వివాహేతర సంబంధం చిచ్చు: భర్తను భార్య.. వదినను మరిది హత్య

ఆగస్ట్ 2న కుత్బుల్లాపూర్ జీడిమెట్ల పోలీసు స్టేషన్ పరిధిలో వెలుగు చూసిన మహిళ హత్య కేసును పోలీసులు చేధించారు. మృతురాలిని రేణుకగా గుర్తించిన సూరారం పోలీసులు.. ఆమె భర్త సోదరుడే హత్య చేసినట్లుగా తేల్చారు. ఈ కేసులో నిందితుడితో సహా అతనికి సహకరించిన మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. అయితే ఈ హత్యకు దారితీసిన పరిస్థితులు తెలిస్తే.. ఒళ్లు జలధరించాల్సిందే.

ప్రేమ పెళ్లి.. ఏడేళ్ల దాంపత్య జీవితం

జీడిమెట్ల ఠాణా పరిధిలోని సంజయ్‌గాంధీనగర్‌లో నివసించే సురేష్, రేణుక భార్యాభర్తలు. వీరిది ప్రేమ వివాహం కాగా, వీరి దాంపత్య జీవితం ఏడేళ్ల పాటు సాఫీగానే సాగింది. అయితే రేణుక విలాసవంతమైన జీవితం కోసం అడ్డదారులు తొక్కింది. కల్లు, మద్యం తాగుతూ ఇతర చెడు వ్యసనాలకు బానిసైంది. ఈ క్రమంలో భర్తను వదలుచుకోవడం కోసం.. అతనికి ఓ బాలికతో రహస్యంగా పెళ్లి చేసింది. అనంతరం ఇద్దరు కలిసి అతని మెడకు శాలువాను బిగించి ఊపిరాడకుండా చేసి చంపారు. 

అనంతరం శవాన్ని ఓ సంచిలో పెట్టి రెండో అంతస్తు నుంచి ఇంటి ముందు రోడ్డుపై వదిలేశారు. ఆపై తన భర్తను ఎవరో చంపి.. ఇంటి ముందే మృతదేహాన్ని వదిలేసినట్లు కట్టుకథ అల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బంధువులు భార్యపై అనుమానం ఉందని చెప్పడంతో.. ఆమెను  అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించగా నిజం ఒప్పుకుంది.

పథకం ప్రకారం రేణుకను

భర్తను హతమార్చిన కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న రేణుక.. ఇటీవలే బెయిల్ పై బయటకొచ్చింది. ఈ విషయం తెలుసుకున్న మృతురాలి భర్త సోదరుడు నరేష్.. ఆమెను హతహమార్చాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో అన్న హత్య కేసు విషయంలో రాజీ కుదుర్చుకుందామని పిలిచి ఆమెతో కలిసి మద్యం సేవించాడు. అనంతరం మధ్య మధ్యలో ఉన్న ఆమెను సాయి, మన్నె పద్మల సహకారంతో హతమార్చాడు.