
జహీరాబాద్, వెలుగు : ట్రైడెంట్ చక్కెర కర్మాగారం జహీరాబాద్ నియోజకవర్గ రైతులకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. ఆదివారం హైదరాబాద్‌లోని మంత్రి స్వగృహంలో ఎంపీ బీబీ పటేల్, ఎమ్మెల్యే మాణిక్ రావు, కలెక్టర్ శరత్, ఎస్పీ రమణ కుమార్, రాష్ట్ర కెన్ కమిషనర్లతో మంత్రి సమావేశమై బిల్లులపై చర్చించారు. ట్రైడెంట్ యాజమాన్యం బిల్లులు చెల్లించకపోతే ఆర్ఆర్ యాక్ట్ ద్వారా ఆస్తులు స్వాధీనం చేసుకొని వేలం వేసి బిల్లులు ఇవ్వాలని మంత్రి సూచించారు.
బిల్లులు ఎప్పుడు చెల్లించేది యాజమాన్యం నుంచి రాతపూర్వకంగా తీసుకోవాలని, నిర్లక్ష్యంగా చేస్తే ఫ్యాక్టరీ లైసెన్స్ రద్దు చేసి చెరుకు జోన్ పరిధిని ఎత్తివేయాలని ఆదేశించారు. సమావేశంలో డీసీఎంఎస్ చైర్మన్ మల్కాపురం శివకుమార్, సీడీసీ చైర్మన్ ఉమాకాంత్ పటేల్, ఆత్మ చైర్మన్ పెంటా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.