాలతో నిర్మించి రూ.125 కోట్లు దుర్వినియోగం చేశారు. మళ్లీ ఎంఎస్ పైపుల నిర్మాణానికి రూ.120 కోట్లకు పైగా వెచ్చిస్తున్నారు. కాంట్రాక్టర్, అధికారులు, ప్రజాప్రతినిధులు నిధులు మేసేందుకే ఈ పనులు చేస్తున్నారు. దీనికి బదులుగా కడెం ప్రాజెక్టు ఎత్తు పెంచడం, కుఫ్టి రిజర్వాయర్నిర్మాణంతో మంచిర్యాల జిల్లాలోని చెన్నూర్, బెల్లంపల్లి నియోజకవర్గాలకు కూడా కెనాల్స్ద్వారా సాగునీరు అందించవచ్చు. ప్రభుత్వం స్పందించి ఈ దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
– నైనాల గోవర్దన్,
తెలంగాణ జలసాధన సమితి కన్వీనర్