సమ్మర్ అని ఐస్‌‌‌‌క్రీమ్స్‌‌‌‌ తెగ తింటున్నరా.. ఇది చదవండి.. ముఖ్యంగా వరంగల్ పబ్లిక్ !

సమ్మర్ అని ఐస్‌‌‌‌క్రీమ్స్‌‌‌‌ తెగ తింటున్నరా.. ఇది చదవండి.. ముఖ్యంగా వరంగల్ పబ్లిక్ !
  • ఎక్స్‌‌‌‌పైరీ డేట్‌‌‌‌ వేయరు.. క్వాలిటీ పాటించరు
  • వరంగల్‌‌‌‌ నగరంలో విచ్చలవిడిగా ఐస్‌‌‌‌క్రీమ్స్‌‌‌‌ తయారీ
  • కాలం చెల్లిన వస్తువులు, రంగులను వాడుతున్న నిర్వాహకులు
  • అనారోగ్యం బారిన పడుతున్న ప్రజలు

హనుమకొండ, వెలుగు: సమ్మర్‌‌‌‌ సీజన్‌‌‌‌ కావడంతో ఐస్‌‌‌‌క్రీమ్స్‌‌‌‌కు గిరాకీ పెరిగింది. దీన్ని ఆసరాగా చేసుకుంటున్న కొందరు వ్యక్తులు ఇష్టారాజ్యంగా ఐస్‌‌‌‌క్రీమ్‌‌‌‌ కంపెనీలు, పార్లర్లు ఏర్పాటు చేస్తున్నారు. అయితే కాలం చెల్లిన వస్తువులను వాడడంతో పాటు మోతాదుకు మించి రంగులు కలుపుతూ ఐస్‌‌‌‌క్రీమ్స్‌‌‌‌ తయారు చేస్తున్నారు. ఎక్స్‌‌‌‌పైరీ డేట్‌‌‌‌ లేకుండానే అమ్మకాలు జరుపుతూ పిల్లలు, పెద్దల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. తాజాగా వరంగల్‌‌‌‌ టాస్క్‌‌‌‌ఫోర్స్‌‌‌‌, ఫుడ్‌‌‌‌ సేఫ్టీ ఆఫీసర్లు చేసిన ఆకస్మిక తనిఖీల్లో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి.

కాలం చెల్లిన పౌడర్స్, ఫ్లేవర్స్‌‌‌‌
ఫుడ్‌‌‌‌ సేఫ్టీ యాక్ట్‌‌‌‌ 2006, 2011 ప్రకారం ఐస్‌‌‌‌క్రీమ్‌‌‌‌ తయారీ కంపెనీలు పరిశుభ్రతను తప్పనిసరిగా మెయింటేన్‌‌‌‌ చేయాలి. ఐస్‌‌‌‌క్రీమ్స్‌‌‌‌ తయారీకి నాణ్యమైన పాలు, ఇతర పదార్థాలను వాడడంతో పాటు ప్యాకెట్లు, డబ్బాలపై తయారీ, ఎక్స్‌‌‌‌పైరీ డేట్లు ప్రింట్‌‌‌‌ చేయాలి. కానీ వరంగల్‌‌‌‌ ట్రైసిటీస్‌‌‌‌లో ఐస్‌‌‌‌క్రీమ్స్‌‌‌‌ తయారు చేస్తున్న వ్యక్తులు ఇవేమీ పాటించడం లేదు. వరంగల్‌‌‌‌ ట్రైసిటీస్‌‌‌‌ పరిధిలో మొత్తం 150కి పైగా ఐస్‌‌‌‌క్రీమ్‌‌‌‌ తయారీ కంపెనీలు, పార్లర్లు ఉండగా.. ఇందులో చాలా వరకు కనీస నిబంధనలు పాటించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. కాలం చెల్లిన పాలు, పౌడర్స్‌‌‌‌, కలర్స్‌‌‌‌ వాడుతున్నారు. 

ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం
ఐస్‌‌‌‌క్రీమ్స్‌‌‌‌ ఎక్కువ కాలం నిల్వ ఉండడం, రుచి మారకుండా ఉండేందుకు మెగ్నీషియం హైడ్రాక్సైడ్, పొటాషియం సోర్బేట్, పాలీ సోర్బేట్‌‌‌‌ వంటి కెమికల్స్‌‌‌‌ వాడుతున్నట్లు తెలిసింది. వివిధ ఫ్లేవర్లకు సంబంధించిన రంగులు కూడా మోతాదుకు మించి వాడుతున్నట్లు సమాచారం. ఇలాంటివి తినడం వల్ల రోగ నిరోధక శక్తి దెబ్బతినడంతో పాటు అలర్జీ, వాంతులు అవుతుంటాయని డాక్టర్లు చెబుతున్నారు. 

ఇటీవల వెలుగు చూసిన ఘటనలు
కాలం చెల్లిన వస్తువులతో ఐస్‌‌‌‌క్రీమ్స్‌‌‌‌ తయారు చేస్తున్నట్లు టాస్క్‌‌‌‌ఫోర్స్‌‌‌‌, ఫుడ్‌‌‌‌ సేఫ్టీ ఆఫీసర్ల దృష్టికి వెళ్లడంతో వారం రోజుల నుంచి తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే నాసిరకమైన వస్తువులతో ఐస్‌‌‌‌క్రీమ్స్‌‌‌‌ తయారు చేయడంతో పాటు ఎక్స్‌‌‌‌పైరీ డేట్‌‌‌‌ లేకుండా అమ్ముతున్నట్లు గుర్తించారు. పాడైపోయిన వాటికి కూడా డేట్లు మార్చి అమ్మేస్తున్నట్లు నిర్ధారించారు. 
    
హనుమకొండ గాంధీనగర్‌‌‌‌ పోచమ్మగుడి సమీపంలో షామా ఐస్‌‌‌‌క్రీమ్‌‌‌‌ కంపెనీలో ఫుడ్‌‌‌‌ సేఫ్టీ రూల్స్‌‌‌‌ పాటించకుండా ఐస్‌‌‌‌క్రీమ్స్‌‌‌‌ తయారు చేయడంతో పాటు ఎక్స్‌‌‌‌పైరీ డేట్‌‌‌‌ లేకుండానే అమ్మేస్తున్నారు. పాడై పోయిన వాటిని కూడా అమ్మేందుకు నిల్వ చేయగా... విషయం తెలుసుకున్న ఆఫీసర్లు ఈ నెల 11న దాడి చేశారు. సుమారు రూ.25,740 విలువైన 14 రకాల ఐస్‌‌‌‌క్రీమ్స్‌‌‌‌ను స్వాధీనం చేసుకున్నారు.
    
కనకదుర్గ కాలనీలోని ఓంకార్‌‌‌‌ ఐస్‌‌‌‌క్రీమ్‌‌‌‌ డిస్ట్రిబ్యూటర్‌‌‌‌ పాడైపోయిన ఐస్‌‌‌‌క్రీమ్స్‌‌‌‌ను అమ్మేందుకు సిద్ధంగా ఉంచగా.. 12న టాస్క్‌‌‌‌ఫోర్స్‌‌‌‌ ఆఫీసర్లు దాడి చేసి, రూ.2,39,476 విలువైన ఐస్‌‌‌‌క్రీమ్స్‌‌‌‌ సీజ్‌‌‌‌ చేశారు.
    
వరంగల్‌‌‌‌లోని బాలాజీనగర్‌‌‌‌లో కూల్‌‌‌‌ టచ్‌‌‌‌ ఐస్‌‌‌‌క్రీమ్‌‌‌‌ తయారు కంపెనీ, డిస్ట్రిబ్యూషన్‌‌‌‌ సెంటర్‌‌‌‌లో ఎక్స్‌‌‌‌పైరీ డేట్‌‌‌‌ లేకుండా అమ్ముతున్న రూ.83,200 విలువైన ఐస్‌‌‌‌క్రీమ్స్‌‌‌‌ను పట్టుకున్నారు.
    
హనుమకొండ అదాలత్‌‌‌‌ సెంటర్‌‌‌‌లోని ఇగ్లూ ఐస్‌‌‌‌క్రీమ్‌‌‌‌ కంపెనీ లైసెన్స్‌‌‌‌ లేకుండా ఐస్‌‌‌‌క్రీమ్స్‌‌‌‌ తయారు చేయడంతో పాటు ఎక్స్‌‌‌‌పైరీ డేట్‌‌‌‌ లేకుండా అమ్ముతున్నట్లు ఆఫీసర్లకు తెలిసింది. ఈ నెల 15న దాడి చేసి రూ.1,13,525 విలువైన ఐస్‌‌‌‌క్రీమ్స్‌‌‌‌ను పట్టుకున్నారు.