- ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ఆశావహుల పోస్టర్లు
- ఒకరి పోస్టర్లను మరొకరు చింపేసుకుంటున్న వైనం
- పోలీస్ స్టేషన్ల వరకు వెళుతున్న పోస్టర్ల గొడవలు
నల్గొండ, వెలుగు: బీఆర్ఎస్ పార్టీలో వాల్ పోస్టర్ల గొడవలు రోజుకింత ముదురుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వాల్ రైటింగ్స్, వాల్‌పోస్టర్ల కోసం లీడర్లు పోటీ పడుతున్నారు. కొన్ని చోట్ల పోస్టర్ల పంచాయితీలు పోలీస్ స్టేషన్ల వరకు వెళుతున్నాయి. ఎమ్మెల్యేలు, ఆశవాహులకు నడుమ జరుగుతున్న పోస్టర్ల గొడవల్లో తలదూర్చడం పోలీసులకు సైతం తలనొప్పిగా మారింది. ఎమ్మెల్యేల పోస్టర్లను ఆశవాహులు చింపేయడం, ఆశావహులు అతికించిన పోస్టర్లను ఎమ్మెల్యేల వర్గీయులు తొలగించిన సంఘటనలు సోషల్ మీడియాలో వైరల్అవుతున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు రాత్రికి రాత్రే వాల్ రైటింగ్స్ చేస్తూ, పోస్టర్లు అతికిస్తుండటంతో వాళ్లను కనిపెట్టడం పోలీసులకు సవాల్‌గా మారింది. ఒకవేళ నిఘా పెట్టి పట్టుకునేందుకు ప్రయత్నించినా చివరకు బీఆర్ఎస్ లీడర్ల పనేనని తెలిసి పోలీసులు అవాక్కవుతున్నారు.
రచ్చకెక్కుతున్న పోస్టర్ల గొడవలు..
నల్గొండ, మునుగోడు, నాగార్జునసాగర్ నియోజకవర్గాల్లో పోస్టర్ల గొడవలు రచ్చకెక్కుతున్నాయి. నల్గొండలో ఎమ్మెల్యే భూపాల్ రెడ్డికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ లీడర్లు చాడ కిషన్ రెడ్డి, పిల్లి రామరాజు యాదవ్ వాల్‌రైటింగ్స్, పోస్టర్లు పోటాపోటీగా చేస్తున్నారు. నల్గొండలో పోస్టర్ల పంచాయితీ మొదలై చాలా రోజులవుతోంది. నల్గొండలో గళ్లీగళ్లీలో ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, రామరాజు, కిషన్ రెడ్డిలు పోటాపోటీగా వాల్ రైటింగ్స్, పోస్టర్లు అతికించడం గొడవలకు దారితీసింది. కిషన్ రెడ్డి పోస్టర్ల పైన గుర్తు తెలియని వ్యక్తులు అర్షమొలల పోస్టర్లు అతికించడం, రామరాజు పోస్టర్లును చింపేయడంతో వివాదం ముదిరింది. నల్గొండ అభివృద్ధి గురించి పబ్లిసిటీ చేసుకునేందుకు వీల్లేకుండా ఎక్కడపడితే అక్కడ పోస్టర్లు, వాల్ రైటింగ్స్ రాయించడంపై ఎమ్మెల్యే వర్గీయులు మండిపడుతున్నారు.
నాగార్జునసాగర్‌లో ఎమ్మెల్యే నోముల భగత్ అతికించిన పోస్టర్ల పైన బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డి పోస్టర్లు అతికించడం వివాదస్పదంగా మారింది. పాండురంగారెడ్డి అతికించిన పోస్టర్లను కొందరు యువకులు తొలగిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోస్టర్ల గొడవ పీఎస్ వరకు వెళ్లింది. పోస్టర్లు తొలగించిన యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని మందలించినట్లు తెలిసింది. దశాబ్ది ఉత్సవాల్లో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి గురించి ఎమ్మెల్యే ఫోటోలతో పోస్టర్లు అతికించారు. వాటిని తొలగించి మన సాగర్, మెరుగైన సాగర్ అనే పేరుతో ఎమ్మెల్యే పోస్టర్ల పైన బుసిరెడ్డి పోస్టర్లు అంటించడంతో ఇరువర్గాల నడమ గొడవలకు దారితీసింది.
మునుగోడు నియోజకవర్గంలో ఓవైపు బీఆర్ఎస్, మరోవైపు కాంగ్రెస్ లీడర్లు వాల్ పోస్టర్లు, రైటింగ్స్ కోసం గొడవలు పడుతున్నారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు అమిత్ రెడ్డి దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అంటించిన పోస్టర్లు ఆ పార్టీలో కలకలం రేపాయి. వచ్చే ఎన్నికల్లో మునుగోడు నుంచి అమిత్ పోటీ చేస్తాడనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో అతికించిన పోస్టర్లపైన స్థానిక ప్రజాప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మునుగోడు జడ్పీటీసీ నారబోయిన రవి వాల్ రైటింగ్స్ పైనా అమిత్ రెడ్డి పోస్టర్లు అతికించారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక మరోవైపు చల్లమల్ల కృష్ణారెడ్డి, పాల్వాయి స్రవంతి వర్గీయుల నడుమ గొడవలు తారస్థాయికి చేరాయి. నిన్నామొన్నటి వరకు పోస్టర్ల పంచాయితీ నడుస్తుండగా, తాజాగా పార్టీ మండల కమిటీ నియామకాల గొడవలు కృష్ణారెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసేవరకు వెళ్లాయి.
పట్టించుకోని అధికారులు...
మున్సిపాలిటీలు, నియోజకవర్గ కేంద్రాల్లో వెలుస్తున్న పోస్టర్లు, వాల్ రైటింగ్స్ పైన అధికారులు స్పందించడం లేదు. ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే తప్ప చర్యలు తీసుకోలేమని అధికారులు చెబుతున్నారు. సౌండ్సిస్టమ్, మీటింగ్‌లకు పర్మిషన్ తీసుకున్నట్టుగానే వాల్ పోస్టర్లు, రైటింగ్స్ విషయంలో కూడా పోలీసులు, సంబంధిత అధికారులు కఠినంగా వ్యవహరించాలని స్థానికులు కోరుతున్నా రు. బీఆర్ఎస్ లీడర్లే అయినప్పటికీ మున్సిపల్ కమిషనర్, కలెక్టరేట్విభాగంలోని అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. లేదంటే పోస్టర్లు, వాల్ రైటింగ్స్ కోసం వీధుల్లో గొడవలు జరుగుతాయని స్థానికులు చెపుతున్నారు. లీడర్ల సంగతి పక్కన పెడితే ఇరువర్గాల చెందిన యువకులు రోడ్ల పైకొచ్చి ఘర్షణలకు దిగుతున్నారని వాపోతున్నారు.