ఇంటర్ సెకండియర్ ఇంగ్లిష్ పేపర్‎లో కనిపించని క్వశ్చన్

ఇంటర్ సెకండియర్ ఇంగ్లిష్ పేపర్‎లో కనిపించని క్వశ్చన్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇంటర్ సెకండియర్ ఇంగ్లిష్ ఎగ్జామ్ సోమవారం జరిగింది. దీంట్లో 4 మార్కులకు సంబంధించిన ఏడో క్వశ్చన్‎లో ఓ చార్ట్‎లో ప్రింట్ సరిగా రాలేదు. క్వశ్చన్‎లోని ముద్రలో గీతలు సరిగా రాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కనీసం ఇంటర్ బోర్డు అధికారులు కూడా ప్రకటించకపోవడంతో కొందరు పరీక్ష కేంద్రాల్లోని సీఎస్, డీఓలకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో ఎట్టకేలకు స్పందించిన ఇంటర్ బోర్డు అధికారులు.. సబ్జెక్టు ఎక్స్ పర్ట్‎​లతో చర్చించారు.

దీంతో ఏడో క్వశ్చన్ రాసేందుకు ప్రయత్నించిన విద్యార్థులకు మార్కులు కేటాయిస్తామని ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య ప్రకటించారు. అయితే, చాలామంది విద్యార్థులు క్వశ్చన్ అర్థం కాక రాయ లేకపోయారనీ, కాబట్టి ప్రతి ఒక్కరికీ నాలుగు మార్కులు ఇవ్వాలని విద్యార్థులు, పేరెంట్స్ కోరుతున్నారు. మరోపక్క ఇంటర్ క్వశ్చన్ పేపర్ల క్వాలిటీపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కాగా, సోమవారం జరిగిన పరీక్షలను 4,46,992 మంది రాయాల్సి ఉండగా, 4,33,963 మంది హాజరయ్యారు. 13,029 మంది అటెండ్ కాలేదు.