ప్రీలాంచ్ ఆఫర్ల పేరుతో రూ.48 కోట్ల మోసం

ప్రీలాంచ్ ఆఫర్ల పేరుతో రూ.48 కోట్ల మోసం
  • ఆర్ హోమ్స్ ఇన్ ఫ్రా డెవలపర్స్ చైర్మన్, ఎండీ అరెస్ట్

గచ్చిబౌలి, వెలుగు: ప్రీ లాంచ్ ఆఫర్లు, ఫామ్​ల్యాండ్ లో ఇన్వెస్ట్​మెంట్​చేస్తే భారీ గా రిటర్న్​ఇస్తామంటూ భార్యభర్త కలిసి మోసం చేశారు. 200 మంది నుంచి రూ.48 కోట్లు వసూలు చేశారు. బాధితుల ఫిర్యాదుతో ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ (ఈవోడబ్ల్యూ) పోలీసులు ఆర్ హోమ్స్ ఇన్​ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ చక్కా భాస్కర్, అతని భార్య సుధారాణిని సోమవారం అరెస్ట్ చేశారు. సైబరాబాద్ ఈవోడబ్ల్యూ డీసీపీ ప్రసాద్ వివరాల మేరకు కూకట్​పల్లికి చెందిన చెక్కా భాస్కర్, సుధారాణి ఆర్ హోమ్స్ ఇన్ ఫ్రా డెవలపర్స్ ప్రారంభించారు. ఈ సంస్థకు భాస్కర్ చైర్మన్​గా, సుధారాణి ఎండీ ఉన్నారు.

ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో ప్రకటనలు

ఘటకేసర్ మండలం యమ్నంపేటలో బ్లిస్ హైట్స్ ప్రాజెక్ట్, పటాన్​చెరు.. కర్దనూర్ వద్ద ఓఆర్ఆర్ హైట్స్ ప్రాజెక్ట్, సంగారెడ్డి జిల్లాలోని కారముంగి, మురిగి, చీమలపహడ్ గ్రామాల్లో ఫామ్ ల్యాండ్ ప్రాజెక్టులు చేపడుతున్నట్లు భాస్కర్, సుధారాణి సోషల్ మీడియా, మీడియాలో సెలబ్రిటీలతో పెద్ద ఎత్తున ప్రకటనలు గుప్పించారు. ప్రాజెక్టులకు ఎలాంటి అనుమతులు లేకున్నా ఆకర్షణీయమైన బ్రోచర్లతో ప్రచారం చేశారు. మార్కెట్​రేటు కంటే తమ ప్రాజెక్టులో తక్కువ ధరకు ఫ్లాట్లు, ఫామ్ ల్యాండ్​లు ఇస్తామని భారీగా రిటర్న్స్ ఉంటాయని నమ్మించారు. మూడేండ్లలో ప్రాజెక్టులు పూర్తి చేసి ఇస్తామని, ఒకవేళ ఇవ్వకపోతే 2బీహెచ్​కే ఫ్లాట్ కు నెలకు రూ.6,000, 3బీహెచ్​కే ఫ్లాట్​కు రూ.8,000 చొప్పున కిరాయి చెల్లిస్తామని చెప్పారు.

ఆఫీస్ మూసేసి పరార్

కొంపల్లికి చెందిన మనోజ్​కు మార్ అనే వ్యాపారి ఆర్ హోమ్స్ ఇన్​ఫ్రా డెవలపర్స్​కు చెందిన మూడు ప్రాజెక్టుల్లో రూ.65.50 లక్షలు ఇన్వెస్ట్ చేశారు. మూడేండ్లు గడిచినా ఫ్లాట్లు అందజేయకపోవడం, దాంతో పాటు ప్రతి నెల ఇస్తామన్నా అద్దె కూడా ఇవ్వలేదు. పెట్టుబడి పెట్టిన మరికొందరితో కలిసి డబ్బులు తిరిగివ్వాలని అడగడంతో భార్యాభర్తలిద్దరూ పరారయ్యారు. మోసపోయినట్లు గుర్తించిన మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.